iPhone 18 Series: Apple కంపెనీ ప్రతీ ఏడాది సెప్టెంబర్ లో కొత్త ఫోన్ ను రిలీజ్ చేస్తుంది. ఈ ఏడాది 18 సిరీస్ ను మార్కెట్లోకి తీసుకురాబోతుంది. అయితే iPhone 18 Series కు సంబంధించి ఒక లీక్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ సిరీస్‌లో టాప్ మోడల్ అయిన ‘ఐఫోన్ 18 ప్రో మాక్స్’ లో ఆపిల్ చరిత్రలోనే ఇప్పటివరకు ఎన్నడూ లేనంత అతిపెద్ద బ్యాటరీని అమర్చబోతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇంతకీ ఇందులో ఎలాంటి బ్యాటరీని ఏర్పాటు చేస్తున్నారంటే?
సాధారణంగా ఆపిల్ సంస్థ తన ఐఫోన్లలో ఆండ్రాయిడ్ ఫోన్ల కంటే తక్కువ సామర్థ్యం గల బ్యాటరీలను వాడుతుంది. కానీ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ వల్ల బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. అయితే, ఈసారి భారీ అప్‌గ్రేడ్ ఇస్తూ ఐఫోన్ 18 ప్రో మాక్స్‌లో మొదటిసారిగా 5,000mAh మార్కును దాటి బ్యాటరీని ఇవ్వబోతున్నారట. ఫిజికల్ సిమ్ స్లాట్ కలిగిన మోడల్లో 5,235mAh బ్యాటరీని, అలాగే సిమ్ స్లాట్ లేకుండా కేవలం ఈ-సిమ్ మాత్రమే ఉండే యూఎస్ వెర్షన్లో ఏకంగా 5,425mAh భారీ బ్యాటరీని అందించనున్నారు.గత ఐఫోన్ మోడల్స్‌తో పోలిస్తే ఇది చాలా పెద్దది. దీంతో ఐఫోన్ 18 ప్రో మాక్స్ బ్యాటరీ దాదాపు 6.6 నుంచి 8.5శాతం వరకు పెరిగే అవకాశం ఉంది
ఈ ఫోన్ లో పెద్ద బ్యాటరీ మాత్రమే కాకుండా సరికొత్త A20 ప్రో చిప్సెట్ ను కూడా అమర్చుతున్నారు. ఇది అత్యంత అధునాతనమైన 2nm (నానోమీటర్) ప్రాసెస్ పై తయారు చేయబోతున్నారు. ఇది పవర్‌ను చాలా తక్కువగా వినియోగించుకుంటూ, అత్యుత్తమ పర్ఫార్మెన్స్ను ఇస్తుంది. దీనివల్ల ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలా ఎక్కువ సమయం బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని టెక్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రముఖ చైనీస్ మైక్రోబ్లాగింగ్ సైట్ ‘వెయిబో’ (Weibo) ద్వారా ఈ వివరాలు బయటకు వచ్చాయి. అంతేకాకుండా, ఇటీవల భారతదేశంలోని టాటా ఎలక్ట్రానిక్స్ పై జరిగిన ఒక సైబర్ దాడి కారణంగా కొన్ని కాన్ఫిడెన్షియల్ సప్లై చైన్ డాక్యుమెంట్లు లీక్ అయ్యాయని, ఈ బ్యాటరీ వివరాలు కూడా అందులో నుండే వచ్చి ఉండవచ్చని సమాచారం. అయితే ఆపిల్ అధికారికంగా ప్రకటించే వరకు ఇవి అంచనాలే అని కొందరు అంటున్నారు.

