https://oktelugu.com/

KVP  Ramachandhra Rao  : చిరంజీవి ప్రజారాజ్యం వెనుక రాజశేఖర్ రెడ్డి.. వైయస్ ఆత్మ కేవీపీ అనుమానం అదే!

2009 ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడానికి వెనుక ఉన్న కారణం ప్రజారాజ్యం పార్టీ. నాడు త్రిముఖ పోటీ ఉండడం వల్లే టిడిపి విజయానికి గండి పడిందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పుడు అదే అనుమానాన్ని రాజశేఖర్ రెడ్డి ఆత్మీయుడు బయట పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.

Written By:
  • Dharma
  • , Updated On : July 30, 2024 / 12:54 PM IST
    Follow us on

    KVP Ramachandhra Rao :వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపయోగమైన ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారు. వాటిని అమలు చేసి చూపించారు. ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. దీంతో 2009 ఎన్నికల్లో ఈజీగా అధికారంలోకి వస్తానని భావించారు. కానీ అది అంత సులువుగా రాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో.. అతి కష్టం మీద మాత్రమే అధికారంలోకి రాగలిగారు. అది కూడా చిరంజీవి ప్రజారాజ్యం పుణ్యమా అని.. చీలిన ఓట్లతోనే. ఇదే విషయాన్ని తాజాగా రాజశేఖర్ రెడ్డి ఆత్మగా పిలుచుకునే కెవిపి రామచంద్రరావు గుర్తు చేశారు. ఫలితాలు వచ్చిన రోజున రాజశేఖర్ రెడ్డి దిగాలుగా కనిపించారని.. ప్రజలకు ఎన్నో రకాల మంచి పథకాలు ప్రవేశపెట్టినా.. ప్రజలు గుర్తించలేదని.. పాస్ మార్కులతోనే ఉత్తీర్ణత ఇచ్చారని బాధపడిన వైనాన్ని కెవిపి ప్రస్తావించారు. కేవలం సాంకేతిక విజయం మాత్రమే దక్కిందని నాడు వైయస్సార్ భావించారని చెప్పుకొచ్చారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. టిడిపి, టిఆర్ఎస్, వామపక్షాలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. అటువంటి సమయంలోనే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. దీంతో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అతి కష్టం మీద గెలవగలిగింది. అధికారంలోకి వచ్చింది. అయితే రాజశేఖర్ రెడ్డి చెప్పినట్టు సాంకేతిక పరంగా విజయం సాధించామంటే.. పరోక్షంగా ప్రజారాజ్యం పార్టీయేనా? ఆ పార్టీ చీల్చిన ఓట్లతోనే కాంగ్రెస్ గెలిచిందా? అన్న విషయాలపై మాత్రం కెవిపి క్లారిటీ ఇవ్వలేదు. కానీ అదే రకంగా అనుమానిస్తూ సంకేతాలు మాత్రం ఇచ్చారు.

    * తనకంటూ ఒక ఇమేజ్
    తెలుగు నాట తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు చిరంజీవి. ఒక అనామకుడిగా సినీ రంగంలోకి ప్రవేశించి.. నందమూరి తారక రామారావు తర్వాత అంత ఇమేజ్ తో మెగాస్టార్ అయ్యారు చిరంజీవి. అదే ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకొని రాజకీయ పార్టీని స్థాపించారు. 2008లో తిరుపతిలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించినట్లు ప్రకటించారు. అప్పటికే వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. మరోవైపు ప్రాంతీయతత్వంతో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ ఉన్నారు. ఇందరితో తలపడడం ఆషామాషీ విషయం కాదు. కానీ 2009 ఎన్నికల్లో చిరంజీవి పోటీ చేశారు.16% ఓట్లతో 18 అసెంబ్లీ సీట్లను సొంతం చేసుకున్నారు.

    * మహాకూటమి విజయానికి గండి
    ఆ ఎన్నికల్లో మహాకూటమి చాలా నియోజకవర్గాల్లో స్వల్ప ఓట్లతో ఓడిపోయింది.ఇలా ఓడిపోయిన నియోజకవర్గాలు చాలా ఉన్నాయి.అప్పట్లోనే ప్రజారాజ్యం పార్టీ వెనుక రాజశేఖర్ రెడ్డి ఉన్నారన్న అనుమానాలు పెరిగాయి. ఆ అనుమానాలకు తగ్గట్టే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు చిరంజీవి. రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా తన పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. మళ్లీ ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు.అయితే అప్పట్లో టిడిపి విజయావకాశాలను ప్రజారాజ్యం గండి కొట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

    * వైయస్ కు ముందుగానే తెలుసు
    2004లో అధికారంలోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి విపరీతమైన సంక్షేమ పథకాలను అమలు చేశారు. అవి ప్రజల్లోకి బలంగా వెళ్లాయి.ఇదే విషయాన్ని రాజశేఖర్ రెడ్డి ముందుగానే పసిగట్టారని.. ఇంటెలిజెన్స్ రిపోర్టుల్లో కూడా ప్రతికూల ఫలితాలు ఖాయమని తేలిందని.. అందుకే రాజశేఖర్ రెడ్డి ప్రజారాజ్యం పార్టీని బరిలో నిలిచేలా రాజకీయ వ్యూహం చేశారని అప్పట్లో అనుమానాలు వెలువెత్తాయి. అయితే ఇప్పుడుకెవిపి కామెంట్స్ కూడా అలానే ఉన్నాయి. నాడు రాజశేఖర్ రెడ్డి చేసిన మంచి పనులకు మీడియా ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్లే.. ప్రజలకు చేరువ కాలేదని కెవిపి గుర్తు చేశారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.