Teacher: సరస్వతి దేవి పై టీచర్ అనుచిత వ్యాఖ్యలు.. తర్వాత ఏమైందంటే?

రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో గత నెల 26న గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో జెండా వందనం నిర్వహించారు. అనంతరం ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

Written By: Neelambaram, Updated On : February 25, 2024 2:11 pm
Follow us on

Teacher: సరస్వతి దేవిని చదువుల తల్లిగా కొలిచే దేశం మనది. ఆమె పుట్టిన రోజును వసంత పంచమిగా జరుపుకునే సంస్కృతి మనది. ఆమె పుట్టిన రోజు నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. ఆ రోజున అక్షరాభ్యాసం చేస్తే పిల్లలకు మంచిదని నమ్ముతుంటారు. కానీ అంతటి సరస్వతి దేవిని ఉపాధ్యాయురాలు నోటికొచ్చిన తీరుగా మాట్లాడారు. దీంతో ఆ ఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది.

రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో గత నెల 26న గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో జెండా వందనం నిర్వహించారు. అనంతరం ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఆ తర్వాత ఆమె సరస్వతి దేవి పైకి టాపిక్ మళ్లించారు. ఆమెపై అనుచితంగా మాట్లాడారు. ” పాఠశాల కోసం సరస్వతి దేవి ఏం చేశారు? విద్యాభివృద్ధి కోసం ఏం చేశారు?” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ ఉపాధ్యాయురాలు మాట్లాడిన మాటలను కొంతమంది స్మార్ట్ ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో ఆ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన అక్కడి ప్రభుత్వం క్రమశిక్షణ కమిటీని నియమించింది. రాజస్థాన్ రాష్ట్రంలోని బరాన్ జిల్లా లకాడియా గ్రామంలోని కిషన్ గంజ్ ప్రాంతంలో ఓ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇక్కడి పాఠశాలలో హేమలత భైర్వ అనే మహిళ ఉపాధ్యాయురాలు పనిచేస్తున్నారు. గత నెల జనవరి 26న ఆ పాఠశాలలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. వేదిక మీద జాతిపిత మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఫోటోలు ఏర్పాటు చేశారు. వారి ఫోటోలకు పక్కన సరస్వతి దేవి చిత్రపటాన్ని పెడుతుంటే హేమలత అడ్డుకున్నారు. సరస్వతి దేవి విద్యాభివృద్ధి కోసం ఏం చేశారని ప్రశ్నించారు..

హేమలత అడ్డుకున్న తీరును కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ విషయం అక్కడి అధికారులకు తెలియడం.. ఆ తర్వాత ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో.. జరిగిన సంఘటనపై విచారించేందుకు ప్రభుత్వం క్రమశిక్షణ కమిటీని నియమించింది. వారు ఇన్ని రోజుల పాటు విచారణ నిర్వహించిన అనంతరం ప్రభుత్వానికి ఒక నివేదిక అందించారు. ఆ నివేదికలో అంశాల ఆధారంగా ప్రభుత్వం హేమలతను విధులు నుంచి తప్పిస్తూ శనివారం నిర్ణయం తీసుకుంది. “చదువుల తల్లి సరస్వతిని ఒక బాధ్యతాయుతమైన ఉపాధ్యాయురాలి ఉద్యోగంలో ఉన్న మహిళా టీచర్ హేమలత అవమానించారు. సరస్వతి మాతను ఏం చేశారని ప్రశ్నించారు. ఓ వర్గం వారు కొలిచే దేవత పట్ల ఇష్టానుసారంగా మాట్లాడారు. అందుకే ఆమెపై చర్యలు తీసుకున్నామని” రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ ప్రకటించారు.