https://oktelugu.com/

Infosys: ఇన్ఫోసిస్ కు షాక్.. కోర్టు మెట్లెక్కిన కాగ్నిజెంట్.. ఎందుకో తెలుసా..?

ఇన్ఫోసిస్ పై కాగ్నిజెంట్ కోర్టు మెట్లెక్కింది. భారత్ కు చెందిన ఐటీ కంపెనీపై యూఎస్ కు చెందిన ఐటీ సంస్థ ఇలా కోర్టుకు వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

Written By:
  • Neelambaram
  • , Updated On : August 24, 2024 / 04:25 PM IST

    Infosys

    Follow us on

    infosys: భారత్ కు చెందిన ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ పై అమెరికాకు చెందిన ఐటీ దిగ్గజం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమ కంపెనీకి చెందిన హెల్త్ కేర్ ఇన్సురెన్స్ సాఫ్ట్ వేర్ కు సంబంధించిన వాణిజ్య రహస్యాలను దొంగలించినట్లు ఆరోపించింది. ఈ మేరకు యూఎస్ లోని టెక్సాస్ కోర్టులో ఇన్ఫోసిస్ కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది. కాగా, గతంలో ఉద్యోగులను అక్రమంగా చేర్చుకుంటున్నారని కాగ్నిజెంట్ కు ఇన్ఫోసిస్ లేఖ రాసింది. ఇది ఐటీ రంగంలో పెద్ద చర్చకు దారితీసింది. సరిగ్గా 8 నెలల తర్వాత కాగ్నిజెంట్ ఈ రకంగా ఇన్ఫోసిస్ పై న్యాయస్థానాన్ని ఆశ్రయించి, పెద్ద షాక్ ఇచ్చింది. రెండు ఐటీ దిగ్గజాల మధ్య పోటీనే ఇలా న్యాయస్థానంలో పిటిషన్ల వరకు వెళ్లిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే గతంలోనూ ఈ రెండు కంపెనీల మధ్య ఇలాంటి వివాదం ఒకటి నెలకొంది. ఉద్యోగులను అక్రమంగా చేర్చుకోవడాన్ని ఇన్ఫోసిస్ ప్రశ్నించింది. ఇది దృష్టిలో పెట్టుకొనే తాజాగా కాగ్నిజెంట్ ఇలా ఇన్ఫోసిస్ పై కోర్టును ఆశ్రయించినట్లు పలువురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. కోర్టులో కాగ్నిజెంట్ వేసిన పిటిషన్ ప్రకారం ఇన్ఫోసిస్ తమ డేటాను నిబంధనలు అతిక్రమించి, చట్టవిరుద్ధంగా సేకరించింది. పోటీ సాఫ్ట్ వేర్ ను రూపొందించే క్రమంలో ఇన్ఫోసిస్ ఇలాంటి చర్యకు దిగిందని కాగ్నిజెంట్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో కోర్టులో దావా వేసినట్లు కాగ్నిజెంట్ ప్రతినిధి తెలిపారు. అయితే దీనిపై ఇన్ఫోసిస్ ప్రతినిధి ఒకరు స్పందించారు. కాగ్నిజెంట్ ఆరోపణలను ఖండించారు. తాము కూడా కోర్టులో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఇన్ఫోసిస్ కంపెనీ పారదర్శకంగా ముందుకు సాగుతున్నదని, ఇలా ఒక కంపెనీ డేటాను తస్కరించాల్సిన అవసరం ఏ మాత్రం లేదని స్పష్టం చేశారు.

    యూఎస్ లోని న్యూజెర్సీ కేంద్రంగా కాగ్నిజెంట్ సేవలందిస్తున్నది. ట్రైజెట్టో ఫేసెస్, క్యూఎన్ఎక్స్ టీ సాఫ్ట్ వేర్ లను ఈ సంస్థ అందిస్తున్నది. హెల్త్ కేర్ ఇన్సురెన్స్ కంపెనీలు వీటిని వినియోగిస్తున్నాయి. అడ్మినిస్ర్టేటివ్ టాస్క్ లను ఆటోమేట్ చేయడానికి పలు కంపెనీలు ఈ సాఫ్ట్ వేర్ లను వాడుతున్నాయి. ట్రైజెట్టో సాఫ్ట్ వేర్ ను దొంగలించి ఇన్ఫోసిస్ టెస్ట్ కేసెస్ ఫర్ ఫేసెట్స్ ను తయారు చేసిందని కాగ్నిజెంట్ తన ఆరోపణల్లో పేర్కొంది.

    ఈ విషయంలో తమకు భారీ నష్టపరిహారం చెల్లించాలని కాగ్నిజెంట్ కోరింది. తమ వ్యాపార రహస్యాలను దొంగలించే పనిని ఇన్ఫోసిస్ ఆపేలా ఆదేశించాలని ఈ సందర్భంగా కాగ్నిజెంట్ అభ్యర్థించింది. తమ డేటాను ఇన్ఫోసిస్ దుర్వినయోగం చేసే అవకాశం ఉందని ఈ సందర్భంగా కాగ్నిజెంట్ న్యాయస్థానం ఎదుట అభిప్రాయపడింది.

    అయితే కాగ్నిజెంట్ ఆరోపణలను ఇన్ఫోసిస్ ఖండించింది. ఐటీ రంగంలో పోటీ నెలకొన్న నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు సర్వసాధారణమేనని కొట్టిపడేసింది. తాము దీనిపై స్పందించదలుచుకోలేదని, న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని స్పష్టం చేసింది. కాగ్నిజెంట్ కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నదని బెంగళూరుకు చెందిన ఇన్ఫోసిస్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

    ఒక సాఫ్ట్ వేర్ తయారీకి తాము కాగ్నిజెంట్ డేటాను తస్కరించినట్లు ఆరోపణలు చేయడం సరికాదని స్పష్టం చేశారు. ఏదేమైన రెండు ఐటీ దిగ్గజాల మధ్య ఈ ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. అందులోనూ యూఎస్ కు చెందిన ఐటీ కంపెనీ, భారత్ కు చెందిన ఐటీ దిగ్గజంపై న్యాయస్థానం మెట్లెక్కడం వివాదాస్పదంగా మారింది. అయితే దీనిపై ఇన్ఫోసిస్ ఎలా ముందుకు వెళ్తుందనేది వేచిచూడాలి.