గతేడాది కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల అమలు వల్ల దేశంలో ఉద్యోగుల, వ్యాపారుల ఆదాయం భారీగా తగ్గింది. పలు ప్రైవేట్ కంపెనీలు వేతనాలను తగ్గించగా సాధారణ పరిస్థితులు ఏర్పడినా వేతనాలు మాత్రం పెరగలేదు. దేశంలో సాధారణ పరిస్థితులు ఏర్పడినప్పటికీ ప్రజలకు ఆదాయం తగ్గినా ఖర్చులు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు అంతకంతకూ పెరుగుతుంటే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరగడం గమనార్హం.
గత మూడు రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండగా ఈరోజు మాత్రం ధరలు పెరగడం గమనార్హం. న్యూఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు 25 పైసల చొప్పున పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర 84.95 రూపాయలుగా ఉంది. ముంబై నగరంలో లీటర్ పెట్రోల్ ధర 91.56 రూపాయలకు చేరింది. హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ దరలు 26 పైసలు పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర 88.37 రూపాయలు, లీటర్ డీజిల్ ధర 81.99 రూపాయలకు చేరింది.
హైదరాబాద్ లో పెట్రోల్ ధర 90 రూపాయలు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ ఏడాది పెట్రోల్ ధర 100 రూపాయలకు చేరుతుందేమోనని వ్వాహనదారుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2020 సంవత్సరంలో తొలిసారి లీటర్ పెట్రోల్ ధర 80 రూపాయలకు చేరుకుంది. ఆ తరువాత పెట్రోల్ ధర అంతకంతకూ పెరుగుతోంది.
రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో వాహనదారులకు ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుంటే అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ తగ్గుతుండటం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తే బాగుంటుందని వాహనదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.