Noel Tata : భారతదేశ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. రతన్ టాటా అక్టోబర్ 9న ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు. ఆయన 86 సంవత్సరాల వయస్సులో ప్రపంచానికి వీడ్కోలు పలికారు. దీంతో దేశ వ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మరణవార్త అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అందరూ కన్నీటి కళ్లతో ఆయనకు వీడ్కోలు పలికారు. దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆయన చేసిన కృషిని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఆయన పారిశ్రామికవేత్త మాత్రమే కాదు పేదల పాలిట పెన్నిది కూడా. బిలియన్లకు యజమాని అయినా అతను తన జీవితాన్ని సాధాసీదాగా గడిపారు. ఆయన భారతీయుల హృదయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నారు. ఆయన వెళ్లిన తర్వాత తన సోదరుడు నోయెల్ టాటా రంగంలోకి దిగారు. ప్రస్తుతం నోయెల్ టాటా.. టాటా ట్రస్ట్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అడుగుపెట్టగానే తను తొలివిజయాన్ని అందుకున్నారు. రతన్ టాటా మరణించి సరిగ్గా వారం కూడా కాక ముందే నిన్న టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ రానున్న కాలంలో టాటా గ్రూప్ ఐదు లక్షల ఉద్యోగులు కల్పించనున్నట్లు ప్రకటించారు. తాజాగా టాటా గ్రూప్ కు మరో విజయం సొంతమైంది. సెప్టెంబరు త్రైమాసికంలో డీమార్ట్ పేరెంట్ కంపెనీ అవెన్యూ సూపర్ మార్కెట్లలో షేర్లు భారీగా క్షీణతను నమోదు చేసింది. నేడు ఇంట్రాడేలో దాని షేర్లు కొంత పుంజుకున్నాయి. రాధాకిషన్ దమానీ నేతృత్వంలోని డీమార్ట్ కంపెనీని టాటా గ్రూప్ నకు చెందిన ట్రెంట్ అధిగమించేసింది. ప్రస్తుతం ట్రెంట్ కంపెనీ మార్కెట్ విలువ రూ.2.93 లక్షల కోట్లు ఉండగా.. అవెన్యూ సూపర్ మార్ట్స్ మార్కెట్ క్యాప్ రూ.2.73 లక్షల కోట్ల వద్దకు పడిపోయింది. ప్రస్తుతం ఈ వార్త స్టాక్ మార్కెట్లతో పాటు వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
బలహీనమైన రెండవ త్రైమాసిక ఫలితాల తర్వాత అనేక బ్రోకరేజ్ సంస్థలు అవెన్యూ సూపర్ మార్ట్స్ షేర్లను డౌన్‌గ్రేడ్ చేశాయి. అలాగే కంపెనీ షేర్ల టార్గెట్ ధర రూ.3,702కి తగ్గింది. ఒక్కరోజులోనే ఆ కంపెనీ షేర్లు 9 శాతం పడిపోయిన సంగతి తెలిసిందే. డిమార్ట్ తాజా క్యూ2 ఫలితాల్లో గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే కేవలం 8 శాతం లాభం పెరిగింది. ఇదే క్రమంలో అంతకుముందు త్రైమాసిక ఫలితాలను పరిశీలిస్తే.. లాభాల్లో 12 శాతం తగ్గుదల కనిపించింది. నిజానికి, డిమార్ట్ కు కిరాణా వ్యాపారంలో గట్టి పోటీని ఎదుర్కొంటోంది. దేశంలో క్విక్ కామర్స్ రంగం వేగంగా పుంజుకోవడంతో వ్యాపారాన్ని కోల్పోతోంది.
టాటా ట్రస్ట్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా మరణించిన తర్వాత నోయెల్ టాటా ట్రస్ట్ చైర్మన్ గా నియమితులయ్యారు. దీని తర్వాత ట్రెంట్ స్టాక్స్ పెరగడంతో కంపెనీ మార్కెట్ విలువ కూడా పెరిగింది. గత వారం ట్రెంట్ ల్యాబ్‌లో పెరిగిన వజ్రాలను విక్రయించడానికి ‘BOM’ అనే బ్రాండ్‌ను షురూ చేసింది. వెస్ట్ సైడ్ స్టోర్లలో విక్రయాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని కారణంగా షేరు ధర 2 రోజుల్లో 2శాతంమేర పెరిగింది. ఈరోజు మార్కెట్ ముగిసే సమయానికి రెండు కంపెనీల షేర్ల ధరలను పరిశీలిస్తే.. డీమార్ట్ షేరు ధర 1 శాతానికి పైగా పడిపోయి ఎన్‌ఎస్‌ఈలో ఒక్కో షేరు రూ.4150 వద్ద ట్రేడింగ్ ముగిసింది. అలాగే, ట్రెంట్ స్టాక్ ధర 3.92 శాతం పడిపోయిన తర్వాత చివరకు ఎన్‌ఎస్‌ఇలో రూ.7805.80 వద్ద ముగిసింది.