Loan Vs Credit Card: అవసరానికి చేతిలో డబ్బు లేకుంటే ఠక్కున గుర్తుకు వచ్చేది క్రెడిట్ కార్డు. క్రెడిట్ కార్డులతో కేవలం షాపింగ్ లకే కాకుండా ఇతర ఖర్చులకు కూడా ఉపయోగించడం పరిపాటే. అయితే, ఇది కేవలం చిన్న చిన్న వస్తువులను కొనడం, షాపింగ్ పర్పస్ ఉపయోగిస్తాం. ఇక లోన్ అంటే అందరికీ తెలిసిందే కదా. మరి డబ్బు ఎక్కువ మొత్తంలో అవసరమైతే ఉంటే ఏం చేయాలి. ఆ సమయంలో క్రెడిట్ కార్డు మంచిదా? లేదంటే లోన్ మంచిదా? వీటి గురించి ఆర్థిక నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
డబ్బులు అత్యవసరం అయితే చేతిలో ఉన్న క్రెడిట్ కార్డు ద్వారా స్వైప్ చేసిన క్యాష్ లోకి కన్వర్ట్ చేస్తుంటాం. లేదంటే కొన్ని యాప్ లను ఉపయోగించి క్రెడిట్ కార్డు నుంచి అకౌంట్‌లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం చేస్తుంటారు. ఖరీదైన వస్తువు కొనుగోలు చేసి ఆ డబ్బును ఈఎంఐలో కన్వర్ట్ చేసేందుకు కూడా క్రెడిట్ కార్డునే వాడుతుంటారు. అయితే రూ. లక్ష కంటే పెద్ద అమౌంట్ కావాలంటే క్రెడిట్ కార్డుల కంటే లోన్ బెటర్ అంటున్నారు నిపుణులు. అది ఎలా చెప్పారో చూద్దాం.
క్రెడిట్ కార్డులతో పోల్చుకుంటే పర్సనల్ లోన్ కు వడ్డీ తక్కువగా ఉంటుంది. కాబట్టి, పెద్ద మొత్తం అవసరం పడితే లోన్ గా తీసుకోవడమే ఉత్తమం. దీని వల్ల వడ్డీపై డబ్బు ఆదా అవడమే కాకుండా లోన్ వీలైనంత త్వరగా తీరుతుంది. క్రెడిట్ కార్డు బిల్లు డ్యూ టైములోగా కట్టకపోతే లేట్ పేమెంట్ ఛార్జీలు విపరీతంగా ఉంటాయి. పర్సనల్ లోన్ విషయంలో కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. క్రెడిట్ కార్డు సంస్థలతో పోలిస్తే.. పర్సనల్ లోన్స్ ఇచ్చే సంస్థలు ఎక్కువగా ఉంటాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు తక్కువ వడ్డీ రేట్లు, ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజులు లేకుండా రుణాలు అందిస్తుంటాయి. క్రెడిట్ కార్డుల్లో అయితే ఈ వెసులుబాటు ఉండదు.
కొన్ని ఈఎంఐలు కట్టిన తర్వాత డబ్బు సర్ధుబాటు అయితే లోన్‌ను ముందే క్లోజ్ చేయవచ్చు. చాలా సంస్థలు ప్రీ క్లోజర్ ఆప్షన్ ఇస్తాయి. క్రెడిట్ కార్డులకు కూడా ఈ ఫెసిలిటీ ఉంటుంది. కానీ, క్రెడిట్ కార్డు క్లోజర్‌కు ప్రీ పేమెంట్ పెనాల్టీ తీసుకుంటారు. కానీ పర్సనల్ లోన్స్ విషయంలో ఇది ఉండదు. క్రెడిట్ కార్డు బిల్లులతో సతమతం అయ్యేవాళ్లు కూడా పెనాల్టీ ఛార్జీలు తగ్గించుకునేందుకు పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. లోన్ అమౌంట్‌తో కార్డు బ్యాలెన్స్ ఒకేసారి చెల్లించి.. తక్కువ ఈఎంఐలుగా పెట్టుకోవచ్చు.
చివరగా.. తక్కువ మొత్తంలో డబ్బు అవసరం ఉంటే క్రెడిట్ కార్డు, పెద్ద మొత్తంలో అవసరం ఉంటే లోన్ తీసుకుంటే మంచిదని నిపుణుల సలహా. అయితే క్రెడిట్ కార్డు నుంచి అమౌంట్ వేగంగా పొందొచ్చు. లోన్ అయితే రెండు, మూడు రోజుల టైం పట్టవచ్చు. డాక్యుమెంట్స్ కూడా అవసరమవుతాయి. కానీ ఇప్పుడు ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా లోన్ అందజసే సంస్థలు ఎక్కువగా పుట్టుకుచ్చాయి.