Gold Bonds: ఇక గోల్డ్ బాండ్లకు కేంద్రం గుడ్ బై ..? బంగారం ధరలు పెరగడమే కారణమా..?

గోల్డ్ బాండ్లకు కేంద్రం గుడ్ బై చెప్పాలనుకుంటున్నదా..? ఇక ఆర్బీఐ కూడా వీటి జారీని నిలిపేయబోతున్నదా.. అసలేం జరుగుతున్నది.. ఇదంతా తెలుసుకోవాలంటే ఈ కథనం లోపలికి వెళ్లండి.. అసలు విషయం మీకే తెలుస్తుంది.

Written By: Neelambaram, Updated On : August 24, 2024 4:18 pm

Gold Bonds

Follow us on

Gold Bonds: సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల (ఎస్‌జీబీ)కు కేంద్ర ప్రభుత్వం గుడ్‌బై చెప్పబోతున్నట్లు సమాచారం అందుతున్నది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా వీటి జారీని నిలిపివేయాలని భావిస్తున్నది. అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఎస్‌జీబీలు వ్యయభరితం, సంక్లిష్ట సాధనాలుగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇకపై వాటి అమ్మకాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయానికి కేంద్రం వచ్చినట్లు ఓ జాతీయ మీడియా చానల్ ఈ కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ బాండ్లకు ఇన్వెస్టర్లలో పెద్ద ఎత్తున డిమాండ్‌ పెరుగుతున్నది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు 10 శాతం అధికంగా చెల్లించి కొనేందుకు కూడా వారు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా భౌతిక బంగారంతో పోలిస్తే నిల్వ, చోరీ వంటి ఇబ్బందుల్లేకపోవడం దీనికి కారణంగా తెలుస్తున్నది. ఏటా స్థిరంగా 2.5 శాతం వడ్డీ తో పాట, పన్ను లేకపోవడం కూడా కారణంగా కనిపిస్తున్నది. ఇక ధరల విషయానికే వస్తే.. మార్కెట్‌లో బంగారం ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ప్రస్తుతం బంగారం ధర 2015తో పోల్చితే 180 శాతం పెరిగింది.. దీంతో ఈ గోల్డ్ బాండ్లలో పెట్టుబడులు పెట్టినవారికి విపరీతమైన లాభాలొస్తున్నాయి. మొదటిసారి బాండ్ల జారీ గ్రాము రూ.2,684 వద్ద ఉంది. కానీ కాలపరిమితి తీరినప్పుడు ఆ బాండ్ విలువ గ్రాముకు రూ.6,132 చెల్లిం చాల్సి వచ్చింది. ఇలా ప్రతీ విడుతలో ఈ చెల్లింపులకు ఖాజానాపై భారం పడుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇక బాండ్లు లాభం కాదని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.

ఇక గత తొమ్మిదేండ్లలో చూసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు 67 విడుతల్లో ఈ గోల్డ్ బాండ్లను జారీ చేసింది. దీంతో మదుపరులు సుమారు రూ.72,274 కోట్ల పెట్టుబడుల్ని పెట్టారు. ఇక తొలి 4 విడుతల్లో జారీ చేసిన బాండ్ల కాలపరిమితి ఇప్పటికే పూర్తిస్థాయిలో తీరిపోయింది. వాటికి సంబంధించిన చెల్లింపులు కూడా పూర్తయ్యాయి. పెట్టిన పెట్టుబడి కంటే రాబడులు పెద్ద ఎత్తున వచ్చాయి. 2015 నవంబర్‌లో కేంద్రం ఈ సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు అందుబాటులోకి తెచ్చింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ బాండ్లను జారీ చేస్తున్నది. ఇందులో బంగారంపై పెట్టుబడులు పేపర్ల రూపంలో ఉంటాయి. దేశంలో దిగుమతి అవుతున్న బంగారానికి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది, ఇక బాండ్లు జారీ చేసేటప్పుడు రిజర్వ్ బ్యాంక్ వాటి ధరను కూడా నిర్ణయిస్తుంది. గ్రాముల లెక్కన వీటిని కొనాల్సి ఉంటుంది, కాలపరిమితి 8 ఏండ్లుగా ఉంటుంది. ఇక ఐదేండ్లు గడిచిన తర్వాత ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు.

బులియన్ మార్కెట్లలో చివరి మూడు రోజుల్లో ఉన్న సూచీల ప్రకారం మదుపర్లు కు చెల్లింపులు చేస్తారు. ఇక ఇందులో దేశ పౌరులు, ట్రస్టులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌), స్వచ్ఛంద సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు.

ఇక దాదాపు అన్ని బ్యాంకుల్లో ఈ బాండ్లు అందుబాటులో ఉంటాయి. ఎస్‌హెచ్‌సీఐ, పోస్టాఫీస్‌లు, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలూ విక్రయిస్తున్నాయి. ఆక డీమ్యాట్‌ ఖాతాల ద్వారా క్రయవిక్రయాలు జరుగుతా యి. ఇక ప్రస్తుతం మార్కెట్ లో బంగారం ధరం గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్నది. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగినప్పటికీ దేశీయంగా మాత్రం ధరలు డౌన్ అవుతున్నాయి.

ఢిల్లీలో శుక్రవారం తులం బంగారం ధర రూ.74 వేలకు కొంత దిగింది. పదిగ్రాముల బంగారం ధర రూ.350 తగ్గి రూ.73, 800(99.9 శాతం స్వచ్ఛత) కి చేరినట్లు అసోసియేషన్‌ వెల్లడించింది. అంతకుముందు ఈ ధర రూ.74,150గా ఉన్నది. ఇక వెండి రూ.200 తగ్గి రూ.87 వేలకు చేరింది. యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్‌ పుంజుకోవడం, డాలర్‌ బలోపేతం కావడం ధరలు తగ్గడానికి కారణంగా తెలుస్తున్నది.