Stock market ; బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు నుంచి షేర్ మార్కెట్ లో కదలికలు ఆశా జనకంగా కనిపించడం లేదు. దీంతో మధుపరులు ఒకింత ఆందోళన చెందుతున్నారు. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సితారామన్ ఈ నెల 23 (మంగళవారం) లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు నుంచి ఈ రోజు 8వ రోజు వరకు ఇన్వెస్టర్లు ఆందోళనల్లోనే ఉన్నారు. ఇప్పటికీ షేర్ మార్కెట్ పుంజుకోవడం లేదు. మరికొన్ని రోజులు ఇలాంటి నష్టాలు కొనసాగుతాయని మోతీలాల్ ఓస్వాల్ లాంటి రీసెర్చి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. మంచి లాభాలు మరికొన్ని రోజుల్లోనే అందుకునే అవకాశం లేకపోలేదని పేర్కొంటున్నాయి. భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ – 50 మంగళవారం ట్రేడింగ్ లో నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 81,360 వద్ద, నిఫ్టీ – 50 24,800 పైన ఉన్నాయి. ఉదయం 9.18 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 5 పాయింట్లు లాభపడి 81,360.60 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 50 0.20 పాయింట్లు లేదంటే 0.00080 శాతం క్షీణించి 24,835.90 వద్ద ముగసింది. ఈ వారం అమెరికా ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ సహా ప్రధాన కేంద్ర బ్యాంకుల పాలసీ సమావేశాలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించారు. బ్యాంకింగ్ సహా వడ్డీ ఆధారిత రంగాలపై దృష్టి సారించనున్నట్లు తెలిపింది. ‘మొత్తం మీద, మార్కెట్ క్రమంగా పుంజుకుంటుందని ఆశిస్తున్నాము, అయితే, కీలక ఘటనలకు ముందు అస్థిరతను తోసిపుచ్చలేము’ అని మోతీలాల్ ఓస్వాల్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా చెప్పారు. ‘వచ్చే 1-2 సెషన్లలో కొంత కదలికలు లేదంటే స్వల్ప క్షీణతకు అవకాశం ఉండడంతో మార్కెట్ సమీప అప్ ట్రెండ్ చెక్కు చెదరలేదు. తక్షణ మద్దతు 24,600 స్థాయిల్లో ఉండగా, ఓవర్ హెడ్ రెసిస్టెన్స్ 25,000-25,100 స్థాయిలో ఉంది’ అని హెచ్‌డీఎఫ్ సీ సెక్యూరిటీస్ కు చెందిన నాగరాజ్ శెట్టి తెలిపారు.
ఎస్ అండ్ పీ 500 ఫ్యూచర్స్, హ్యాంగ్ సెంగ్ ఫ్యూచర్స్, జపాన్ కు చెందిన టోపిక్స్, ఆస్ట్రేలియాకు చెందిన ఎస్ అండ్ పీ/ ఏఎస్ఎక్స్ 200, యూరో స్టోక్స్ 50 ఫ్యూచర్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ట్రేడర్లు రాబోయే విధాన నిర్ణయాలు, శుక్రవారం కీలకమైన యూఎస్ ఉపాధి నివేదిక కోసం ఎదురు చూడడంతో డాలర్ స్థిరంగా కొనసాగుతోంది. చైనా డిమాండ్ గురించి ఆందోళనలు, మధ్య ప్రాచ్యంలో ఘర్షణ పెరిగే ప్రమాదాన్ని మార్కెట్ పట్టించుకోకపోవడంతో చమురు ధరలు మంగళవారం (జూలై 30) ప్రారంభ ఆసియా ట్రేడింగ్ లో పడిపోయాయి.
సోమవారం (జూలై 29) విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు రూ. 2,474 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 5,665 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఐఓసీ, వరుణ్ బేవరేజెస్, గెయిల్, మాక్రోటెక్, టాటా కన్జ్యూమర్ సహా పలు కంపెనీలు మంగళవారం తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి.