Hyundai Creta
Hyundai Creta : ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆటోమొబైల్ తయారీదారీ కంపెనీల్లో హ్యుందాయ్ సంస్థ ఒకటి. దాని అత్యంత పాపులర్ కాంపాక్ట్ SUV క్రెటా N Line మోడల్‌ను ఇండియాలో గతేడాది మార్చిలో విడుదల చేసింది. సరిగ్గా ఏడాది తిరిగేసరికి ఈ మోడల్‌ను థాయ్‌లాండ్‌లో కూడా విడుదల చేశారు. విశేషం ఏమిటంటే.. భారతదేశంలో ఉన్న మోడల్ మాదిరిగానే థాయ్-స్పెక్ మోడల్ కూడా హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఫేస్‌లిఫ్టెడ్ క్రెటాను జనవరి 2024లో భారత్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
థాయ్-స్పెక్ హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్‌ను ఇటీవల 2025 బ్యాంకాక్ ఇంటర్నేషనల్ మోటార్ షోలో ప్రదర్శించారు. దీనిని ఇండోనేషియా నుంచి కంప్లీట్ బిల్ట్ యూనిట్ (CBU)గా థాయ్‌లాండ్‌కు దిగుమతి చేయనుంది. భారతీయ స్పెక్ హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్, థాయ్‌లాండ్‌లో ఉన్న క్రెటా ఎన్ లైన్‌తో పోల్చి చూసినట్లైతే… థాయ్‌లాండ్‌లో క్రెటా ఎన్ లైన్ CBU హోదా కారణంగా చాలా ఎక్కువ ధరను కలిగి ఉంటుంది. దీని ధర 1.199 మిలియన్ బాట్ (సుమారు ₹30.35 లక్షలు). భారతదేశంలో ఈ స్పోర్టీ SUV ప్రారంభ ధర రూ.16.82 లక్షలు, ఇది థాయ్‌లాండ్‌తో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది.
Also Read : కేవలం రూ.25వేలకే హ్యుందాయ్ క్రెటా.. వెంటనే డెలివరీ కూడా.. త్వరపడండి
భారత్, థాయ్‌లాండ్‌లోని హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ మధ్య ఉన్న అతి పెద్ద వ్యత్యాసం ఇంజిన్‌లోనే ఉంది. భారతీయ వెర్షన్‌లో 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ యూనిట్ అమర్చబడి ఉంది. ఇది 160 PS పవర్, 253 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT)తో వస్తుంది. ఈ ఇంజన్ కస్టమర్లకు అద్భుతమైన పనితీరును అందిస్తుంది. దీనికి విరుద్ధంగా బ్యాంకాక్ ఇంటర్నేషనల్ మోటార్ షోలో ప్రదర్శించిన క్రెటా ఎన్ లైన్‌లో 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ MPI పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ యూనిట్ 115 PS పవర్, 144 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
రెండు మార్కెట్లలోనూ హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ డిజైన్ దాదాపు ఒకేలా ఉంది. ఆకర్షణీయమైన బంపర్‌లు, స్పోర్టీ లుక్ కలిగి ఉంటుంది. థాయ్‌లాండ్‌లో క్రెటా ఎన్ లైన్ ఫియరీ రెడ్ అనే ఒక స్పెషల్ రెడ్ కలర్లో లభిస్తుంది. ఇండియాలో మూడు డ్యూయల్ టోన్ ఆప్షన్‌లతో సహా మొత్తం 6 ఎక్స్ ట్రా కలర్ ఆఫ్షన్లను అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ రెడ్ కలర్ మాత్రం లేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇండియన్ వేరియంట్ ఫ్రంట్ గ్రిల్, బంపర్, సైడ్ క్లాడింగ్‌పై ఉన్న ఎరుపు హైలైట్‌లు థాయ్ మోడల్‌లో కనిపించవు.
లోపలికి అడుగు పెడితే థాయ్ వెర్షన్ దాని ఇండియన్ వెర్షన్‌ను చాలా పోలి ఉంటుంది. రెండింటిలోనూ రెడ్ కలర్ యాక్సెంట్‌లతో కూడిన ఆల్-బ్లాక్ క్యాబిన్ ఉంది. డాష్‌బోర్డ్, స్టీరింగ్ వీల్, టచ్‌స్క్రీన్ అంచులు, గేర్ సెలెక్టర్‌పై ఉన్న రెడ్ కలర్ డీటైలింగ్ థాయ్ వెర్షన్‌లో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. సీట్లపై ఉన్న రెడ్ కలర్ కుట్లు రెండు మోడళ్లలోనూ స్పోర్టీ థీమ్ అందిస్తాయి. ఫీచర్ల విషయానికి వస్తే థాయ్‌లాండ్ మార్కెట్ కోసం క్రెటా ఎన్ లైన్‌లో ట్విన్ 10.25-ఇంచుల స్క్రీన్లు, 8-స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ వంటి ఫీచర్లు లభిస్తాయి.
Also Read : హ్యుందాయ్ క్రెటా ఈవీ vs మిగతా ఈవీలు.. ఏది బెస్ట్, బ్యాటరీ సామర్థ్యం ఎంత? ఫీచర్స్ ఇవీ