Google: కరోనా తరువాత ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. చాలా మంది ఉద్యోగులు తమ జాబ్ ఎప్పుడు ఉంటుందో? ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి ఉంది. కొన్ని కంపెనీలు సైతం ఆర్థిక భారం నుంచి గట్టెక్కేందుకు మ్యాన్ పవర్ ను తగ్గించుకుంటోంది. అయితే తాజాగా ప్రముఖ ఐటీ కంపెనీ గూగుల్ కు చెందిన కొన్ని కంపెనీలోని ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. వీరి తొలగింపునకు కారణం ఏంటంటే?
ఇటీవల టెక్ కంపెనీలు ఉద్యోగుల కోతను పెంచాయి. ఈ సందర్భంగా కొందరు ఉద్యోగులు దుష్ప్రవర్తన, కంపెనీకి వ్యతిరేకంగా పనిచేయడం వంటి కారణాల వల్ల వారిని దూరం పెట్టినట్లు ప్రకటించాయి. తాజాగా గూగుల్ కు చెందిన కొన్ని కంపెనీలు భారీగా ఉద్యోగులను వదులుకున్నాయి. ఇక్కడ మాత్రం ఉద్యోగులు ప్రవర్తన కాకుండా కంపెనీ పునర్వ్యవస్థీకరణ కోసం అని తెలిపింది. అయితే ఎంత మంది ఉద్యోగులను తీసేసినట్లు కూడా వెల్లడించలేదు.
గూగుల్ కు చెందిన పైథాన్, డార్ట్, ఫ్లటర్ కు చెందిన ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గూగుల్ ప్రతినిథి అలెక్స్ గార్సియా కుమ్మెర్ట్ టెక్ క్రంచ్ తో తన అభిప్రాయాన్ని మాత్రం పంచుకున్నారు. ప్రస్తుతం తొలగించబడిన ఉద్యోగులు ప్రోగ్రామింగ్ కు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. అయితే వీరిని పూర్తిగా తొలగించకుండా వారి సేవలను వినియోగించుకుంటామని చెప్పారు. వారికి కంపెనీలతో సత్సంబంధాలు ఉంటాయన్నారు.
ఈ ఏడాది జనవరిలో గూగుల్ సంస్థ వందల కొద్దీ ఉద్యోగాలను తీసేసింది. దశల వారిగా ఉద్యోగాల తొలగింపు కార్యక్రమం ఉంటుందని ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ అప్పుడే ప్రకటించారు. గూగుల్ మాత్రమే కాకుండా ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తీసేసే ప్రక్రియను ప్రారంభించాయి. వీటిలో ఎక్కువగా టెక్ కంపెనీలు ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా గూగుల్ పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఉద్యోగుల కోత ఉంటుందని తెలిపారు.