Googlebook Laptops : టెక్ ప్రియులకు గూగుల్ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త తరం ల్యాప్‌టాప్‌లుగా పరిచయం చేయనున్న Googlebook డివైజ్‌ల ప్రీ-ఆర్డర్లకు తేదీని అధికారికంగా ప్రకటించింది. గూగుల్ అధికారిక Googlebook వెబ్‌సైట్ ప్రకారం.. సెప్టెంబర్ 21 నుంచి ఈ ల్యాప్‌టాప్‌లకు ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. అయితే ప్రస్తుతానికి ధరలు, అందుబాటులోకి రానున్న ఖచ్చితమైన మోడల్స్, డెలివరీ తేదీలను కంపెనీ వెల్లడించలేదు.
ఏ కంపెనీల నుంచి Googlebooks?
గూగుల్ కొత్త కేటగిరీ కింద విడుదల చేయనున్న Googlebook ల్యాప్‌టాప్‌లను పలు ప్రముఖ కంపెనీలు తయారు చేయనున్నాయి. Acer, Asus, Dell, HP, Lenovo సంస్థలు తొలి Googlebook డివైజ్‌లను సిద్ధం చేస్తున్నాయి. అయితే సెప్టెంబర్ 21న ప్రీ-ఆర్డర్లు ప్రారంభమైనప్పుడు ఏయే మోడల్స్ అందుబాటులో ఉంటాయన్న విషయాన్ని గూగుల్ ఇంకా స్పష్టం చేయలేదు.
గూగుల్ ఈ కొత్త ల్యాప్‌టాప్ కేటగిరీని మే నెలలో జరిగిన Android Show: I/O Edition సందర్భంగా తొలిసారి పరిచయం చేసింది. ఇప్పటికే Lenovo, Asusకు సంబంధించిన కొన్ని వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ కాగా, Acer కూడా Googlebookపై పనిచేస్తున్నట్లు వెల్లడించింది.
ChromeOSకు బదులుగా Android టెక్నాలజీ
Googlebookలో ప్రస్తుతం Chromebookలలో ఉపయోగిస్తున్న ChromeOS ఉండదు. వీటిలో Android టెక్నాలజీ స్టాక్ ఆధారంగా రూపొందించిన కొత్త సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్ను ఉపయోగించనుంది. అయితే ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌కు తుది పేరును గూగుల్ ఇంకా ప్రకటించలేదు. దీనిని గతంలో Aluminium OS ప్రాజెక్టుతో అనుసంధానిస్తూ పలు నివేదికలు వెలువడ్డాయి. మరోవైపు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న Chromebooks మాత్రం ChromeOSతోనే కొనసాగుతాయి.
Geminiతో మరిన్ని AI ఫీచర్లు
Googlebookలలో గూగుల్ తన Gemini AI సామర్థ్యాలను కూడా కీలకంగా ఉపయోగించనుంది. ఇందులోని Magic Pointer ఫీచర్ ద్వారా స్క్రీన్‌పై ఉన్న ఏదైనా అంశాన్ని సెలెక్ట్ చేసి, దాని గురించి విశ్లేషించడం, పోల్చడం లేదా కొత్త కంటెంట్ రూపొందించడం వంటి పనులను Geminiతో చేయవచ్చు.
అలాగే Create My Widget అనే ఫీచర్ ద్వారా యూజర్ ఇచ్చే టెక్స్ట్ సూచన ఆధారంగా కస్టమ్ డెస్క్‌టాప్ విడ్జెట్‌ను రూపొందించుకోవచ్చు. ఉదాహరణకు ప్రయాణానికి సంబంధించిన ఫ్లైట్, హోటల్, రెస్టారెంట్ సమాచారాన్ని ఒకే చోట చూపించే ట్రావెల్ ట్రాకర్‌ను రూపొందించుకోవచ్చు.
Android ఫోన్‌తో సులభమైన కనెక్టివిటీ
Googlebook ప్రత్యేకతల్లో Android ఫోన్ ఇంటిగ్రేషన్ కూడా ఒకటి. Cast My Apps ద్వారా ఫోన్‌లోని యాప్స్‌ను Googlebookలో తెరవవచ్చు. అలాగే Quick Access ఫీచర్‌తో ఫోన్‌లోని ఫైళ్లను ల్యాప్‌టాప్ నుంచే యాక్సెస్ చేయొచ్చు. కీబోర్డ్ పైన ఉండే Glowbar కూడా కొత్త Googlebookలలో ప్రత్యేక డిజైన్ ఎలిమెంట్‌గా కనిపించనుంది. ఈ డిజైన్ గతంలో Chromebook Pixelలో కనిపించింది.
మొత్తంగా చూస్తే.. AI, Android ఇంటిగ్రేషన్, కొత్త సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్‌తో Googlebook ల్యాప్‌టాప్‌లను కొత్త కంప్యూటింగ్ అనుభవంగా తీసుకురావడానికి గూగుల్ సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 21న ప్రీ-ఆర్డర్లు ప్రారంభమైన తర్వాత ధరలు, మోడల్స్, షిప్పింగ్ వివరాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.