Pinnelli Ramakrishna Reddy: ఎమ్మెల్యే పిన్నెల్లి పై ఈసీ సీరియస్.. అనర్హత వేటు తప్పదా?

మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోదరులతో పాటు అనుచరులు రెచ్చిపోయారు. ఎక్కడికక్కడే విధ్వంసాలకు దిగారు. పోలింగ్ నాడు, పోలింగ్ ముగిసిన తరువాత హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అయినా సరే బాధ్యులపై చిన్నపాటి కేసులే నమోదయ్యాయి.

Written By: Dharma, Updated On : May 22, 2024 2:50 pm

Pinnelli Ramakrishna Reddy

Follow us on

Pinnelli Ramakrishna Reddy: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై అనర్హత వేటు పడుతుందా? ఎలక్షన్ కమిషన్ సీరియస్ యాక్షన్కు దిగనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎమ్మెల్యే పిన్నెల్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటంతో ఆయనపై అనర్హత వేటుకు రంగం సిద్ధం అయినట్లు సమాచారం. వాస్తవానికి మాచర్ల నియోజకవర్గం అత్యంత సమస్యాత్మకమైనది. అందుకే అక్కడ ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ నిఘా ఉంచింది. అయినా సరే ఎమ్మెల్యే పిన్నెల్లి వర్గం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అందుకే ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యారు.

మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోదరులతో పాటు అనుచరులు రెచ్చిపోయారు. ఎక్కడికక్కడే విధ్వంసాలకు దిగారు. పోలింగ్ నాడు, పోలింగ్ ముగిసిన తరువాత హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అయినా సరే బాధ్యులపై చిన్నపాటి కేసులే నమోదయ్యాయి. తాజాగా సిట్ ఎంట్రీ తో సీన్ మారింది. నియోజకవర్గ వ్యాప్తంగా 200 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి సి సి ఫుటేజ్ లను పరిశీలించారు. ఓ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా.. ఈవీఎంలను ధ్వంసం చేయడం, నేలకేసి కొట్టడం స్పష్టంగా కనిపించింది. అందుకే ఇప్పటివరకు నమోదైన సెక్షన్లను మార్చి.. హత్యాయత్నం, నాన్ బెయిలబుల్ సెక్షన్లను అదనంగా నమోదు చేయించారు. దీంతో ఏ క్షణంలోనైనా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు రాష్ట్ర అధికారులు ఎన్నికల కమిషన్ కు ప్రత్యేకంగా విన్నవించారు. ఈ నేపథ్యంలో టిడిపి నుంచి కూడా కొన్ని రకాల ఫిర్యాదులు వెళ్లాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై అనర్హత వేటు వేయాలని కోరినట్లు తెలుస్తోంది. అదే జరిగితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని పిన్నెల్లి కోల్పోయినట్టే. మరి ఏం జరుగుతుందో చూడాలి.

అయితే మాచర్ల నియోజకవర్గంలో విధ్వంస ఘటనలకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు. సాక్షి మీడియాతో మాట్లాడారు. తాను సిట్టింగ్ జడ్జి విచారణకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ ఘటనలు తరువాత ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు స్థానికంగా అందుబాటులో లేరు. హౌస్ అరెస్ట్ లో ఉన్నవారు తప్పించుకొని వేరే ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ వారి అరెస్ట్ కు ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక ఆదేశాలు ఇస్తే మాత్రం.. స్వచ్ఛందంగా లొంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేకుంటే ఈ సీరియస్ చర్యలకు బాధ్యులు అవుతామన్న భయం వారిని వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే మాచర్లలో అల్లర్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఫుల్ క్లారిటీ వస్తోంది. ఇప్పటికే కేంద్ర బలగాలు భారీగా చేరుకున్నాయి. అరెస్టుల పర్వం కొనసాగనుండడంతో ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.