Kripa Ananthan: ప్రపంచంలోని ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందని నానుడి. అదే విధంగా మగాళ్లు ఎంతగానో ఇష్టపడే మోడల్ కార్ల సృష్టికర్త ఓ మహిళ అంటే ఆశ్చర్యపోక తప్పదు. అదేదో కాదు.. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆఫ్-రోడర్ ఎస్ యూవీల జాబితాలో మహీంద్రా థార్. ప్రస్తుతం ఎస్ యూవీ అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉంది. దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఇప్పుడు ఈ ఎస్ యూవీ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేయడానికి ప్రయత్నిస్తోంది. అయితే, ఈ ఆఫ్-రోడర్ ఎస్ యూవీ డిజైన్‌ను ఎవరు కనుగొన్నారని ఎప్పుడైనా ఆలోచించారా ?. ప్రస్తుతం మనం వాడుతున్న కారుని ఎవరు కనిపెట్టారో దాని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. దీన్ని తయారు చేయడం వెనుక ఎవరి కృషి ఉంది. వాళ్లు దాని కాన్సెప్ట్‌ను ఎప్పుడు సిద్ధం చేశారు. మహీంద్రా థార్‌కు రూపు ఇవ్వడం వెనుక ఎవరి హస్తం ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం. మహీంద్రా థార్‌ని డిజైన్ చేసిన వ్యక్తి పేరు రామ్‌కృపా అనంతన్. ఆమె ఓ మహిళ. తనకు తెలిసిన వ్యక్తులు ఆమెను ప్రేమగా కృపా అనంతన్ లేదా కృపా అని పిలుస్తారు. కృపా అనంతన్, మహీంద్రా థార్ ప్రస్తానం గురించి తెలుసుకుందాం.
మహీంద్రా థార్ భారతదేశంలో అత్యంత ఇష్టపడే స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (SUVలు) ఒకటి. సెకండ్ జనరేషన్ లాంచ్ తర్వాత లైఫ్ స్టైల్ గా మారిన మహీంద్రా థార్ ఎస్ యూవీ ఎన్నో కొత్త శిఖరాలను తాకింది. ప్రస్తుతం, మహీంద్రా థార్‌కు డిమాండ్ చాలా ఎక్కువ స్థాయికి చేరుకుంది. అతిపెద్ద విషయం ఏమిటంటే, ఈ SUVని కొనుగోలు చేసే వ్యక్తులు డెలివరీ కోసం చాలా కాలం వేచి ఉండాలి. అయితే, మహీంద్రా థార్ ఎస్ యూవీలో ప్రారంభ దశలో కొన్ని లోపాలు ఉన్నాయి. అవి రెండవ దశలో తొలగించబడ్డాయి. మహీంద్రా థార్ విజయం వెనుక చాలా మంది ప్రఖ్యాత వ్యక్తులు ఉన్నప్పటికీ, దీనికి పునాది వేసింది మాత్రం రామ్‌కృపా అనంతన్. రామ్‌కృపా అనంతన్ ఆటోమొబైల్ పరిశ్రమలో సుపరిచితురాలైన వ్యక్తి. ఎస్ యూవీ సెగ్మెంట్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఆమె మహీంద్రాకు సహాయం చేశారు. కృపా అనంతన్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ స్టార్టప్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్‌లో డిజైన్ హెడ్‌గా పనిచేస్తున్నారు. కృపా అనంతన్ మహీంద్రా & మహీంద్రాతో పని చేస్తున్నప్పుడు, మహీంద్రా థార్‌తో పాటు, మహీంద్రా మార్జో, మహీంద్రా KUV100, XUV300, TUV300, XUV500, XUV700, మహీంద్రా స్కార్పియోలను రూపొందించిన ఘనత కూడా ఆమెకు ఉంది.
రామకృపా అనంతన్ ఎవరు?
1971వ సంవత్సరంలో జన్మించిన రామకృపా అనంతన్, ఐఐటీ బాంబే నుండి మాస్టర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ డిగ్రీని పొందారు. దీని తర్వాత అతనికి మహీంద్రా అండ్ మహీంద్రాలో ఉద్యోగం వచ్చింది. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. దీని తరువాత, ఆమె 1997లో మహీంద్రాలో ఇంటీరియర్ డిజైనర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. 2005 సంవత్సరంలో ఆమె మహీంద్రా & మహీంద్రాలో డిజైన్ హెడ్‌గా నియమితులయ్యారు. ఈ పదవిలో ఉంటూనే మహీంద్రా ఎక్స్‌యూవీ500 పేరుతో ఎస్‌యూవీని డిజైన్ చేశారు. కృపా అనంతన్ 10 సంవత్సరాలు డిజైన్ విభాగానికి నాయకత్వం వహించారు. తరువాత చీఫ్ డిజైనర్‌గా ప్రమోషన్ పొందారు. దీని తర్వాత ఆమె మహీంద్రా థార్, XUV700, స్కార్పియో అనే మూడు కార్ల ఐకానిక్ డిజైన్‌లను రూపొందించారు. ఇవి జనాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి.