Inspiration and Growth:ఎవడో ఏదో అన్నాడని మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు. ఎవడు ఏదో కూశాడని మన స్థాయిని దిగజార్చుకోకూడదు. బురదలో పుట్టిన కమలం వికసిస్తుంది.. ఉప్పునీటిలో పుట్టిన ట్యూనా స్టార్ హోటల్లో డిష్ అవుతుంది. జీవితం ఎప్పుడూ ఎలాగ ఉంటుందో ఎవరో చెప్పలేరు. ఏ మలుపు తీసుకుంటుందో కూడా ఎవరూ ఊహించలేరు. ఒకప్పుడు దీనంగా ఉన్నవారు, హీనంగా ఉన్నవారు పై స్థాయికి రావచ్చు. అంతకుమించి అనే రేంజ్ లో ఎదగవచ్చు. అంతే తప్ప తక్కువ స్థాయిలో ఉన్నారని.. తగ్గి ఉన్నారని.. అక్కడికే పరిమితమవుతారని అస్సలు అనుకోవద్దు. వ్యక్తులకే కాదు వ్యవస్థలకు కూడా ఇది వర్తిస్తుంది. వ్యక్తులు రూపొందించిన కంపెనీలకూ సరిపోలుతుంది.
Also Read: వాట్సాప్‌లో ఇది తెరిచారో మీ డబ్బులు గోవిందా..
ఇప్పటికీ మనం గొప్ప గొప్ప ఆర్థిక వ్యవస్థలు ఉన్న దేశాల గురించి మాట్లాడుకుంటే .. ఆ దేశాలలో ఉన్న ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థల గురించి కూడా మాట్లాడుకుంటాం. అమెరికా పేరు చెప్పగానే జెఫ్ బెజోస్ ( అమె జోన్), ఆపిల్, గూగుల్, మెటా గుర్తుకు వస్తాయి. జపాన్ పేరు చెప్పగానే సోనీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇండియా పేరు చెప్పగానే రిలయన్స్, టాటా, అదానీ, మహీంద్రా కళ్ళ ముందు కదలాడుతుంటాయి. ఇవన్నీ కూడా గొప్ప గొప్ప కంపెనీలు. లక్షలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థలు. అయితే ఈ సంస్థలు ప్రారంభంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసేవి. ఆ తర్వాత భిన్న రంగాలలోకి ప్రవేశించి ఈ స్థాయికి ఎదిగాయి. అయితే ఈ సంస్థలకు తాము చేస్తున్న వ్యాపారాలతో ఎంతో కొంత ప్రత్యక్ష లేదా పరోక్షమైన సంబంధం ఉంది. కానీ ఎటువంటి సంబంధం లేకుండా.. ఇటువంటి నేపథ్యం లేకుండా కొన్ని కంపెనీలు ప్రారంభమయ్యాయి. అంతకంతకు ఎదిగాయి. ఏకంగా దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసే దిశగా అడుగులు వేశాయి. ఆ అడుగులను మరింత బాలోపేతం చేసుకున్నాయి. అతిపెద్ద వ్యవస్థలుగా అవతరించాయి..
Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్.. ఇక రీల్స్ చూడడం చాలా ఈజీ
సాంసంగ్ కంపెనీ సౌత్ కొరియా దేశానికి చెందిందని తెలుసు కదా.. ఈ కంపెనీ ఎలక్ట్రానిక్స్.. సంబంధిత పరికరాల తయారీలో నెంబర్ వన్ గా ఉంది.. సౌత్ కొరియా జిడిపిలో ఈ కంపెనీకి సింహభాగం ఉంది. అయితే ఈ కంపెనీ ప్రారంభంలో ఎండు చేపలు అమ్మేది.. ఎండు చేపలు అమ్మిన తర్వాత వచ్చిన లాభాలతో క్రమక్రమంగా ఎలక్ట్రానిక్స్ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రపంచం టెక్నాలజీ వైపు పురోగమిస్తుందని అంచనా వేసి.. ఆ రంగంలో విపరీతంగా పరిశోధనలు చేసింది. చివరికి తిరుగులేని స్థాయికి ఎరిగింది. ఎండు చేపలు విక్రయించామని సాంసంగ్ కంపెనీ ఎప్పుడూ బాధపడలేదు.
ప్రపంచానికి సెల్ ఫోన్ ను పరిచయం చేసిన నోకియా ఒకప్పుడు బాత్రూం టిష్యూ పేపర్లను తయారు చేసేది. ఆ తర్వాత సెల్ ఫోన్ రంగంలోకి వచ్చింది. కొన్ని సంవత్సరాల పాటు మార్కెట్ ను శాసించింది. ఎక్కడో ఫిన్లాండ్ దేశంలో పుట్టిన ఈ కంపెనీ ప్రపంచ సెల్ ఫోన్ రంగ గతిని పూర్తిగా మార్చేసింది.
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ కూడా మొదటిగా ఆటోమొబైల్ రంగంలోకి రాలేదు. ఈ కంపెనీ నిర్మాణ రంగంలో అద్భుతాలు సృష్టించిన తర్వాత ఆటోమొబైల్ రంగంలోకి ప్రవేశించింది. ఆటో మొబైల్ రంగంలో తిరుగులేని ప్లేయర్ గా కొనసాగుతోంది.
అక్కడిదాకా ఎందుకు బాటా కంపెనీ కూడా పాదరక్షలు తయారు చేయడానికి అంటే ముందు తోలు పరిశ్రమలో ఉండేది. ఆ తర్వాత పాదరక్షల తయారీ లోకి వచ్చింది. వాస్తవానికి బాటా కంపెనీ అనేది భారతదేశానికి చెందింది కాదు. ఈ కంపెనీ చెకోస్లోవికియా దేశానికి చెందింది. కాకపోతే ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా పాదరక్షల దుకాణాలు ఉన్నాయి. కేవలం పాదరక్షల తయారీతోనే బాటా కంపెనీ ఆగిపోలేదు. బాటా కంపెనీ ఉన్న ప్రతి చోట సిటీస్ నిర్మించింది. ఉదాహరణకి వెస్ట్ బెంగాల్లో బాటనగర్ అనే పేరుతో అతిపెద్ద బహుళ అంతస్తుల నిర్మాణాలు ఉన్నాయి. పాకిస్తాన్ దేశంలో బాటా పూర్, కెనడాలో బాటావా, బ్రెజిల్ లో బాటా టూబా, ఫ్రాన్స్ లో బాటా విల్ అనే ప్రాంతాలను నిర్మించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు.. ఇవన్నీ కూడా ఎక్కడ మొదలైందో కాదు.. ఎక్కడి వరకు సాగిందో చెబుతున్నాయి. ఎందుకంటే ఒక సంస్థ అయినా.. ఒక వ్యక్తి అయినా సాగిపోవడానికి మాత్రమే లక్ష్యంగా పెట్టుకోవాలి. అప్పుడే ఆ జీవిత గమనానికి ఒక అర్థం ఉంటుంది. సార్థకత ఉంటుంది.