Petrol: భారత్, పాకిస్తాన్ రెండు దేశాలు యుద్ధం అంచున నిలిచాయి. గత కొన్ని రోజులుగా ఇరు దేశఆల మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధం మొదలైతే దేశంలో అనేక వస్తువుల కొరత ఏర్పడుతుందనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. అందుకే చాలా మంది ఇళ్లలో సరుకులు, నిత్యావసర వస్తువులు నిల్వ చేసుకోవడం మొదలుపెట్టారు. అంతేకాకుండా, యుద్ధం వస్తే పెట్రోల్, డీజిల్ కొరత కూడా ఏర్పడవచ్చని ప్రజలు భయపడుతున్నారు. దీని కారణంగా కొన్ని చోట్ల పెట్రోల్ బంకుల వద్ద కూడా పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా కొందరు ఇదే విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. కానీ నిజానికి అలాంటిదేమీ జరుగదు.
Also Read: భారత్-బ్రిటన్ డీల్: టాటా మోటర్స్‌కు కాసుల వర్షం!
ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ (IOCL), భారత్ పెట్రోలియం (BPCL) ఇటీవల సోషల్ మీడియా ద్వారా దేశ ప్రజలకు తగినంత నిల్వలు ఉన్నాయని హామీ ఇచ్చాయి. ఉద్రిక్తతల మధ్య దేశంలో ఎలాంటి చమురు కొరత ఉండదని, సరఫరా కూడా ప్రభావితం కాదని కంపెనీలు స్పష్టం చేశాయి. ఆందోళన చెంది కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని కంపెనీలు తెలిపాయి. పెట్రోల్, డీజిల్‌తో పాటు LPG వంటి ఇంధనాలు అన్ని దుకాణాల్లోనూ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
24 గంటల్లో పెరిగిన ఉద్రిక్తత
ఈ ప్రకటన భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ నేపథ్యంలో వచ్చింది. గత 24 గంటల్లో ఇరువైపుల నుంచి ప్రతిస్పందన కాల్పులతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇటీవల మీడియా నివేదికల ప్రకారం.. పంజాబ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ప్రజలు ఆందోళనతో కొనుగోళ్లు చేస్తున్నారు. ప్రజలు చమురును నిల్వ చేసుకోవడానికి క్యూలలో నిలబడుతున్నారు.
ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో ఒక పోస్ట్‌లో IOCL ఇలా రాసుకొచ్చింది.. “ఇండియన్ ఆయిల్ దేశవ్యాప్తంగా తగినంత ఇంధన నిల్వలను కలిగి ఉంది. మా సరఫరా మార్గాలు సజావుగానే సాగుతున్నాయి. భయపడి ముందస్తుగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. మా అన్ని అవుట్‌లెట్‌లలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజి ఎంతకావాలంటే అంత అందుబాటులో ఉన్నాయి.” ఇదే తరహా ప్రకటనను భారత్ పెట్రోలియం కూడా విడుదల చేసింది.
నకిలీ వార్తల పట్ల అప్రమత్తంగా ఉండండి
పౌరులు భయాందోళనలకు గురికాకుండా లేదా తప్పుడు వార్తలను నమ్మకండి. మీరు సరిహద్దుకు సమీపంలో నివసిస్తుంటే ముందు జాగ్రత్త చర్యగా మీ వాహనంలో ఇంధనం నింపుకోవడం మంచి పని.