Adani Gautam: ఈ ప్రయాణంలో ట్విస్టులు అదరగొడతాయి.. ఎదురయ్యే అవరోధాలు రోమాలను నిక్కబడిచేలా చేస్తాయి. సరిగా ఇలాంటి సన్నివేశాలే ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ ఆదాని జీవితంలో అనేకం చోటుచేసుకున్నాయి.. 62 సంవత్సరాల గౌతమ్ అదానీ ఎన్నో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. తన పుట్టి ముంచే సంక్షోభాలను చవిచూశారు. అనేక ప్రతిఘటనలను అనుభవించారు. అయినప్పటికీ తనను తాను ఆవిష్కరించుకున్నారు. ఏటికి ఎదురు ఈదుతూ.. అత్యంత సంపన్నమైన భారతీయ వ్యాపారిగా ఆవిర్భవించారు. ప్రపంచ కుబేరుల్లో టాప్ -10 స్థానంలో నిలిచారు. అమెరికా ఫెడరల్ కోర్టు అభియోగాలు మోపడం.. ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోవడం.. వంటివి గౌతమ్ అదాని ఇప్పుడు చవిచూస్తున్న ఎదురు దెబ్బలు. అయితే ఆయనకు ఇది కొత్త కాదు.. ఇవేమీ ఆయన చూడనివి కాదు. వైఫల్యాలను చూశారు. పరాజయాలను మూట కట్టుకున్నారు. ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఫినిక్స్ పక్షిలాగా ఎగిరారు. వేలకోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించారు.
స్కూలింగ్ కూడా పూర్తి చేయలేదు
వేల కోట్లకు అధిపతి అయిన గౌతం అదాని స్కూలింగ్ కూడా పూర్తి చేయలేదు. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. గుజరాత్ లోని అహ్మదాబాద్ ప్రాంతానికి చెందిన ఒక జైన కుటుంబంలో గౌతమ్ జన్మించారు. అతని తండ్రికి 8 మంది సంతానం కాగా.. అందులో గౌతం ఏడో వాడు. గౌతమ్ తండ్రి జౌళి వస్త్రాల వ్యాపారం చేసేవారు. తన 16 సంవత్సరాల వయసులోనే ముంబైకి వచ్చారు. రత్నాలు విక్రయించే వ్యాపారి వద్ద పనికి కుదిరారు. 1981లో గుజరాత్ తిరిగి వెళ్ళిపోయారు. తన సోదరుడితో కలిసి ఒక చిన్న ఫిలిం ఫ్యాక్టరీ నిర్వహించారు. 1988 ఆదాని ఎక్స్ పోర్ట్స్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేశారు. 994లో దాన్ని స్టాక్ చేంజ్ లో నమోదు చేశారు.. దానిని తర్వాతి క్రమంలో ఆదాని ఎంటర్ప్రైజెస్ గా మార్చారు. ఆ తర్వాత వ్యాపారంలో లాభాలను గడించారు. 1998 జనవరి 1న ఆదాని భాగస్వామి శాంతిలాలా పటేల్ కు కొందరు దుండగులు గన్ చూపించి బెదిరించారు.. కిడ్నాప్ చేశారు. ఆ తర్వాతిరోజు విడిచిపెట్టారు. అయితే ఆ వ్యవహారంలో భారీగానే డబ్బులు చేతులు మారాయట. అయితే ఈ అపహరణ ఆపరేషన్ ను గ్యాంగ్ స్టర్లు పజ్లు రెహమాన్, భోగి లాల్ దర్జీ చేశారట.. ఇక ముంబైలో ఉగ్రదాడులు జరిగినప్పుడు గౌతమ్ అదాని తాజ్ హోటల్లో ఉన్నారు. ఆ సమయంలో దుబాయ్ ఫోర్ట్ సీఈవో మహమ్మద్ షరాఫ్ తో కలిసి ఆయన రెస్టారెంట్లో కూర్చున్నారు. తాము తిన్న ఆహారానికి డబ్బులు కట్టి.. కాఫీ తాగడానికి ఎదురు చూస్తుండగా ఈ ఘటన జరిగింది. టెర్రరిస్టుల నుంచి గౌతమ్ అదానీని కాపాడేందుకు హోటల్ సిబ్బంది ముందుగా కిచెన్ లోకి పంపించారు. ఆ తర్వాత బేస్మెంట్ లోకి తరలించారు. రాత్రి మొత్తం వారు అక్కడే ఉన్నారు. మరుసటి రోజు సెక్యూరిటీ గార్డ్స్ వారిని సంరక్షించారు. ఒకవేళ హోటల్లో డబ్బులు కట్టేసి వెంటనే బయటికి వస్తే గౌతమ్ అదానీ ప్రాణాలు టెర్రరిస్టుల చేతిలో పోయేవి. ఇక ఒకసారి అహ్మదాబాద్ విమానాశ్రయానికి ప్రైవేటు జెట్ లో గౌతమ్ అదాని వెళ్లారు. ఆ సమయంలో అతడు ప్రయాణిస్తున్న జెట్ ప్రమాదానికి గురైంది. ఆ సందర్భంలో గౌతమ్ 15 అడుగుల దూరంలో మృత్యువును చూశాడు.
ఇప్పుడేం చేస్తాడో?!
ఇన్ని అవరోధాలను ఎదుర్కొంటూ గౌతమ్ తనను తాను ఆవిష్కరించుకున్నాడు. అతిపెద్ద వ్యాపారవేత్తగా ఎదిగాడు. ప్రతి విభాగంలోనూ ప్రవేశించి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కష్టాన్ని మాత్రమే నమ్మాడు. సిమెంట్ నుంచి మొదలు పెడితే మీడియా వరకు ప్రతిదాంట్లోనూ ఎంట్రీ ఇచ్చాడు.. అయితే గౌతమ్ అదాని ఈ స్థాయిలో విజయవంతం కావడం వెనుక నరేంద్ర మోడీ ఉన్నారని ఓ వర్గం మీడియా ఆరోపిస్తుంది. కొంతమంది రాజకీయ నాయకులు విమర్శిస్తుంటారు. ఆయనప్పటికీ గౌతమ్ వాటిని పట్టించుకోడు. అన్నింటికీ మించి తన విస్తరణలో ఎవరూ తనకు సహాయం చేయలేదని కుండబద్దలు కొట్టినట్టు చెబుతుంటాడు. ఇక ఆస్తులు పెంచుకోవడం విషయంలో ముకేశ్ అంబానీ గౌతమ్ ఆదాని దాటేశాడు. ఒక దశలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ను కూడా అధిగమించాడు. అయితే ఇటీవల ఎదురవుతున్న ఇబ్బందుల వల్ల తన సంపదను కోల్పోయాడు. ఇప్పుడు ఏకంగా ప్రపంచంలో శ్రీమంతుల జాబితాలో 25వ స్థానంలోకి పడిపోయాడు.. అయితే ఇప్పటివరకు తన జీవితంలో పోరాడి సాధించుకున్నవే చాలా ఎక్కువ. అలాంటప్పుడు ప్రస్తుత పరిణామాలను గౌతం అదాని ఎలా ఎదుర్కొంటారనేది చూడాల్సి ఉంది.