Indian rupee worst performance: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిన చందంగా అమెరికా–ఇరాన్ వార్ ప్రపంచ దేశాలపై తీవ్రంగా పడింది. ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా భారత రూపాయి అత్యంత చెత్త ప్రదర్శనతో ఆసియాలోనే అత్యంత కనిష్టానికి పడిపోయింది. 2026లో అత్యంత బలహీన విలువైన కరెన్సీగా డారల్‌తో రూ.95.8 కి పడిపోయింది. ఆసియా మార్కెట్లలో అత్యధిక నష్టపోయిన కరెన్సీగా నిలిచింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి 6.5 శాతం పైగా విలువ కోల్పోయింది. పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, భౌగోళిక ఉద్రిక్తతలు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. కేవలం బాహ్య కారణాల వల్ల మాత్రమే కాదు. సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్న ఖాతా లోటు, మార్కెట్ నియంత్రణలు, ఎఫ్‌పీఐ నిష్క్రమణ, ఆఫ్‌షోర్–ఆన్‌షోర్ అనిశ్చితి, గ్లోబల్ ఏఐ మార్పులు, సేవల ఎగుమతి సమస్యలు వంటి అంతర్గత నిర్మాణాత్మక సమస్యలు కూడా దీనికి దోహదపడ్డాయి. రిజర్వ్ బ్యాంక్ డాలర్లను అమ్మకం చేసి ఆకస్మిక పతనాన్ని అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది.
ఆసియా దేశాల విలువ ఇలా..
ఇండోనేషియా రూపియా..
భారీ ఒత్తిడి ఇండోనేషియా రూపియా విలువ డాలర్‌కు 17,600 స్థాయి దాటి 4.6 శాతం వరకు బలహీనపడింది. డాలర్ బలం, భౌగోళిక రాజకీయ ప్రమాదాలు, ప్రభుత్వ బాండ్ల నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణలు ఇందుకు కారణమని బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా అంటోంది. తక్కువ ట్యాక్స్–టు–జీడీపీ నిష్పత్తి, లోతులేని ఆర్థిక మార్కెట్లు ఇలాంటి షాకులకు సులభంగా గురవుతున్నాయి. అయినా ప్రభుత్వం ఇంకా ఆందోళన చెందాల్సిన స్థాయిలో లేదని ఆశావాదం వ్యక్తం చేస్తోంది.
ఫిలిప్పైన్స్ పెసో..
రాజకీయ అనిశ్చితి తోడు ఫిలిప్పైన్స్ పెసో కూడా కొత్త రికార్డు నిమ్న స్థాయికి చేరుకుంది. డాలర్‌తో 61.64కి పడిపోయి సుమారు 4 శాతం నష్టపోయింది. బలమైన డాలర్, అధిక వడ్డీ రేట్లతోపాటు రాజకీయ అనిశ్చితి కూడా ఈ పతనానికి కారణమవుతోంది. వైస్ ప్రెసిడెంట్ సారా డూటర్టెపై ఇంపీచ్మెంట్ విచారణ నేపథ్యంలో మార్కెట్లు అదనపు రిస్క్ ప్రీమియం వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
దక్షిణ కొరియా వాన్..
మూలధన పలాయనం దక్షిణ కొరియా వాన్ డాలర్‌కు 1,498 స్థాయి చుట్టూ తిరుగుతూ ఈ ఏడాది 3 శాతం వరకు బలహీనపడింది. స్థానిక రిటైల్, సంస్థాగత పెట్టుబడిదారులు దేశీయ అనిశ్చితుల నుంచి రక్షణ కోసం అమెరికా మార్కెట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది దేశంలో మూలధన పలాయనానికి దారితీస్తోంది.
థాయ్ బాట్..
ఆయిల్ ధరలు, బంగారం ప్రభావం థాయ్ బాట్ 2.6 శాతం తగ్గి 32.58 స్థాయికి చేరుకుంది. పశ్చిమాసియా యుద్ధం, డాలర్ సేఫ్ హేవెన్ డిమాండ్, తగ్గిన బంగారం ధరలు, బ్యాంక్ ఆఫ్ థాయ్‌లాండ్ రిజర్వ్ నిర్వహణ వంటివి దీనిని మరింత ఒత్తిడికి గురి చేస్తున్నాయి. దిగుమతి ముడి పదార్థాల ఖర్చు పెరగడం కూడా ఆందోళన కలిగిస్తోంది.
హాంకాంగ్ డాలర్..
పెగ్ వ్యవస్థ రక్షణహాంకాంగ్ డాలర్ ఈ ఏడాది 0.6 శాతం మాత్రమే బలహీనపడింది. 7.85 ఫ్లోర్ స్థాయిని దాటకుండా కట్టుబాటు వ్యవస్థ ఉండటం వల్ల హాంకాంగ్ మానిటరీ అథారిటీ అవసరమైతే డాలర్లు విక్రయించి రక్షణ కల్పిస్తోంది.
తైవాన్ డాలర్..
వ్యతిరేక ధోరణితో తైవాన్ డాలర్ మాత్రం స్వల్పంగా 0.3 శాతం తగ్గినా, కొన్ని రోజులు బలమైన లాభాలు సాధించింది. ఎగుమతిదారులు డాలర్ నిల్వలను స్థానిక కరెన్సీకి మార్చడం ఇందుకు ప్రధాన కారణం.
2026లో ఆసియా కరెన్సీలు ఎదుర్కొంటున్న ఒత్తిడి బాహ్య కారణాలతోపాటు ప్రతి దేశం యొక్క అంతర్గత ఆర్థిక బలహీనతలను కూడా బయటపెడుతోంది. భారత రూపాయి సవాళ్లు మరింత లోతైనవి కావడం ఆందోళన కలిగిస్తోంది.
