Maruti Suzuki bumper offer: Maruthi Suzuki కార్లు కొనేవారికి కంపెనీ ఊరటనిచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా కార్ల ధరల పెంపు నుంచి ఉపశమనం కల్పించడంతో పాటు, కారు కొనుగోలును సులభతరం చేసేందుకు సరికొత్త ఆర్థిక పథకాన్ని ప్రవేశపెట్టింది. అదేంటో చూద్దాం..
మారుతీ సుజుకీ తన పాపులర్ ఎంట్రీ లెవల్ మోడళ్లపై ప్రైస్ ప్రొటెక్షన్ ను ప్రకటించింది. ఈ కంపెనీకి చెందిన ఆల్టో కే10 , ఎస్-ప్రెస్సో , సెలేరియో, వ్యాగన్-ఆర్ కార్లపై త్వరలో అమలు కానున్న రూ.30,000 ధరల పెంపు నుంచి వినియోగదారులకు మినహాయింపునిచ్చింది. ఈ ప్రయోజనం పొందాలంటే, వినియోగదారులు జూన్ 14వ తేదీలోపు పైన పేర్కొన్న కార్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గడువులోపు బుక్ చేసుకున్న వారికి పాత ధరలకే వాహనాలను అందజేస్తామని సంస్థ స్పష్టం చేసింది.
‘సుహానా సఫర్’ పేరుతో సరికొత్త పథకం
కార్ల కొనుగోలును సామాన్యులకు మరింత చేరువ చేసేందుకు మారుతీ సుజుకీ ‘సుహానా సఫర్’ పేరుతో ఒక ప్రత్యేకమైన ఆర్‌డీ తరహా పథకాన్ని ప్రారంభించింది. కారు కొనాలనుకునే వారు ఈ పాలసీలో చేరి, నిర్ణీత కాల వ్యవధి (3 నుంచి 6 నెలల పాటు) ప్రతి నెలా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
డౌన్ పేమెంట్‌గా వినియోగం
ఈ పథకం ద్వారా సేకరించిన మొత్తాన్ని మారుతీ సుజుకీ సంస్థ వడ్డీతో కలిపి తిరిగి చెల్లిస్తుంది. ఇలా పొదుపు చేసిన మొత్తం (అసలు + వడ్డీ)ను వినియోగదారులు కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు ‘డౌన్ పేమెంట్’ (Down Payment) కింద వాడుకోవచ్చు. మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఎంతో అనువుగా ఉంటుందని, ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు చెల్లించాల్సిన భారం తగ్గుతుందని సంస్థ పేర్కొంది.

