Mobile Recharge Price Hike: భారత టెలికాం రంగంలో రెండేళ్ల క్రితం వరకు తీవ్ర పోటీ నెలకొంది. జీయో ఈ రంగంలోకి వచ్చిన తర్వాత తక్కువ చార్జీలకే హైస్పీడ్ ఇంటర్నెట్, టాక్‌టైం అందించి అప్పటి వరకు స్థిరపడిన ప్రైవేటు సంస్థలు ఐడియా, ఎయిర్‌టెల్‌తోపాటు పలు సంస్థలకు షాక్ ఇచ్చింది. దాదాపు రెండు మూడేళ్లు తక్కువ చార్జీలతో ఎక్కువ మంది కస్టమర్లను పెంచుకుంది. రెండేళ్లుగా చార్జీలు బాదుతూ షాక్ ఇస్తోంది. దీంతో అప్పటి వరకు డీలా పడిన ప్రైవేటు టెలికాం సంస్థలు కోలుకుంటున్నాయి. తాజాగా సిండికేట్ తరహాలో చార్జీలు పెంచుతున్నాయి. 2026 జూన్ నుంచి రీఛార్జ్ ప్లాన్ ధరలు పెంచేలా ప్లాన్ చేస్తున్నాయి. జెఫ్రీస్, మోర్గాన్ స్టాన్లీ వంటి అంతర్జాతీయ విశ్లేషణ సంస్థలు 15 నుంచి 20 శాతం వరకు ఈ హైకే జరగవచ్చని అంచనా వేశాయి. ఈ మార్పు ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రెండు రకాల సేవలను కూడా ప్రభావితం చేస్తుంది.
వ్యూహాత్మక మార్పులు..
ఇప్పటికే కొన్ని టెలికాం సంస్థలు తమ ప్లాన్ నిర్మాణాన్ని మార్చుతున్నాయి. చవకైన ఎంపికలను తొలగించి, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీలు, ప్రీమియం సేవలతో కూడిన ఉన్నత ధరల ప్లాన్‌లపై దృష్టి పెడుతున్నాయి. ఈ వ్యూహం వినియోగదారుల నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని గణనీయంగా పెంచుతోంది.
యూజర్లపై ప్రభావం..
ఈ ధరల పెరుగుదలతో వినియోగదారుల జేబులకు చిల్లు పడుతోంది. ముఖ్యంగా రోజువారీ వినియోగదారులకు కంపెనీలు ప్రీమియం లాభాలతో కూడిన కొత్త ఎంపికలను అందించడం వల్ల కొంత ఉపశమనం లభిస్తోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు తమ అవసరాలకు అనువైన ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి.