US Used Cars : అమెరికా శత్రుదేశం రష్యా. ఈ రెండు దేశాలు ప్రపంచంలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ రెండు దేశాలకు ప్రపంచంలోని మిగతా దేశాలు వర్గాలుగా విడిపోయి మద్దతు తెలుపుతున్నాయి. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లు.. అమెరికాకు శత్రువైన రష్యాకు చైనా మిత్రదేశం. ఇలా కొన్ని అమెరికా శత్రుదేశాలు రష్యాతో స్నేహం చేస్తున్నాయి. ఇక రష్యా వ్యతిరేక దేశాలు అమెరికాతో దోస్తీ చేస్తున్నాయి. దక్షిణ కాకస్ ప్రాంతంలోని చిన్న దేశం జార్జియా. యూజ్డ్(ఉపయోగించిన) కార్ల అంతర్జాతీయ మార్కెట్ ఇది. ఇక్కడ ఏటా వేల కోట్ల రూపాయల విలువైన యూజ్డ్ కార్ల వ్యాపారం జరుగుతుంది. ఇక్కడి మార్కెట్‌లోని వాహనాల్లో ఎక్కువ భాగం అమెరికాలో దెబ్బతిన్న వాహనాలే. అయితే ఇక్కడి వాహనాల్లో ఎక్కువ భాగం అమెరికా శత్రుదేశమైన రష్యాకు చేరడం కొసమెరుపు.
అన్నిరకాల కార్లు..
జార్జియా రాజధాని టిబిలిసి నగరానికి ఆగ్నేయంగా 20 కిలోమీటర్ల దూరంలో ఓపెన్ ఎయిర్ కార్ పార్కులకు అనుకూలమైన విస్తారమైన ప్రాంతం ఉంది. 40 ఫుట్‌బాల్ మైదానాలకన్నా పెద్దగా ఉండే ఈ ప్రాంతంలో వేలాది వాహనాలు అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి. ప్రపంచంలోనే అనేక ఫేమస్ మోడల్ కార్లు ఇక్కడ దొరుకుతాయి. మెర్సిడెస్, జాగ్వార్, టయోటాటోపాటు టెస్లా వరకు అన్నిరకాల కార్లు ఇక్కడ దొరుకుతాయి. ఇక జార్జియాలోని అతిపెద్ద కార్ల మార్కెట్‌లో కాకసస్ ఆటో ఇంపోర్ట్ ఒకటి. ఈ కంపెనీ అమెరికాలో వాడిన కార్లను వేలంలో కొనుగోలుచేస్తుంది. వాటిలో ప్రమాదాలలో బాగా దెబ్బతన్ని వాహనాలు ఎక్కువగా ఉంటాయి. అమెరికా ఇన్సూరెన్స్ సంస్థలు వాటిని వేలం వేస్తాయి.
జార్జియాకు చేరిన తర్వాత..
ఇలా వేలంలో కార్లు కొనుగోలు చేసిన కంపెనీలు తమ నిపుణుల బృందంతో అమెరికాలోని ఆయా ప్రాంతాల నుంచి కార్లను సేకరించి కంటెయినర్ షిప్‌లో ఎగుమతి చేస్తారు. అమెరికాకు 10 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్ల సముద్రం తీరంలోని జార్జియా పోర్టుకు చేరుకుంటాయి. దెబ్బతిన్న కార్లను జార్జియాలోని మెకానిక్‌లు అక్కడ బాగుచేస్తారు. తర్వాత వాటిని యూజ్డ్ కార్లుగా విక్రయిస్తారు.
భారీ డిమాండ్..
పశ్చిమ దేశాలు తయారు చేసే వాహనాలకు ప్రపంచవ్యాప్తగా భారీగా డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని జార్జియాలోని కంపెనీలు యూజ్డ్ కార్ల వ్యాపారం చేస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 2023లో జార్జియా రూ.26 వేల కోట్లకుపైగా విలువైన కార్లను దిగుమతి చేసుకుంది. రూ.17 వేల కోట్లకుపైగా విలువైన కార్లను ఎగుమతి చేసింది. కాకసస్‌లోని మాజీ సోవియట్ రిపబ్లిక్‌లు, మధ్య ఆసియా దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతాయి. జార్జియా ఎగుమతుల్లో రాగి మొదటిస్థానంలో ఉండగా, కార్లు రెండో స్థానంలో ఉంది.