https://oktelugu.com/

Janasena party : జనసేన సరికొత్త రికార్డు.. హేళన చేసిన పార్టీలకు దీటైన సమాధానం!

జనసేన సరికొత్త రికార్డు సృష్టించింది. సభ్యత్వ నమోదులో చరిత్ర నమోదు చేసింది. పది లక్షల సభ్యత్వ నమోదు దాటింది. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది.

Written By:
  • Dharma
  • , Updated On : July 30, 2024 / 12:28 PM IST
    Follow us on

    Janasena party  : ఏపీ పొలిటికల్ హిస్టరీలో జనసేనది ప్రత్యేక స్థానం. మొన్నటి వరకు ఫెయిల్యూర్ పార్టీ. కానీ ఈ ఎన్నికల్లో సంపూర్ణ విజయం సాధించడంతో జనసేన పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. తన పార్టీ అభ్యర్థులు గెలవడమే కాదు.. ఏపీలో ఎన్డీఏ కూటమి గెలుపునకు కూడా పవన్ కళ్యాణ్ కారణమని నేషనల్ మీడియాలో ప్రత్యేక కథనాలు వచ్చాయి. ప్రధాని మోదీ అయితే పవన్ కాదు.. తుఫాన్ అంటూ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ స్టామినాను జాతీయస్థాయిలో పెంచారు. 2014 ఎన్నికల నాటికి ఆవిర్భవించింది జనసేన. కానీ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాష్ట్రంలో టిడిపికి, కేంద్రంలో బిజెపికి మద్దతు తెలిపారు పవన్. రెండు చోట్ల మద్దతిచ్చిన వారే గెలిచారు. 2019 ఎన్నికల్లో ప్రత్యేక పరిస్థితుల్లో ఎవరికి వారే ఒంటరిగా పోటీ చేశారు. జనసేన ఒకచోట మాత్రమే గెలిచింది. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ ఓడిపోయారు. దీంతో జనసేన అంటేనే ఒక రకమైన ప్రచారం ప్రారంభమైంది. అదొక పార్టీయేనా అని ఎగతాళి చేసిన వారు సైతం ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ నేతలు జనసేన విషయంలో హేళనగా మాట్లాడేవారు.కానీ ఈ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది జనసేన. పొత్తులో భాగంగా 21చోట్ల పోటీ చేసి విజయం సాధించింది. శత శాతం విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే క్షేత్రస్థాయిలో జనసేనకు ఉండే అభిమానులు సంఘటితం కావడం వల్లే ఈ అద్భుత విజయం సాధ్యమైంది. ఇప్పుడు మరో రికార్డుకు దగ్గరగా ఉంది జనసేన. పది లక్షల సభ్యత్వ నమోదు దాటడం విశేషం.

    * బలోపేతం పై ఫోకస్
    జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం పై నాయకత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఈ నెల 18 నుంచి సభ్యత్వ నమోదు ప్రారంభించారు. అయితే వారం రోజుల వ్యవధిలోనే 10 లక్షల సభ్యత్వాలు నమోదు కావడం విశేషం. అందుకే ఈ సభ్యత్వ నమోదు గడువును పెంచింది జనసేన. మరో వారం రోజులపాటు సభ్యత్వ నమోదు చేసుకోవచ్చని సూచించింది. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్ని వెల్లడించారు.ప్రతి నియోజకవర్గంలో 5000 మంది క్రియాశీల సభ్యత్వం తీసుకునేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

    * జనసేన విజయంతోనే..
    జనసేన విజయం సాధించిన నేపథ్యంలో ఈ ఏడాది సభ్యత్వ నమోదు సంఖ్య పెరగడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాలతో పాటు తెలంగాణలో కూడా సభ్యత్వాలు జరుగుతున్నాయి. అయితే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి వర్షాలు అడ్డంకిగా నిలిచాయి. అందుకే వారం రోజులు పాటు గడువు పెంచారు.వాస్తవానికి జనసేన ఆవిర్భావం నుంచి సభ్యత్వ నమోదు కొనసాగుతోంది. ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం పెరగడం, ద్వితీయ శ్రేణి క్యాడర్ పెరగడం కారణంగానే సభ్యత్వ నమోదు చురుగ్గా సాగుతున్నట్లు తెలుస్తోంది.

    * పెరిగిన ప్రాతినిధ్యం
    ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జనసేనకు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.ఇద్దరు ఎంపీలు కూడా కొనసాగుతున్నారు. జనసేనకు మూడు మంత్రి పదవులు దక్కాయి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా, ఆరు కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు వైసీపీ నుంచి జనసేనలో చేరికలు పెరిగే అవకాశం ఉంది. కానీ గెలిచి 50 రోజులు కూడా దాటకపోవడంతో ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. అయితే మున్ముందు చేరికలు పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే జనసేన బలం అమాంతం పెరగనుంది. ఏదిఏమైనా క్షేత్రస్థాయిలో జనసేన బలం పెరుగుతుండడం విశేషం.