Chicken: ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు టపటపా రాలిపోతున్నాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో చికెన్ తినడానికి కూడా జనం భయపడుతున్నారు. అక్కడ పరిస్థితి ఇలా ఉంటే.. మిగతా జిల్లాలతోపాటు తెలంగాణలో చికెన్ ధరలు మండుతున్నాయి. సమ్మక్క జాతర, సండే ఎఫెక్ట్‌తో భారీగా పెరిగాయి. వారం మధ్యలో రూ.200 నుంచి రూ.220 పలికిన కేజీ చికెన్ ఇప్పుడు రూ.240 నుంచి రూ.300 వరకు పలుకుతోంది.
ముక్కలేనిదే ముద్ద దిగక..
చాలా మందికి భోజనంలో ముక్క లేనిదే ముద్ద దిగదు. వారానికి కనీసం రెండు మూడుసార్లు చికెన్ లేదా మటన్ ఉండాల్సిందే. ఇక ఆదివారం వచ్చిదంటే చికనో మటనో ఉండాల్సిందే. సమ్మక్క జాతర, ఆదివారం ఎఫెక్ట్‌తో కొన్ని రోజులుగా చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో నీసు కూర కోసం చూస్తున్న వారు ఇప్పడు కోడి గుడ్డు, చేపలతో సరిపెట్టుకుంటున్నారు.
సామాన్యులకు భారం..
అసలే నెలాఖరు.. ఉన్నంతలో అరకిలో, కిలో చికెన్ తెచ్చి రోపు గడిపేద్దామని ఉదయం షాప్‌కు వెళ్లిన వారు అక్కడి ధర చూసి షాక్ అవుతున్నారు. మేడారం జాతరకు ముందు వరకు చికెన్ కిలో ధర రూ.200 లోపే ఉంది. జాతర ప్రారంభమైన తర్వాత క్రమంగా ధర పెరుగుతోంది. శనివారం వరకు కిలో రూ.220 పలికిన ధర ఆదివారం ఏకంగా రూ.260 నుంచి రూ.300కు చేరింది. దీంతో చికెన్ కొందామని వెళ్లినవారు కోడిగుడ్లు, లేదా చేపలు తీసుకుని ఇళ్లకు వెళ్తున్నారు. ధరల పెరుగుదల మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగుతుందని వ్యాపారులు చెబుతున్నారు.