దేశంలో పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల సామాన్య, మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజల ఆదాయం తగ్గుతుంటే చమురు కంపెనీలు మాత్రం వాహనదారులకు షాక్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలు దాటింది. పెట్రోల్ ధర సెంచరీ మార్క్ దాటడంతో సామాన్య ప్రజలు తెగ టెన్షన్ పడుతున్నారు.
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు పెట్రోల్ ధరలు స్థిరంగా ఉండగా ఎన్నికల తరువాత పెట్రోల్ ధరలు అంతకంతకూ పెరిగాయి. మే నెలలో ఏకంగా 16సార్లు పెట్రోల్ ధరలు పెరగడం గమనార్హం. తాజాగా మళ్లీ ధరలు పెరగడంతో వాహనదారులు ఆందోళన చెందుతుండగా రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. ఇరాన్ పై అమెరికా ఆంక్షల ప్రభావం పెట్రోల్ ధరలపై ఉండనుందని సమాచారం.
ప్రపంచ మార్కెట్ లో బ్యారెల్ ముడి చమురు ధర 75 డాలర్ల వరకు పలికే సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత్ ఇంధన అవసరాల కొరకు 85 శాతం దిగుమతులపై ఆధారపడి ఉండటం గమనార్హం. అమెరికా ఇరాన్ పై ప్రస్తుతం అమలు చేస్తున్న ఆంక్షలు ఎత్తివేస్తే ముడి చమురు చౌకగా లభించి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయి. లేకపోతే మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ కు 2 నుంచి 3 రూపాయలు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.
ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గిస్తే మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా అడుగులు వేస్తాయేమో చూడాల్సి ఉంది.