Crude Oil Prices: పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం రోజురోజుకూ పెరుగుతోంది. పరస్పర దాడులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు చమురు సరఫరాలకు అంతరాయం కలిగిస్తాయని ఆందోళనలు ఉన్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ సమయంలోనే అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర తగ్గుదల కనిపిస్తోంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్‌లో 1.20 శాతం పతనం తర్వాత బ్యారెల్ ముడి చమురు ధర 74.65 డాలర్లుగా కనిపిస్తుంది. ఇది కాకుండా, అంతర్జాతీయ బెంచ్‌మార్క్ అంటే బ్రెంట్ క్రూడ్ 1.21 శాతం చౌకగా మారింది. ఇది బ్యారెల్‌కు 78.08డాలర్లకు దిగొచ్చింది. ఇజ్రాయెల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హిజ్బుల్లా ఆదివారం బిన్యామీనా సమీపంలోని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(IDF) స్థావరంపై డ్రోన్ దాడి చేసింది. ఉత్తర ఇజ్రాయెల్ నగరమైన బిన్యామినాలో నలుగురు ఇజ్రాయెలీ భద్రతా దళ సైనికులు మరణించారు. డజన్ల కొద్దీ గాయపడినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం తీవ్రమయ్యే ముందు.. ముడి చమురు ధరలు స్థిరంగా ఉన్న సమయంలో భారత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయన్న ఆశలు చిగురించాయి. చౌకైన పెట్రోల్, డీజిల్ లభిస్తుందని సామాన్యుడు ఆనందపడ్డాడు. కానీ, మధ్యప్రాచ్యంలో యుద్ధ మంటలు చెలరేగిన వెంటనే, క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నట్లు నివేదికలు రావడం ప్రారంభించాయి. ఈ పరిస్థితి భారతదేశానికి కొంత గందరగోళంగా తయారైంది. చమురు ధరల్లో ఇదే విధమైన పెరుగుదల ఉంటే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే స్థితిలో ప్రభుత్వం లేదని ప్రభుత్వ వర్గాల నుండి సమాచారం. భవిష్యత్తులో దేశ పౌరులు ఇంకాస్తా ఎక్కువ ధరలు చెల్లించాల్సిన పరిస్థితి కూడా లేకపోలేదు.
ఈ గందరగోళ కాలాన్ని భారత్ ఎలా ఎదుర్కొంటుంది?
భారతదేశం ప్రస్తుతం తన చమురు అవసరాలలో 40 శాతం రష్యా నుండి దిగుమతి చేసుకుంటోంది. ఇరాన్ నుండి చమురు దిగుమతి చాలా తక్కువ శాతం. ఈ కారణంగా భారతదేశంలో అకస్మాత్తుగా భయాందోళన పరిస్థితులు ఏర్పడతాయని అనుకోవడానికి లేదు. కానీ ప్రభుత్వం కూడా ఈ చర్యలను కూడా నిశితంగా పరిశీలిస్తోంది.
ప్రస్తుతం, ముడి చమురు పెరుగుదల అవకాశాలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చడం లేదు. అందువల్ల ముడి చమురులో కొనసాగుతున్న హెచ్చుతగ్గులపై నిఘా ఉంచాలని చమురు మార్కెటింగ్ కంపెనీలకు సూచనలు కూడా వెళ్లాయి. ముడిచమురు ధర పెరిగిన తర్వాత రూపాయి పతనం అయ్యే అవకాశం ఉంది. ఇది కాకుండా, సాధారణ ప్రజలకు ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ రేట్లపై ఎటువంటి ఉపశమనం లభించలేదు. అయితే, ప్రభుత్వం ఎన్నికల మైలేజీని తీసుకోవాలని ప్రయత్నిస్తే రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలోపు ఇంధన ధరలను తక్కువ చేసే అవకాశం కూడా ఉంది.
భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల వల్ల భారతదేశం కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఎంపీసీ సమావేశం తర్వాత పరిస్థితిని గమనిస్తున్నట్లు తెలిపింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో రూపాయి పతనం కాకుండా సెంట్రల్ బ్యాంక్ జాగ్రత్తలు తీసుకుంటూ అనేక ఇతర చర్యలకు కూడా కృషి చేస్తోంది.