Microsoft Vs Apple: యాపిల్ కంపెనీ సరసన మైక్రోసాఫ్ట్.. ఎందుకో తెలుసా?

గ్లోబల్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ తొలిసారిగా 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడంతో అమెరికన్ మార్కెట్లు దూసుకుపోయాయి. ముఖ్యంగా ఇన్వెస్టర్లు మైక్రోసాఫ్ట్ షేర్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : January 25, 2024 2:31 pm
Follow us on

Microsoft Vs Apple: ఆర్థిక మాంద్యం చుక్కలు చూపిస్తోంది. కొనుగోళ్ళు తగ్గిపోవడం, ఆర్థిక మందగమనం కొనసాగుతుండంతో పెద్దపెద్ద కంపెనీలు లే ఆఫ్ లు ప్రకటిస్తున్నాయి. వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. గూగుల్ నుంచి మొదలు పెడితే మైక్రోసాఫ్ట్ దాకా ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో మార్కెట్ వర్గాల్లో గురువారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచానికి విండోస్ ను పరిచయం చేసిన మైక్రోసాఫ్ట్ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఫలితంగా కార్పొరేట్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద కంపెనీగా అవతరించింది. అంతేకాదు దిగ్గజ యాపిల్ సంస్థ సరసన చేరింది.

ఇప్పటివరకు యాపిల్ కంపెనీకి మాత్రమే మార్కెట్ విలువ అధికంగా ఉండేది. అది తయారు చేసే ఫోన్లు, కంప్యూటర్లు, లాప్టాప్ లు, ట్యాబ్ లకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంటుంది. ప్రతి సంవత్సరం అది విడుదల చేసే యాపిల్ ఫోన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ఎదురు చూస్తూ ఉంటారు. తన ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ యాపిల్ కంపెనీ ఏటికేడు అనితర సాధ్యమైన ఆర్థిక అభివృద్ధిని నమోదు చేస్తుంటుంది. గత రెండు సంవత్సరాలుగా అమెరికాలో, యూరప్ మార్కెట్లో ఆర్థిక మందగమనం కొనసాగుతున్నప్పటికీ యాపిల్ మెరుగైన వృద్ధిరేటునే కొనసాగిస్తోంది. ఈ క్రమంలో అది ఏకంగా 3 ట్రిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగింది. అయితే ఆ కంపెనీ సరసన నిన్నటివరకు ఏ కంపెనీ కూడా నిల్వలేకపోయింది. అయితే ఆ రికార్డులను ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సమం చేసింది. ప్రపంచానికి విండోస్ ను పరిచయం చేసిన కంపెనీగా పేరుపొందిన మైక్రోసాఫ్ట్.. 3 ట్రిలియన్ డాలర్ విలువ గల కంపెనీగా రికార్డు సృష్టించింది.

గ్లోబల్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ తొలిసారిగా 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడంతో అమెరికన్ మార్కెట్లు దూసుకుపోయాయి. ముఖ్యంగా ఇన్వెస్టర్లు మైక్రోసాఫ్ట్ షేర్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారు. ప్రపంచంలో ఇప్పటివరకు 3 ట్రిలియన్ డాలర్ల విలువకు చేరిన తొలి కంపెనీగా యాపిల్ చరిత్ర సృష్టించగా.. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా దాని సరసన చేరింది. బుధవారం రాత్రి అమెరికన్ స్టాక్ ఎక్సేంజ్ లో మైక్రోసాఫ్ట్ షేర్ విలువ 403.78 డాలర్ల వద్దకు పెరగడంతో దాని మార్కెట్ విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. అమెరికాలో ఆర్థిక మాధ్యం ఉన్నప్పటికీ 3 ట్రిలియన్ డాలర్ల మార్క్ అందుకుంది. గత ఏడాది యాపిల్ కంపెనీ ఈ స్థాయికి చేరి చరిత్ర సృష్టించింది.. కేవలం ఏడాదిలోనే యాపిల్ సంస్థ సరసన మైక్రోసాఫ్ట్ చేరింది. ప్రస్తుతం యాపిల్ మార్కెట్ విలువ 3.03 ట్రిలియన్ డాలర్ల సమీపంలో ఉంది. మైక్రోసాఫ్ట్ ఈ ఘనత సాధించడంతో దాని వ్యవస్థాపకుడు బిల్గేట్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఉద్యోగుల కృషి వల్లే కంపెనీ ఈ స్థాయికి చేరుకుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ ఏడాది ఆర్థిక మందగమనం నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ కూడా చాలామంది ఉద్యోగులను తొలగించింది. 3 ట్రిలియన్ డాలర్లకు మార్కెట్ వ్యాల్యూ పెరిగినప్పటికీ కంపెనీలో లే ఆఫ్ లు ఆగకపోవచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.