Hyundai Creta : హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) మార్చి 2025లో క్రెటా దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచిందని ప్రకటించింది. ఆ నెలలో మొత్తం 18,059 యూనిట్ల క్రెటా అమ్ముడయ్యాయి. అంతేకాకుండా SUV సెగ్మెంట్‌లో కూడా క్రెటా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఆర్థిక సంవత్సరం 2024-25 నాల్గవ త్రైమాసికంలో (జనవరి నుంచి మార్చి వరకు) క్రెటా అత్యధికంగా అమ్ముడైన SUVగా నిలిచింది. ఈ మూడు నెలల్లో మొత్తం 52,898 యూనిట్ల క్రెటా అమ్ముడయ్యాయి.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 2024-25 ఆర్థిక సంవత్సరంలో క్రెటా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన మూడవ కారుగా నిలిచింది. దాదాపు 1,94,871 మంది ఈ కారును కొనుగోలు చేశారు. క్రెటాకు ఉన్న ఈ అద్భుతమైన డిమాండ్ SUV అమ్మకాల్లో ఏడాదికేడాది 20 శాతం వృద్ధిని సూచిస్తుంది. భారతదేశంలో విడుదలైన తర్వాత క్రెటా అత్యధికంగా అమ్ముడవడం ఇదే మొదటిసారి.
Also Read : 10 ఏళ్లలో 15 లక్షల యూనిట్లు.. హ్యుందాయ్ క్రెటా సక్సెస్ స్టోరీ!
క్రెటాలోని ఈ మోడళ్లకు అత్యధిక డిమాండ్
క్రెటా వేరియంట్ల వారీగా అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే.. ఇప్పుడు ప్రజలు ప్రీమియం ఫీచర్లతో కూడిన మోడళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తుంది. మొత్తం అమ్మకాల్లో సన్‌రూఫ్ కలిగిన క్రెటా వేరియంట్ల విక్రయాలు 69 శాతంగా ఉన్నాయి. అలాగే కనెక్టెడ్ ఫీచర్లు మొత్తం అమ్మకాల్లో 38 శాతం వాటాను కలిగి ఉన్నాయి. దీనితో పాటు గత ఆర్థిక సంవత్సరంలో 24 శాతం మంది క్రెటా టాప్ మోడళ్లను కొనుగోలు చేశారు. క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా అమ్మకాల్లో 71 శాతం గణనీయంగా పెరిగాయి.
క్రెటా ధర ఎంత?
హ్యుందాయ్ క్రెటా ధర రూ.11.11 లక్షల నుంచి రూ.20.50 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ధర రూ.17.99 లక్షల నుంచి రూ.24.38 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ రేంజ్ ఆధారంగా 2 మోడళ్లలో లభిస్తుంది. హ్యుందాయ్ క్రెటా మూడు ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. ఇందులో ఒక నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, ఒక టర్బోచార్జ్డ్ ఇంజన్, ఒక డీజిల్ ఇంజన్ ఉన్నాయి. అన్ని ఇంజన్ల సామర్థ్యం 1.5 లీటర్లు. భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, టాటా కర్వ్‌లతో పోటీపడుతుంది.
క్రెటా విజయంపై కంపెనీ ఏమందంటే
క్రెటా సాధించిన ఈ విజయంపై హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, “హ్యుందాయ్ క్రెటా భారత ఆటోమోటివ్ రంగంలో కొత్త శిఖరాలను చేరుకుంటోంది. SUV సెగ్మెంట్‌లో నిరంతరం అగ్రస్థానంలో ఉండడం, అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌గా నిలవడం భారతీయ వినియోగదారులలో దీనికి ఉన్న బలమైన డిమాండ్‌ను సూచిస్తుంది. హ్యుందాయ్ ఇప్పటివరకు 12 లక్షలకు పైగా క్రెటా మోడళ్లను ఉత్పత్తి చేసింది.” అని అన్నారు.
Also Read : థాయ్‌లాండ్‌లో దుమ్ములేపుతున్న ఇండియన్స్ ఫేవరేట్ కారు