Bathroom Camping: ప్రస్తుతం అందరిదీ ఉరుకులు, పరుగుల జీవితమే.. కాలంలో పోటీ పడి పనిచేయాల్సిన పరిస్థితి. పోటీ పడలేని వ్యక్తులు వెనుకబడిపోతారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారు. ఇక ఆర్థిక సమస్యలు, ఇతర కుటుంబ సమస్యలతో చాలా మంది ఒత్తిడిలోనే ఉంటున్నారు. కొందరు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇక చాలా మంది ఒత్తిడి నుంచి ఉపశమనానికి వివిధ మార్గాలు అనుసరిస్తున్నారు. చాలా మంది మద్యం తాగుతూ అన్నీ మర్చిపోతున్నారు. మద్యం అలవాటు లేనివారు బాత్‌రూమ్‌లను ఎంచుకుంటున్నారు. అవే తమ సురక్షిత స్థలాలుగా భావిస్తున్నారు. ఈ విధానం ఇప్పుడు ‘బాత్రూం క్యాంపింగ్‘గా వైరల్ అవుతోంది. ఈ వైరల్ ట్రెండ్ టిక్‌టాక్‌లో జనాదరణ పొందింది. ఇక్కడ జెన్ జెడ్ వినియోగదారులు గంటల తరబడి బాత్రూమ్‌లలో గడిపే వీడియోలను పంచుకుంటున్నారు.
బాత్రూం క్యాంపింగ్ అంటే..?
బాత్రూం క్యాంపింగ్ అనేది యువత ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి బాత్రూమ్‌లలో గంటల తరబడి గడపడం.. సోషల్ మీడియాలో సమయం గడపడం, సంగీతం వినడం లేదా ఆలోచనల్లో మునిగిపోవడం వంటి కార్యకలాపాలను చేపట్టడం. ఈ ట్రెండ్ సాధారణ టాయిలెట్ వినియోగం కంటే భిన్నంగా, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం ఒక సురక్షిత స్థలంగా బాత్రూమ్‌ను ఉపయోగించడం ద్వారా నిర్వచించబడుతుంది. లాక్ చేయబడిన బాత్రూమ్ తలుపు వెనుక, యువత తమకు కావలసిన గోప్యతను పొందుతున్నారు, ఇది బయటి ప్రపంచం నుంచి ∙తాత్కాలిక విముక్తిని అందిస్తుంది.
Also Read: Telangana Maharashtra Border: ఏంటీ అరాచకం.. తెలంగాణ గ్రామాలు లాగేసుకుంటారా?
పెరుగుతున్న బాత్రూం క్యాపింగ్ ధోరణి…
ఈ డిజిటల్ యుగంలో, నిరంతరం సోషల్ మీడియా, పని ఒత్తిడి, సామాజిక బాధ్యతలు యువతను అలసిపోయేలా చేస్తున్నాయి. బాత్రూమ్‌లు ఒక అరుదైన ప్రైవేట్ స్థలంగా మారాయి, ఇక్కడ వారు బాహ్య ఒత్తిడి లేకుండా విశ్రాంతి తీసుకోవచ్చు. మానసిక ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, బాత్రూం క్యాంపింగ్ కొన్నిసార్లు ఆందోళన, డిప్రెషన్, లేదా పోస్ట్–ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటి సమస్యలకు సంకేతంగా ఉండవచ్చు. ఈ స్థలం యువతకు తమ భావోద్వేగాలను ప్రాసెస్ చేయడానికి ఒక ఆశ్రయంగా పనిచేస్తుంది. కొందరు యువత కుటుంబ సభ్యులతో ఉండే ఒత్తిడి లేదా టాక్సిక్ వాతావరణం నుంచి తప్పించుకోవడానికి బాత్రూమ్‌లను ఉపయోగిస్తారు. ఇది వారికి తాము నియంత్రణలో ఉన్న ఒక చిన్న స్థలాన్ని అందిస్తుంది.