Mahindra Overtook Hyundai: పొట్టోడిని పొడుగోడు కొడితే.. పొడుగోడిని పోచమ్మ కొడుతుంది.. ఈ సామెత హ్యుందాయ్ అనే కొరియా కార్ల కంపెనీకి వాస్తవంలో తెలిసి వచ్చింది. గడచిన 25 సంవత్సరాలుగా హ్యుందాయ్ కంపెనీ కార్ల తయారీలో మనదేశంలో తిరుగులేని స్థానంలో ఉంది. వెర్నా నుంచి మొదలు పెడితే క్రెటా వరకు హ్యుందాయ్ అద్భుతమైన మోడల్స్ తీసుకొచ్చి భారతీయ మార్కెట్ లో కీలక శక్తిగా ఆవిర్భవించింది. 25 సంవత్సరాలుగా తన అప్రతిహత ప్రయాణాన్ని కొనసాగించిన హ్యుందాయ్ కి దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ మహీంద్రా దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది..
Also Read: బిడ్డ జోలికి వచ్చిన అభిమాని పై కోపంతో ఊగిపోయిన దీపికా పదుకొనే!
ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నివేదించిన సమాచారం ప్రకారం జనవరి నుంచి జూలై అమ్మకాలలో కొరియన్ కంపెనీ కంటే మహీంద్రా 21, 283 ఎక్కువ వాహనాలను విక్రయించింది. ఈ ఏడాది 351,065 వాహనాలను మహీంద్రా విక్రయించింది.. హ్యుందాయ్ ఇదే సమయంలో 329,782 యూనిట్లు విక్రయించింది. బలమైన మార్కెట్.. విస్తృతమైన వినియోగదారుల నమ్మకం.. భవిష్యత్తు అవసరాలను ముందుగానే పసిగట్టి వాహనాలలో ప్రవేశపెట్టడం వంటి చర్యల ద్వారా మహీంద్రా గణనీయమైన వృద్ధిని సాధించింది. గత ఏడాది ఇదే కాలంలో మహీంద్రా రెండు లక్షల పైగా వాహనాలను విక్రయించింది. అదే సమయంలో హ్యుందాయ్ 358,785 వాహనాలను విక్రయించింది. కానీ ఈ ఏడాది మహీంద్రా 291, 971 వాహనాల నుంచి 351,065 వాహనాలను విక్రయించి తన వృద్ధిని 20.2 శాతానికి పెంచుకుంది. హ్యుందాయ్ అమ్మకాలు 358,785 నుంచి 329,782 కు పడిపోయాయి. వృద్ధి కూడా 8.1 శాతానికి తగ్గింది.
ఇవే కారణాలు
హ్యుందాయ్ మందగమనానికి ప్రధాన కారణం అది క్రెటా అనే మోడల్ మీద అతిగా ఆధారపడటమే. మహీంద్రా విజయానికి ఎక్స్ యూ వీ 3 ఎక్స్ ఓ, థార్, రాక్స్, స్కార్పియో, స్కార్పియో ఎన్, బీఈ 6, ఎక్స్ ఈ వీ 9e వంటి మోడల్స్ కారణం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమేటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ వెల్లడించిన సమాచారం ప్రకారం క్రేటా అమ్మకాలు 20% పెరిగాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో 162, 773 నుంచి 2025 ఆర్థిక సంవత్సరానికి 194,871 వాహనాలు అమ్ముడుపోయాయి. ఐ టెన్ నియోస్, ఐ20, ఆరా, ఎక్స్ టర్, వెన్యూ, వెర్నా, అల్కాజర్, టక్సన్, ఐయోనిక్ 5 వంటి కార్ల అమ్మకాలు 10 శాతం తగ్గాయి. 451,948 యూనిట్ల నుంచి 403,795 కు పడిపోయాయి. మరోవైపు మహీంద్రా తన ఐస్, ఈవీ మోడల్స్ తో ఆటోమొబైల్ మార్కెట్లో దూసుకుపోతోంది. వచ్చే రోజుల్లో మరో కొత్త మోడల్స్ ను పరిచయం చేయనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో హ్యుందాయ్ ని విక్రయాల పరంగా మహీంద్రా అధిగమించింది.
ఈ ఏడాది ఇప్పటివరకు మారుతి సుజుకి మొదటి స్థానంలో ఉంది. దాని అమ్మకాలు 1.9 శాతానికి పడిపోయినప్పటికీ 1,036,368 నుంచి 1,016,481 యూనిట్లకు తగ్గింది. హ్యుందాయ్ తర్వాత టాటా మోటార్స్ నాలుగు స్థానాల్లో ఉంది.. 1998 – 99 లో హ్యుందాయ్ శాంత్రో అనే మోడల్ తో ఇండియాలోకి ప్రవేశించింది 2000 సంవత్సరం నాటికి టాటా మోటార్స్ ను అధిగమించింది. మారుతి సుజుకి తర్వాత మన దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా ఎదిగింది. 2024 వరకు హ్యుందాయ్ తన ప్రయాణాన్ని సాగించింది.