Yanamala Political Future: తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) చంద్రబాబుకు అండగా హేమాహేమీలు ఉండేవారు. దేవేందర్ గౌడ్, ఎర్రం నాయుడు, అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి.. ఇలా చెప్పుకుంటూ పోతే నమ్మకస్తులైన నేతలు చాలామంది ఉండేవారు. 1995లో టిడిపి సంక్షోభ సమయంలో చాలామంది సీనియర్లు చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థించారు. అంతటి క్లిష్ట సమయంలో.. ఎన్టీఆర్ లాంటి నేతనుంచి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు చంద్రబాబుకు అన్ని విధాలా సహకరించారు. చంద్రబాబు సైతం సీనియర్ల విషయంలో ఎప్పుడు అన్యాయం చేయలేదు. పదవులను ఇచ్చారు. ఎనలేని ప్రాధాన్యం కల్పించారు. అయితే ఇప్పుడు అశోక్ గజపతి రాజును ఏకంగా ఓ రాష్ట్రానికి గవర్నర్ గా పంపించారు చంద్రబాబు. అయితే ఇప్పుడు మరో సీనియర్ యనమల రామకృష్ణుడు విషయంలో చంద్రబాబు ఏ ఆలోచనతో ఉన్నారో తెలియాల్సి ఉంది.
సీనియర్ మోస్ట్ లీడర్..
తెలుగుదేశం పార్టీలో యనమల రామకృష్ణుడు( yanamala Ramakrishnudu) సీనియర్ మోస్ట్ లీడర్. 1983 నుంచి అదే పార్టీలో కొనసాగుతున్నారు. టిడిపి ప్రభుత్వం చేపట్టిన ప్రతిసారి ఆయన ఆర్థిక శాఖ మంత్రి పదవి తీసుకునేవారు. యనమల అయితే లెక్క సరిపోతుందని చంద్రబాబు లెక్క. చంద్రబాబు రాజకీయ ఉన్నతికి కూడా యనమల రామకృష్ణుడు ఒక కారణం. 1995లో టిడిపి సంక్షోభ సమయంలో శాసనసభ స్పీకర్ గా యనమల రామకృష్ణుడు ఉండేవారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ను కాదని.. మంత్రిగా ఉన్న చంద్రబాబు వైపు మొగ్గు చూపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టేందుకు సహకారం అందించారు. ఒక విధంగా చెప్పాలంటే స్పీకర్ యనమల తీసుకున్న నిర్ణయమే చంద్రబాబు ఇంతటి ఉన్నతికి కారణం.
Also Read: Vizianagaram Political Update: ఆ జిల్లాలో టిడిపికి నాయకుడు కావలెను!
గౌరవమైన పదవీ విరమణ
అయితే ఇప్పుడు యనమల గౌరవప్రదమైన రిటైర్మెంట్ కోరుకుంటున్నారు. వాస్తవానికి అశోక్ గజపతిరాజు( Ashok gajapathi Raju ) సైతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో కుమార్తె అదితి గజపతిరాజును అసెంబ్లీకి పంపించారు. యనమల రామకృష్ణుడు సైతం తన కుమార్తె దివ్యకు టిక్కెట్ ఇప్పించుకున్నారు. ఆమె సైతం గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టింది. మార్చి వరకు ఎమ్మెల్సీ పదవిలో కొనసాగారు యనమల. ఎమ్మెల్సీగా మరోసారి ఆయనకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు అశోక్ గజపతిరాజుకు గవర్నర్ గా అవకాశం ఇవ్వడంతో.. యనమల రామకృష్ణుడు కు ఏ అవకాశం ఇస్తారన్న ప్రచారం నడుస్తోంది. అయితే యనమల మదిలో రాజ్యసభ పదవి ఉంది. తప్పకుండా యనమలను చంద్రబాబు రాజ్యసభకు పంపిస్తారని ఒక ప్రచారం అయితే ఉంది. అయితే 2026 ద్వితీయార్థంలోనే రాజ్యసభకు ఎన్నికలు జరుగుతాయి. అప్పటివరకు యనమలకు వెయిటింగ్ తప్పదు.