https://oktelugu.com/

Infosys: అక్కడికి వెళ్తే రూ. 8లక్షల ఇన్సెంటీవ్స్.. ఉద్యోగులకు ఇన్ఫోసిస్ సంచలన ఆఫర్..

ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్‌ విధుల్లో ఉన్న బ్యాండ్‌-2, ఆ పైస్థాయి ఉద్యోగులకు ట్రాన్స్‌ఫర్ ఇన్సెంటీవ్స్ (బదలీ ప్రోత్సాహకాలు) అందిస్తామని ఇన్ఫోసిస్‌ స్పష్టం చేసింది.

Written By:
  • Neelambaram
  • , Updated On : June 19, 2024 / 06:13 PM IST

    Infosys

    Follow us on

    Infosys: దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ తమ ఉద్యోగులకు ఆకర్షణీయ ప్యాకేజీని ప్రకటించింది. కర్ణాటకలోని హుబ్లీలోని డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో పని చేసేందుకు వస్తే రూ.8 లక్షల ప్రోత్సాహకం అందిస్తామని తెలిపింది. ఈ మేరకు ఉద్యోగులకు ఈ మెయిల్‌ ద్వారా సందేశాన్ని పంపింది. అభివృద్ధి చెందేందుకు మెరుగైన అవకాశాలున్న హుబ్లీలో పనిచేసేందుకు ప్రతిభావంతుల కోసం చూస్తున్నామని పేర్కొంది.

    ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్‌ విధుల్లో ఉన్న బ్యాండ్‌-2, ఆ పైస్థాయి ఉద్యోగులకు ట్రాన్స్‌ఫర్ ఇన్సెంటీవ్స్ (బదలీ ప్రోత్సాహకాలు) అందిస్తామని ఇన్ఫోసిస్‌ స్పష్టం చేసింది. భారత్‌లోని ఏ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ నుంచి అయినా ఉద్యోగులు హుబ్లీకి రావచ్చని కంపెనీ స్పష్టం చేసింది. బ్యాండ్‌ 3, అంత కంటే దిగువ స్థాయి ఉద్యోగులకు బదిలీ సమయంలో రూ.25,000 ఇస్తామని తెలిపింది. ఆ తర్వాత ప్రతీ ఆరు నెలలకు రూ.25 వేల చొప్పున రెండేళ్ల పాటు ఇస్తామని ప్రకటించింది. హుబ్లీకి వెళ్లేవారు మొత్తం రూ.1.25 లక్షల ఇన్సెంటీవ్స్ అందుకోనున్నారు. అలా బ్యాండ్‌ ఫోర్ (4) స్థాయి ఉద్యోగులకు రూ.2.5 లక్షలు, బ్యాండ్‌ 5 రూ.5 లక్షలు, బ్యాండ్‌ 6 స్థాయి ఉద్యోగులకు రూ.8 లక్షలు అందిస్తామని తెలిపింది.

    హుబ్లీ టైర్‌-2 సిటీగా గుర్తింపు దక్కించుకుంది. ఇక్కడ పని చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో కంపెనీ ఈ పాలసీ తెచ్చింది. ముఖ్యంగా ముంబై – కర్ణాటక ప్రాంతాలకు చెందిన ఉద్యోగులను తీసుకురావడమే లక్ష్యంగా చేసుకున్నట్లు కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల కర్ణాటక అసెంబ్లీలో హుబ్లీ ఇన్ఫోసిస్‌ క్యాంపస్‌కు సంబంధించి చర్చ జరిగింది. వేలాది మందికి ఉద్యోగులు పని చేయాల్సిన కేంద్రంలో కేవలం మొక్కలు మాత్రమే పెరుగుతున్నాయని ఓ ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకూ అక్కడ కార్యకలాపాలు ప్రారంభం కాలేదన్నారు. ఉద్యోగాలు వస్తాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇన్ఫోసిస్ కు 58 ఎకరాలు కేటాయించిందని గుర్తు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇన్ఫోసిస్‌ ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

    ఇన్ఫోసిస్‌ ప్రకటించిన ప్రోత్సాహక పాలసీని కర్ణాటక ఇండస్ట్రీ, మౌలిక వసతుల అభివృద్ధి శాఖ మంత్రి ఎంబీ పాటిల్‌ కొనియాడారు. దీని వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. టెక్‌ పరిశ్రమలో వినూత్న ఆవిష్కరణలు, ఉద్యోగుల సంక్షేమంలో ఇన్ఫోసిస్‌ నిబద్ధతకు ఇది నిదర్శమని ప్రశంసించారు.