MG Cyberster: రోడ్ల మీద సూపర్ కార్లు చూశాం.. ఎలక్ట్రిక్ కార్లు చూశాం.. కానీ ఇలాంటి సూపర్ కారును మాత్రం ఇంతవరకు చూసి ఉండం. ఇండియాలోకి మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కన్వర్టిబుల్ కారు వచ్చేస్తోంది. ఎంజీ సైబర్‌స్టర్ పేరుతో వస్తున్న ఈ కారు డీలర్‌షిప్‌లకు రావడం మొదలైంది. ఇది కేవలం ఎలక్ట్రిక్ కారే కాదు.. దీని లుక్ చూస్తే అచ్చం సూపర్ కారు లాగే ఉంది. అంతేకాదు, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా వెళ్తుంది. మరి దీని ప్రత్యేకతలు ఏంటి? ఎంత ధర ఉండొచ్చు? వంటి వివరాలు తెలుసుకుందాం.
Also Read: చిరంజీవి సపోర్ట్ వల్లే ఆ నటుడు స్టార్ హీరోగా ఎదిగాడా..?
ఎంజీ మోటార్ ఇండియా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న తమ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును భారతదేశంలోని కొన్ని సెలక్టెడ్ డీలర్‌షిప్‌లకు పంపడం మొదలుపెట్టింది. ఈ కారు ఎంజీకి కేవలం ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఈవీ మాత్రమే కాదు, భారతదేశంలో విక్రయించబడే మొదటి ఆల్-ఎలక్ట్రిక్ కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కార్ కూడా ఇదే అవుతుంది. అంటే దీని పైకప్పును తెరవొచ్చు, మూయొచ్చు అన్నమాట. ఇది CBUగా అంటే విదేశాల నుండి పూర్తిగా తయారు చేయబడి దిగుమతి అవుతుంది. మొదట్లో చాలా తక్కువ యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయట.
ఎంజీ సైబర్‌స్టర్ ను చూస్తే ఎవరైనా సరే దాని మీద మనసు పారేసుకోవాల్సిందే. ఇది చాలా లో-స్లంగ్ డిజైన్‌తో వస్తుంది, అంటే రోడ్డుకి దగ్గరగా కూర్చున్నట్లు ఉంటుంది. దీనికి ఉండే ఫ్యూచరిస్టిక్ సిజర్ డోర్స్ దీని ప్రత్యేక ఆకర్షణ. అంటే డోర్లు పైకి లేస్తాయన్నమాట. అంతేకాకుండా, రెండు డోర్లు ఉన్న ఓపెన్ రూఫ్ బాడీ ఉంటుంది. కారు లోపల కూడా చాలా హైటెక్ గా ఉంటుంది. 3 స్క్రీన్లతో కూడిన డాష్‌బోర్డ్ ఉంటుంది. అలాగే, విమానంలో ఉండే యోక్-స్టైల్ స్టీరింగ్ వీల్ దీనికి అదనపు ఆకర్షణ. మొత్తానికి, దీని లుక్, స్టైల్ చూస్తే అచ్చం సూపర్ కారు లాగే ఉంటుంది.
పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఎంజీ సైబర్‌స్టర్ రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో రావచ్చు. సింగిల్ మోటార్ RWD వేరియంట్.. ఇది వెనుక చక్రాలకు పవర్ ఇస్తుంది. డ్యూయల్ మోటార్ AWD వేరియంట్.. ఇది ఏకంగా 536 bhp పవర్, 725 Nm టార్క్ వరకు ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు రేంజ్ 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు.
ఇప్పటివరకు ఎంజీ మోటార్ ఇండియా ఈ కారు లాంచ్ తేదీ, ధరను అధికారికంగా ప్రకటించలేదు. కానీ, త్వరలోనే దీన్ని ఎం9 తో పాటు లాంచ్ చేసే అవకాశం ఉంది. దీని ధర రూ.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) పైనే ఉండొచ్చని అంచనా. ఇప్పటికే కొన్ని డీలర్‌షిప్‌లలో కస్టమర్ ప్రివ్యూలు, ఆసక్తి ఉన్న కస్టమర్ల కోసం రిజిస్ట్రేషన్‌లు మొదలయ్యాయి.