Homeజాతీయ వార్తలుFive State Elections : ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఈసీ బ్రహ్మాస్త్రం షాకింగ్ నిర్ణయం

Five State Elections : ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఈసీ బ్రహ్మాస్త్రం షాకింగ్ నిర్ణయం

Five State Elections  : తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగవంతం చేసింది. షెడ్యూల్‌ వెలువరించకముందే.. ఆయా రాష్ట్రాలలో ఎన్నికల సంసిద్ధతపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది. తెలంగాణలోనూ త్వరలోనే పోల్‌ ప్రిపరేషన్‌పై రివ్యూ మీటింగ్‌ పెట్టనుంది. ఈ సందర్భంగా కీలక అంశాలపై కేంద్రం ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. సమర్ధ ఎన్నికల నిర్వహణకు పది సూత్రాలను అమలు చేయనుంది. ఈసీ టెన్‌–కమాండ్‌మెంట్స్‌తో ఉల్లంఘనలకు చెక్‌పెట్టి పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు వీలుకలగనుంది.

ఓటర్ల తొలగింపు అంశం
ఓటర్ల తొలగింపుపై ఎన్నికల సంఘం ఫోకస్‌పెట్టింది. కేవలం ఫాం–7 రిసీవ్‌ అయిన తర్వాతే ఓటు తొలగింపు ఉండాలని స్పష్టం చేసింది. బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌ తనిఖీ లేకుండా సుమొటాగా ఓటు తొలగించవద్దని పేర్కొంది. ఓటరు చనిపోతే, డెత్‌ సర్టిఫికెట్‌ అందిన తర్వాతే ఆ ఓటును డిలీట్‌ చేయాలని మార్గదర్శకాలు ఇచ్చింది. అలాగే మొత్తం తొలగించిన ఓట్లలో పదిశాతం ఓట్లను ర్యాండమ్‌గా సిస్టం ద్వారా ఎంపిక చేసి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. రాష్ట్రంలోని మొత్తం ఓట్లలో తొలగించిన ఓట్లు రెండు శాతానికి మించితే వాటిని ఈఆర్‌ఓ వ్యక్తిగతంగా తనిఖీ చేయాలి. ఓటరు చనిపోయిన సందర్భాల్లో మినహా ఇతర కారణాలుంటే వాటిని తప్పనిసరిగా తనిఖీ చేసిన తర్వాతే ఓటు తొలగింపు ఆదేశాలు ఇవ్వాలి.

ఎన్నికల ఖర్చుపై 20 శాఖల నిఘా
పెరిగిపోతున్న ఎన్నికల ఖర్చుపై ఎన్నడూ లేనంతగా ఈసారి కేంద్రం ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. దాదాపు 20 ప్రభుత్వ శాఖలతో స్పెషల్‌ కోఆర్డినేషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కో–ఆర్డినేషన్‌లో ఈడీ, ఐటీ, రెవెన్యూ ఇంటలిజెన్స్, జీఎస్టీ, పోలీస్, కస్టమ్స్, ఎక్సైజ్, సీఐఎస్‌ఎఫ్, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, సివిల్‌ ఏవియేషన్, పోస్టల్, ఆర్‌బీఐ, ఎస్‌ఎల్‌బీసీ, ఎన్‌సీబీ, రైల్వే, ఫారెస్ట్, ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్స్‌ పనిచేయనున్నాయి. ఈ శాఖలన్నీ ఎవరికి వారు ఒంటరిగా పనిచేయకుండా, సమన్వయంతో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల, పార్టీల ఖర్చుపై నిఘా పెడతారు. సరిహద్దుల గుండా వెళ్లే మద్యం, నగదు, ఉచితాలు, డ్రగ్స్‌ తదితర అంశాలపై మరింత ఫోకస్‌ ఉంటుంది. వీటితో పాటు రాష్ట్రంలోని ఎయిర్‌స్ట్రిప్‌లు, హెలిప్యాడ్‌లపై కన్నేసి ఉంచుతారు. లిక్కర్‌ కింగ్‌పిన్స్, లిక్కర్‌ డిస్ట్రిబ్యూటర్లపై తీవ్రమైన చర్యలు ఉండనున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు లోనుచేయకుండా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటారు.

సీ విజిల్‌తో 50 నిమిషాల్లోనే యాక్షన్‌..
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై నేరుగా ఫిర్యాదు చేయడానికి ఎన్నికల సంఘం సీ–విజిల్‌ యాప్‌ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దింది. ఎవరైనా పౌరుడు ఎన్నికల కోడ్‌ఉల్లంఘనపై సీ–విజిల్‌ యాప్‌లో ఫోటో, వీడియో, ఇతర సమాచారం అప్‌లోడ్‌ చేయాలి. ఆ వెంటనే ఆ సమాచారం డిస్ట్రిక్‌ కంట్రోలర్‌కు చేరుతుంది. చేరిన అయిదు నిమిషాల్లోనే ఆ ఫిర్యాదు పరిష్కారం కోసం ఫ్లయింగ్‌ స్కాడ్‌కు అప్పగిస్తారు. 15 నిమిషాల వ్యవధిలో ఎలక్షన్‌ కోడ్‌ ఉల్లంఘన జరిగిన ప్రాంతానికి చేరుకుని విచారణ చేస్తారు. మరొక 30 నిమిషాల్లోనే ఫిర్యాదుదారుకు తాము తీసుకున్న చర్యల సమాచారాన్ని పంపిస్తారు. అంటే ఫిర్యాదు చేసిన 50 నుంచి 100 నిమిషాల్లోనే వాటిపై యాక్షన్‌ తీసుకునేలా సి–విజిల్‌ తయారు చేశారు.

ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌
ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌ ద్వారా ఓటరు సేవలన్నీ ఆన్‌లైన్‌ ద్వారా పొందే అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌లో ఓటు కోసం దరఖాస్తు చేయవచ్చు. ఓటరు లిస్ట్‌లో పేరు తనిఖీ చేసుకోవచ్చు. పోలింగ్‌ బూత్‌ వివరాలు, బీఎల్‌ఓ, ఈఆర్‌ఓ డిటెయిల్స్, ఎన్నికల ఫలితాలు, ఈవీఎంల సమాచారం, ఓటరు కార్డు డౌన్‌లోడింగ్‌ తదితర సేవలన్నీ ఈ ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌ ద్వారా పొందే అవకాశం కల్పించారు.

నామినేషన్లు, అఫిడవిట్ల దాఖలుకు ‘సువిధ’
అభ్యర్థులు సువిధ పోర్టల్‌ ద్వారా నామినేషన్లు, అఫిడవిట్లు దాఖలు చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే మీటింగ్‌లు, ర్యాలీలు నిర్వహించుకునేందుకు అనుమతుల కోసం ఈ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలుంది.

దివ్యాంగులు, వలస ఓటర్ల కోసం.. సక్షం యాప్‌..
వికలాంగులు, వలస ఓటర్ల కోసం ఈసీ సక్షం యాప్‌ను తయారుచేసింది. ఓటరు జాబితాలో కరెక్షన్ల కోసం ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. అలాగే ఓటింగ్‌ సమయంలో వీల్‌చైర్‌ అవసరమైతే రిక్వెస్ట్‌ ను ఈ యాప్‌ ద్వారా పంపాలి.

కేవైసీ యాప్‌..
పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు తెలుసుకోవడానికి కేవైసీ యాప్‌ ను రూపొందించారు. ఇందులో అభ్యర్థుల నేర చరిత్ర సహా ఇతర వివరాలను ఉంచుతారు. అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా తమ అభ్యర్థులకు సంబంధించిన అన్ని వివరాలు వెబ్‌సైట్‌లో, సోషల్‌ మీడియాలో పెట్టాలి.

యూత్‌ ఓటింగ్‌ పెరిగేలా..
యువత ఓటింగ్‌ పెరిగేలా చర్యలు తీసుకోవాలి. పోలింగ్‌ కేంద్రాలలో కనీస సౌకర్యాలు కల్పించాలి. వికలాంగులకు ఓటింగ్‌కు అవసరమైన ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. చివరి మైలులో ఉన్న గ్రామాలలో సైతం సజావుగా పోలింగ్‌ ప్రక్రియ జరిగేలా చర్యలుండాలి.

సరిహద్దులో చెక్‌పాయింట్లు
ఎన్నికల సమయంలో అక్రమంగా డబ్బు, మద్యం సరఫరాను అడ్డుకునేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. పొలీస్, ఎకైజ్, ట్రాన్స్‌పోర్ట్, స్టేట్‌ ఫారెస్ట్‌ డిపార్టు మెంట్ల ఆధ్వర్యంలో ఈ చెక్‌ పోస్టులలో నిఘా ఉంటుంది.

ఉన్నతాధికారులకు ప్రత్యేక ఆదేశాలు
ఓటరు జాబితాలో పెద్ద సంఖ్యలో నమోదు, తొలగింపులను జిల్లా ఎన్నికల అధికారులు తప్పనిసరిగా చెక్‌చేయాలి. రాజకీయ పార్టీల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలి. పోలింగ్‌ పనులకు కాంట్రాక్ట్‌ ఉద్యోగులను నియమించొద్దు. పార్టీ క్యాంపెయిన్‌ మెటీరియల్‌ వాహనాల సంఖ్య ఒకటి నుంచి నాలుగుకు పెంపు. ఫేక్‌ న్యూస్‌ నియంత్రణకు ప్రత్యేక సోషల్‌ మీడియా సెల్‌ ఏర్పాటు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version