GST rate cut 2025: GST : ఏసీలు, ట్రాక్టర్లు చీప్.. రైతులకు, వినియోగదారులకు గుడ్ న్యూస్..
GST : ప్రస్తుతం దేశంలోని వినియోగదారులు, రైతులు ఓ విషయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలో జరగనున్న 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం మీద దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఉంది. ఈ సమావేశంలో జీఎస్టీ రేట్ల పై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఏసీలు, ట్రాక్టర్లతో సహా అనేక ప్రొడక్ట్స్ పై జీఎస్టీని తగ్గించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే, పూర్తి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయవచ్చని కూడా చర్చ జరుగుతోంది.
Also Read: ఇక ఆ పన్నులు ఉండవు.. సామాన్యులకు ఇదో పెద్ద ఊరట..!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ఎజెండాను ఆమెనే నిర్ణయిస్తారు. గత డిసెంబర్ 2024లో జరిగిన 55వ సమావేశం తర్వాత, జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ కోసం పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. ఈసారి సమావేశంలో ఇదే ప్రధాన అజెండాగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. హేతుబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా అన్ని కేటగిరీల ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లను సమీక్షించే అవకాశం ఉంది. కొన్ని ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించాలని సూచనలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇది వినియోగదారులకు, కొన్ని పరిశ్రమలకు పెద్ద ఊరట కలిగించవచ్చు.
జీఎస్టీ కౌన్సిల్ ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తుందా?
1. 12 శాతం జీఎస్టీ స్లాబ్ రద్దు
ప్రస్తుతం అనేక ఉత్పత్తులపై 12 శాతం జీఎస్టీని ప్రభుత్వం విధిస్తుంది. అయితే, ఈ 12 శాతం జీఎస్టీ స్లాబ్‌ను పూర్తిగా తొలగించాలని జీఎస్టీ కౌన్సిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని వల్ల 12 శాతం స్లాబ్‌లో ఉన్న అనేక వస్తువులు, ఉత్పత్తులు 5 శాతం లేదా 18 శాతం స్లాబ్‌లలోకి మారవచ్చు. ఇది గీ, బటర్, మొబైల్స్, ప్యాకేజ్డ్ ఫుడ్, ఫర్నిచర్ వంటి నిత్యావసరాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని ఉత్పత్తులు చౌకగా మారితే, మరికొన్నింటి ధరలు పెరిగే అవకాశం ఉంది.
2. టర్మ్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ తగ్గింపు
ప్రస్తుతం పూర్తి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లపై 18 శాతం జీఎస్టీ విధించబడుతోంది. దీనిని పూర్తిగా రద్దు చేసి, 5 శాతం జీఎస్టీ స్లాబ్‌లో చేర్చాలని ఆలోచనలు జరుగుతున్నాయి. ఇది సామాన్య ప్రజలకు బీమాను మరింత అందుబాటులోకి తెస్తుంది. అయితే, బీమా కంపెనీలు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయవచ్చని తెలుస్తోంది.
3. ఏసీలు, ట్రాక్టర్లపై జీఎస్టీ తగ్గింపు
ప్రస్తుతం ట్రాక్టర్లు 12 శాతం జీఎస్టీ స్లాబ్‌లో ఉన్నాయి. ఈ స్లాబ్‌ను పూర్తిగా తొలగిస్తే, ట్రాక్టర్లు 5 శాతం స్లాబ్‌లోకి మారే అవకాశం ఉంది. దీనివల్ల రైతులకు ట్రాక్టర్ల ఖర్చు తగ్గుతుంది. రాబోయే రోజుల్లో TREM-IV ప్రమాణాలకు అనుగుణంగా తయారుచేసిన ట్రాక్టర్లు మాత్రమే మార్కెట్లోకి వస్తాయి. ఈ ప్రమాణాలకు అనుగుణంగా ట్రాక్టర్లను తయారు చేయడానికి కంపెనీలు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. జీఎస్టీ తగ్గింపు ద్వారా ఈ అదనపు భారాన్ని తగ్గించుకోవాలని కంపెనీలు ఆశిస్తున్నాయి.
ప్రస్తుతం ఏసీలు 28 శాతం జీఎస్టీ స్లాబ్‌లో ఉన్నాయి. జనవరి 2026 నుండి బీఈఈ ప్రమాణాల ప్రకారం పనిచేసే ఏసీలు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రమాణాలతో కూడిన ఏసీలను తయారు చేయడానికి కంపెనీలకు సగటున 3 శాతం నుండి 5 శాతం వరకు ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏసీలపై జీఎస్టీని తగ్గించినట్లయితే, వోల్టాస్, హావెల్స్ వంటి ఏసీ తయారీ కంపెనీలకు భారీ ఊరట లభిస్తుంది.
Also Read: అమ్మాయిలతో ఏంట్రా ఈ పనులు.. ఇన్ని ఆఫర్లు ఇవ్వడం ఏంటి?
సెస్ పంపిణీలో కీలక మార్పులు?
జీఎస్టీ అమలు కారణంగా రాష్ట్రాలకు కలిగే ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్ విధిస్తోంది. ఇది పెద్ద కార్లు, ఎస్‌యూవీలు వంటి సెలెక్టెడ్ వస్తువులు, సేవల మీద విధిస్తున్నారు. ఈ సెస్ అమలు కాలం మార్చి 2026తో ముగుస్తుంది. ఈ సింగిల్ సెస్ స్థానంలో హెల్త్ సెస్, క్లీన్ ఎనర్జీ సెస్ అనే రెండు కొత్త పన్నులు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సెస్ ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపిణీ చేసే విధానంలో మార్పులు ఉండవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత మాత్రమే ఈ సెస్ ఆదాయాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేసేలా మార్పులు ఉండవచ్చునని తెలుస్తోంది.