Richest Farmer in India: వ్యవసాయం అనేది ఒక జూదం లాంటిది. పండించిన పంట చేతికి వచ్చేదాకా కష్టమే. చేతికి వచ్చినప్పటికీ మద్దతు దక్కడం కష్టమే. ఇన్నేసి ఇబ్బందుల మధ్య పంట పండించిన రైతులకు చివరికి మిగిలేవి అప్పులే. ఆ అప్పులను తీర్చలేక రైతులు పడే కష్టాలు మామూలువి కావు. అందువల్లే ఈ దేశంలో రైతులు ఇప్పటికీ పేదలుగానే ఉన్నారు. పేదలుగానే పోతున్నారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఎన్ని విధాలుగా కష్టపడినప్పటికీ రైతులకు గిట్టుబాటు అనేది ఎండమావి అవుతోంది. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నచోట ఒక రైతు మాత్రం ఆగర్భ శ్రీమంతుడిగా రూపాంతరం చెందాడు. కోట్ల రూపాయల టర్నోవర్ తో తిరుగులేని స్థాయిలో నిలిచాడు.
అతని పేరు రాజారాం త్రిపాఠి. అతడు ఉండేది ఉత్తర భారత దేశంలోని ఓ రాష్ట్రంలో. రాజారాం ఉన్నత చదువులు చదివాడు. ఆయన చదివిన చదువుకు ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చింది. కానీ అనుకోకుండా బ్యాంకింగ్ రంగం వైపు వెళ్లిపోయాడు. మేనేజర్ స్థాయి దాకా పనిచేశాడు. ప్రభుత్వ రంగ బ్యాంకులో మేనేజర్ స్థాయిలో పని చేసినప్పటికీ అతనికి వ్యవసాయం అంటే చాలా ఇష్టం ఉండేది.. బ్యాంకు ఉద్యోగం చేస్తున్నప్పటికీ వ్యవసాయం గురించి నిత్యం అధ్యయనం చేస్తూ ఉండేవాడు. ఆ అధ్యయనమే అతడిని శ్రీమంతుడిని చేసింది. రాజారామ్ పదవీ విరమణ చేసిన తర్వాత వ్యవసాయంలోకి వచ్చాడు. అతడు వ్యవసాయం చేయడానికి చూసి చాలామంది నవ్వారు. బ్యాంకు ఉద్యోగం చేసిన తర్వాత వ్యవసాయంలోకి ఎందుకు వచ్చావు అంటూ ఎగతాళి చేశారు.. మొదట్లో ఆయన టమాటాలు, క్యాబేజీ పంటలు పండించేవాడు. అవి ఆయనకు అంతగా లాభసాటిగా ఉండేవి కాదు. చివరికి ఔషధ మొక్కల పెంపకాన్ని చేపట్టాడు. ముస్లి, అశ్వగంధ, స్టీవియా వంటి మొక్కలను పెంచడం ప్రారంభించాడు. ఆ తర్వాత మార్కెటింగ్ కూడా చేయడం ప్రారంభించాడు. దాదాపు 400 ఆదివాసి రైతులతో అతడు ఒక ఔషధ మొక్కల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. దీనికోసం బ్యాంకు నుంచి 22 లక్షల రుణాన్ని తీసుకున్నాడు. అంత మంది రైతులతో అతని పడిన కష్టం వృధాగా పోలేదు. ప్రస్తుతం అతడి వ్యవసాయ క్షేత్రంలో పండిన అశ్వగంధ, స్టీవియా అమెరికా, యూరప్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అతడి మార్కెటింగ్ నైపుణ్యం వల్ల.. భారీగా లాభాలు వస్తున్నాయి. ఎగుమతుల ద్వారా అతడు 25 కోట్లకు మించిన టర్నోవర్ సాధిస్తున్నాడు. అంతేకాదు మూడు సార్లు జాతీయ ఉత్తమ రైతు పురస్కారం అందుకున్నాడు.
రాజారాం వద్ద ప్రస్తుతం వెయ్యి ఎకరాల భూమి, 9 ఫారం హౌసులు, ఒక హెలికాప్టర్ ఉంది. ఔషధ మొక్కల సాగులో రాజారాం ఎటువంటి కృత్రిమ పద్ధతులను పాటించడు. పూర్తిగా సేంద్రియ విధానంలోనే వీటిని సాగు చేస్తాడు. అధునాతన యంత్రాలను ఉపయోగిస్తాడు. మార్కెటింగ్ నైపుణ్యంలో ఇతడికి తిరుగులేదు. పైగా ప్యాకింగ్ విషయంలో అత్యంత జాగ్రత్త వహిస్తుంటాడు తోటి రైతులను కేవలం కూలీలుగా కాకుండా.. వారిని కూడా యజమానులుగా పరిగణిస్తుంటాడు. భూమిలో ఉన్న సారాన్ని పరిశీలించిన తర్వాతే అందులో పంటలు వేస్తుంటాడు. అందువల్లే రాజారాం ఈ స్థాయిలో విజయవంతమయ్యాడు. మొదట్లో అతడు సాగుచేసిన టమాటో, క్యాబేజీ లాభాలను ఇవ్వకపోగా అతనికి తీవ్ర ఇబ్బందులను కలిగించాయి. అందువల్లే రాజారాం ఔషధ మొక్కల పెంపకం విభాగంలోకి వచ్చాడు. ఈ రోజున తిరుగులేని స్థాయిలో నిలబడ్డాడు. అందు గురించే వ్యవసాయాన్ని కాలానికి అనుగుణంగా చేయాలి. పంటలు కూడా డిమాండ్ కు తగ్గట్టుగా పండించాలి. అప్పుడే రైతు విజయవంతమవుతాడు. అప్పుల నుంచి తేరుకుంటాడు.
View this post on Instagram