Deepavali 2023: కొన్ని రకాల వ్యాపారాలు చాలా సింపుల్ గా కనిపిస్తాయి. కానీ ఆ వ్యాపారం చేస్తే దండిగా ఆదాయం లభిస్తుందన్న విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా ఫుట్ పాత్ వ్యాపారాలు, తోపుడుబండ్లపై వ్యాపారాలను చాలా తక్కువ చేసి చూస్తుంటాం. కానీ అక్కడ జరిగే క్రయవిక్రయాలు, లావాదేవీలు, క్యాష్ టర్నోవర్లు మరి ఎక్కడ జరగవు. కొన్ని వ్యాపారాలు అయితే ఏడాదంతా చేయాల్సిన అవసరం ఉండదు. ఒక్క నెల చాలు. దండిగా ఆదాయం. శ్రమకు తగ్గట్టు ఫలితం ఉంటుంది.
దీపావళి వచ్చిందంటే చాలు.. తెలంగాణ వ్యాప్తంగా బిహారీలు దర్శనమిస్తారు. పలు రకాల ప్రమిదలను విక్రయిస్తుంటారు. వీరు మహారాష్ట్ర, హర్యానాలో కళాకారులు తయారు చేసే రకరకాల ప్రమిదలను తెచ్చి విక్రయిస్తుంటారు. ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా బిహారీ వ్యాపారులే కనిపిస్తుంటారు. ఫుట్ పాత్ వ్యాపారాలుగాను, షాపులను అద్దెకు తీసుకొని వీటిని విక్రయిస్తుంటారు.
అయితే ఇక్కడ విక్రయించే ప్రమిదలు చాలా ఆకర్షణగా కనిపిస్తుంటాయి. రూపాయి నుంచి మొదలుకొని వెయ్యి రూపాయల వరకు రకరకాల రూపంలో ఈ ప్రమిదలను విక్రయిస్తుండడం విశేషం. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రెండు నెలల కిందటి నుండే వీటి విక్రయాలు ప్రారంభమయ్యాయి.
యాట అయిదు రాష్ట్రాల నుంచి ఈ ప్రమిదలను, వివిధ రకాల బొమ్మలను తీసుకువచ్చి విక్రయిస్తుంటామని బిహారీ వ్యాపారాలు చెబుతున్నారు. కేవలం రెండు నెలలు కష్టపడితే.. ఏడాదికి తగ్గట్టు ఆదాయం పొందుతామని.. కరోనాతో మూడేళ్లపాటు వ్యాపారానికి దూరమయ్యామని.. ప్రస్తుతం ఈ వ్యాపారం లాభసాటిగా ఉందని.. తక్కువ పెట్టుబడి తో లాభాలు ఆర్జించవచ్చని చెబుతున్నారు.