GCPL-Raymond Deal: ఇప్పటి తరమే కాదు మునుపటి తరానికి కూడా కామసూత్ర అంటే ప్రత్యేకమైన అభిమానం. పొరబడకండి.. మేం చెబుతున్నది వాత్సాయనుడి కామసూత్ర గురించి కాదు.. రేమండ్ కంపెనీ కామసూత్ర గురించి.. చాలామందికి రేమండ్ అంటే వారు తయారు చేసే సూట్, ఇతరత్రా బట్టల గురించి మాత్రమే జ్ఞప్తిలోకి వస్తుంది. కానీ చాలామందికి తెలియనిది ఏంటంటే రేమండ్ కంపెనీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గ్రూప్ లో ఎప్పటినుంచో ఉంది. రేమండ్ సంస్థ కామసూత్ర బాడీ స్ప్రే, డియో, కండోమ్ లు, పార్క్ ఎవెన్యూ బాడీ స్ప్రే లు, షేవింగ్ క్రీమ్ లు, ప్రీమియం టాల్కం పౌడర్ తయారుచేస్తోంది. వీటికి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. యాక్స్ మార్కెట్లోకి వచ్చేంతవరకు పార్క్ ఎవెన్యూ, కామసూత్రకు తిరిగే లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
గోద్రెజ్ కంపెనీకి అమ్మింది
ఎఫ్ఎంసీజీలో హెయిర్ కలర్ లో తిరుగులేని రారాజుగా ఉన్న గోద్రెజ్ కంపెనీ మిగతా విభాగాల్లోకి ఎంటర్ కావాలని ఎప్పటినుంచో ఆశిస్తోంది. దానికి తగ్గట్టు వ్యాపార భాగస్వామి లేక ఇన్నాళ్లు సైలెంట్ గా ఉండిపోయింది. అయితే రేమండ్ తన వ్యాపార విస్తరణలో భాగంగా తన ఎఫ్ఎంపిజి ఉత్పత్తులను ఇతర కంపెనీకి విక్రయించాలనే ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో గోద్రెజ్ కంపెనీకి తన ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల మొత్తం విక్రయించింది. దీని డీల్ విలువ 2,825 కోట్లు అని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
వ్యాపార విస్తరణకు
రేమండ్ కంపెనీ తన వ్యాపార విస్తరణలో భాగంగా ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల తయారీ ప్రక్రియను పూర్తిగా నిలిపివేయాలని అనుకుంటుంది. వీటిని విక్రయించగా వచ్చిన సొమ్ముతో వస్త్ర వ్యాపారాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే రిటైల్ అవుట్లెట్లు ఎక్కువ ప్రారంభించాలని అనుకుంటుంది. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది ప్రాంతంలో రేమండ్ వ్యాపారం తక్కువగా సాగుతోంది. ఈ ప్రాంతంపై ఫోకస్ చేసేందుకు నిధుల లభ్యత అవసరం ఉండడంతో.. తన ఎఫ్ఎంసీజీ కేటగిరిని వదులుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పూర్తిస్థాయిలో చర్చలు జరిగిన నేపథ్యంలో మే 10 న ఈ బదలాయింపు ప్రక్రియ పూర్తవుతుందని ఇరు కంపెనీల వర్గాలు చెబుతున్నాయి.
నెంబర్ వన్ గా ఎదిగేందుకు..
మరోవైపు గోద్రెజ్ కంపెనీ కూడా ఎఫ్ఎంసీజీ విభాగంలో నెంబర్ వన్ గా ఎదగాలని యోచిస్తోంది.. ఇందులో భాగంగానే భారీగా పెట్టుబడులు పెడుతోంది… హెయిర్ డై విభాగంలో తిరుగులేని రారాజుగా ఉన్న గోద్రెజ్.. మిగతా విభాగాల్లోనూ అదే పట్టు సాధించాలని అనుకుంటుంది. ఇందులో భాగంగానే రేమండ్ కంపెనీకి చెందిన ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను కొనుగోలు చేసింది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం దేశంలో ఎఫ్ఎంసీజీ విభాగం ఏటా 7 లక్షల కోట్ల వ్యాపారాన్ని నమోదు చేస్తోంది. అయితే ఇందులో మెజారిటీ వాటా ఇప్పటికీ జాన్సన్ అండ్ జాన్సన్ , హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీలకు ఉన్నాయి.. అయితే వీటి స్థానాన్ని కైవసం చేసుకునేందుకు మిగతా కంపెనీలు పోటీ పడుతున్నాయి.