Yoga: ప్రినేటల్ యోగా గురించి ఈ యోగా ప్రయోజనాల గురించి మీకు తెలుసా. యోగా అంటే కేవలం శరీరానికి వ్యాయామం లాంటిది మాత్రమే కాదు. శరీరం, మనస్సు, శ్వాస మధ్య సమతుల్యతను తీసుకురావడానికి ఎంతగానో తోడ్పడుతుంది. అందుకే గర్భిణీలు యోగా చేయాలి అంటారు నిపుణులు. అయితే మొదటి నుంచి యోగా చేయడం అలవాటు ఉన్నవారు గర్భధారణ సమయంలో కూడా చేస్తుంటారు . మరికొందరు గర్భధారణ సమయంలో యోగా చేయడం ప్రారంభిస్తుంటారు. అయితే సరైన మార్గనిర్ధేశనలోనే యోగా చేయాలి అంటున్నారు నిపుణులు.
గర్భిణీ స్త్రీలు రెండవ నెలలో అంటే 14 వారాల తర్వాత యోగా చేయాలి. ఈ ప్రినేటల్ యోగాలు శిశువు ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయం చేస్తుంటాయి. మొదటి మూడు నెలలు యోగా చేయకూడదు. ఈ సమయంలో యోగా చేస్తే కొందరికి గర్భస్రావం అయ్యే అవకాశం కూడా ఉంది. యోగా లేదా మరేదైనా వ్యాయామం వల్ల పిండానికి హాని కలుగుతుందనే ఆధారాలు లేవు కానీ జాగ్రత్తగా ఉండాలి అంటారు నిపుణులు. అయితే ఈ యోగాలను స్వయంగా చేయకుండా ముందుగా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
గర్భిణీ స్త్రీలు పశ్చిమోత్తాసనం, సుఖాసనం, వీరభద్రాసనం, ఉత్తానాసనం, ఊర్ధ్వ ఉత్తానాసనం, మార్జారియాసనం, విరాసనం, ఉష్ట్రాసనం వంటివి చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు రావు అంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల గర్భంలోని బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి ఈ యోగా సహాయం చేస్తుంది. అంతేకాదు ముఖ్యంగా నిద్రను కూడా మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, ఆందోళనను చాలా వరకు తగ్గిస్తుంది యోగా. ప్రసవానికి అవసరమైన కండరాల బలాన్ని పెంచుతుంది.
యోగా చేయడం వల్ల వెన్నునొప్పి, వికారం, తలనొప్పి, శ్వాస సమస్యలు తగ్గుతుంటాయి. యోగా చేసేటప్పుడు శరీరాన్ని ఒత్తిడికి గురి చేయకూడదు.అంతేకాదు యోగా చేస్తున్నప్పుడు అసలు తొందరపడకండి. మీకు వీలైనంత వరకు నెమ్మదిగా యోగా చేయడం మంచిది. అయితే ఏదైనా ఆసనం వేసే ముందు మరీ ముఖ్యంగా వైద్యులను కలవండి. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి యోగాను చేయండి.