Aseem Rawat Dairy Farm: సాధారణంగా పాడి పరిశ్రమను నిరక్షరాస్యులు.. అంతంతమాత్రంగా అక్షర జ్ఞానం ఉన్నవారు మాత్రమే పెడతారు అని అనుకుంటారు. కానీ విదేశాల్లో మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ.. గొప్ప గొప్ప వేతనాలను వదిలేసి.. పాడి పరిశ్రమ వైపు అడుగులు వేస్తున్న వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు ఆ సీం రావత్. ఇతడు ఢిల్లీ సరిహద్దుల్లో భారీ పాడి పరిశ్రమలు ఏర్పాటు చేశాడు. దీని ఆధారంగా కోట్లల్లో ఆదాయం సాధిస్తున్నాడు. ప్రస్తుతం ఆసీం రావత్ వద్ద వెయ్యికి పైగా ఆవులు ఉన్నాయి. వీటి ద్వారా అతడు 8 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాడు. 110 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అంతేకాదు 131 రకాల సహజ ఉత్పత్తులను సేంద్రీయ విధానాలలో సాగుచేసి అమ్ముతున్నాడు. అందువల్లే అతడికి కేంద్ర ప్రభుత్వం గోపాల రత్న పురస్కారం అందజేసింది.
మధ్యతరగతి కుటుంబంలో..
ఆసీమ్ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత అమెరికా, యూరప్ దేశాలకు వెళ్ళాడు. దాదాపు 14 సంవత్సరాలు ఐటి విభాగంలో పనిచేశాడు. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలిపెట్టి రెండు ఆవులతో తన పాడి వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. ఇందులో అతడికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే క్వాలిటీలో అతడు కాంప్రమైజ్ కాకపోవడంతో వ్యాపారం పెరిగిపోయింది. ప్రస్తుతం ఇతని ఫామ్ లో ఉన్న ఆవుపాలను లీటర్ కు 180 రూపాయలకు విక్రయిస్తున్నాడు. అంత ధర ఉన్నప్పటికీ కొనుగోలు చేయడానికి ప్రజలు ఏమాత్రం వెనుకంజు వేయడం లేదు.. ఇటీవల ఉత్తర ప్రదేశ్ లోని మధుర ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆసీమ్ తన వద్ద ఉండే సాహివాల్ అనే ఆవుతో వెళ్ళాడు. అతని వద్దకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వచ్చి ఫోటో దిగారు. ఆ సంఘటన తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని అసీమ్ చెబుతుంటాడు. అయితే తన వద్ద ఉన్న వెయ్యి ఆవులను కాస్త రెండు వేల వరకు చేయాలని.. పాడి పరిశ్రమను మరింత విస్తరించాలని ఆసీమ్ పట్టుదలతో ఉన్నాడు.
వ్యాపారాన్ని పెంచుకోవడానికి..
వ్యాపారాన్ని పెంచుకోవడానికి సామాజిక మాధ్యమాలను ఆసీమ్ ఉపయోగిస్తుంటాడు. ఉత్పత్తుల గురించి ప్రమోషన్ చేస్తుంటాడు. అయితే ఇందులో ఎటువంటి కృత్రిమత్వాన్ని అతడు ఉపయోగించడు.. సేంద్రీయ విధానంలోనే పంటలు పండిస్తాడు. పైగా తన ఆవుల ద్వారా ఉత్పత్తి అయిన మయాన్ని సేంద్రియ ఎరువుగా మార్చుతున్నాడు.. దానిని తన బ్రాండ్ పేరు మీద మార్కెట్లో విక్రయిస్తున్నాడు.. అయితే పశువులు తినడానికి ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా గ్రాసాన్ని అతడు దిగుమతి చేసుకుంటున్నాడు. పశువులు మేయడానికి ప్రత్యేకంగా భూములను కూడా కొనుగోలు చేశాడు.. విదేశాల్లో ఉద్యోగాన్ని వదులుకొని.. స్వదేశంలో.. తను పుట్టి పెరిగిన ప్రాంతంలో ఆవుల మధ్య జీవించడం తనకు ఎంతగానో సంతృప్తినిస్తోందని ఆసీమ్ రావత్ వ్యాఖ్యానిస్తున్నాడు.