Aequs Founders Life Journey: పేదరికం అనగానే ఇక జీవితంలో పైకిరాలేం అనుకుంటారు. ఏ పని అయినా డబ్బు ఉండాలి అంటారు. కొంతవరకు నిజమే అయినా.. కృషి, పట్టుదల, సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. పేదరికం అడ్డుకాదు. ఇందుకు నిదర్శనం అరవింద్ మెలిగెరి, అజిత్ ప్రభు. హుబ్బలిలోని ఒక సాధారణ ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభమైన ఇద్దరు మిత్రుల స్నేహం, ఈ రోజు ప్రపంచ ఏవియేషన్ పరిశ్రమలో ఒక కీలక శక్తిగా మారింది. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి, తమ కంపెనీ ‘ఈకస్’ ద్వారా బోయింగ్, ఎయిర్బస్ వంటి దిగ్గజ సంస్థలకు విమాన విడిభాగాలను సరఫరా చేస్తూ భారత్‌లో అతిపెద్ద ఏవియేషన్ తయారీ సంస్థను నెలకొల్పారు.
Also Read: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు..నార్త్ అమెరికా లో ఫైర్ స్ట్రోమ్!
ఇద్దరి నేపథ్యం ఇదీ..
అరవింద్,అజిత్ ఇద్దరూ హుబ్బలిలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో కలుసుకున్నారు, ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు. అరవింద్ తండ్రి అతను చిన్నతనంలోనే మరణించగా, తల్లి అనసూయ కష్టపడి అతన్ని పెంచి, చదివించింది. అజిత్ కుటుంబం కూడా పండ్ల వ్యాపారంతో జీవనం సాగించే నిరుపేద కుటుంబం. ఇద్దరూ తమ తల్లిదండ్రుల కష్టాలను చూసి, చదువులో పోటీపడి ర్యాంకులు సాధించారు. అరవింద్ సూరత్కల్ రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీలో సీటు సాధించగా, బంధువుల సహాయంతో ఫీజులు కట్టి చదివాడు. అజిత్, చిన్నతనంలోనే అగరబత్తీలు అమ్ముతూ వ్యాపార దృక్పథాన్ని పెంచుకుని, కర్ణాటక యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసి, అమెరికాలో పీజీ చేశాడు. అజిత్ ప్రోత్సాహంతో అరవింద్ కూడా అమెరికాకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాడు.
ఒక సాహసోపేత ప్రారంభం..
అమెరికాలో చదువు పూర్తి చేసిన తర్వాత, అరవింద్ ఫోర్డ్ సంస్థలో, అజిత్ జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ)లో ఉద్యోగాలు సాధించారు. కానీ, అజిత్ ఒక సాధారణ ఉద్యోగిగా సంతృప్తి చెందలేదు. జీఈకి భారత్ నుంచి ఇంజినీరింగ్ పరికరాలు సరఫరా చేసే సంస్థను స్థాపించాలనే ఆలోచనతో, 1997లో అరవింద్‌తో కలిసి ‘క్వెస్ట్ గ్లోబల్’ను ప్రారంభించాడు. జీఈ నుంచి గణనీయమైన ఆర్డర్లు రాగా, ఎన్రాన్ దివాలా కుంభకోణం కారణంగా జీఈ ఆర్థిక సంక్షోభంలో పడటంతో వారి వ్యాపారం కూడా కుదేలైంది. అయినప్పటికీ, వారు ఆత్మవిశ్వాసంతో భారత్‌కు తిరిగి వచ్చి, సీమెన్స్, రోల్స్ రాయిస్, తోషిబా వంటి సంస్థల నుంచి ఆర్డర్లు సాధించి వ్యాపారాన్ని పునరుద్ధరించారు.
ఏవియేషన్ పరిశ్రమలో ఒక విప్లవం..
2006లో, అరవింద్ నేతృత్వంలో ‘ఈకస్’ సంస్థ స్థాపించబడింది, ఇది ప్రత్యేకంగా విమాన విడిభాగాల తయారీపై దృష్టి సారించింది. బెలగావిలో దేశంలోనే అతిపెద్ద ఏరోస్పేస్ సెజ్‌ను ఏర్పాటు చేసిన అరవింద్, బోయింగ్, ఎయిర్బస్ వంటి అగ్రగామి సంస్థలకు విమాన చక్రాలు, ఇంజిన్ సిస్టమ్స్, ల్యాండింగ్ సిస్టమ్స్, కార్గో, ఇంటీరియర్స్ వంటి అనేక విడిభాగాలను తయారు చేయడం ప్రారంభించాడు. ఈకస్ ఈ రోజు భారత్‌లో అతిపెద్ద విమాన విడిభాగాల తయారీ సంస్థగా నిలిచింది. దీని మార్కెట్ విలువ సుమారు 2 వేల కోట్ల రూపాయలు. క్వెస్ట్ గ్లోబల్ మార్కెట్ విలువ 15 వేల కోట్ల రూపాయలు. ఈ ఇద్దరు మిత్రులు హురూన్ జాబితాలో టాప్–10లో స్థానం సాధించారు.
సమాజానికి తిరిగిచ్చే నిబద్ధత
అరవింద్, అజిత్ విజయం సాధించడంతో ఆగిపోలేదు; వారు సమాజానికి తిరిగిచ్చే బాధ్యతను కూడా గుర్తించారు. అరవింద్ తన తల్లి పేరిట ‘అనసూయ మెలిగెరి స్కూల్ ఆఫ్ టెక్నాలజీ సెంటర్’ను స్థాపించి, బెలగావి సమీప గ్రామీణ యువతకు ఉచిత అత్యాధునిక సాంకేతిక విద్యను అందిస్తున్నాడు. అజిత్ తన పేరిట ఒక ఫౌండేషన్‌ను స్థాపించి, పేద విద్యార్థులకు లక్షల రూపాయల స్కాలర్‌షిప్‌లను అందజేస్తున్నాడు.
నిరుపేద నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ, వారు చదువు, సహకారం ద్వారా అసాధారణ విజయాన్ని సాధించారు. జీఈతో ప్రారంభించి, ఆర్థిక సంక్షోభం తర్వాత బహుళ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం వారి వ్యాపార తెలివిని చాటుతుంది.