French fries industry India: భారత దేశం.. వ్యవసాయ ఆధారిత దేశం. మన ఆర్థిక ఎదుగుదలలో వ్యవసాయమే మొదటి నుంచీ కీలక పాత్ర పోసిస్తోంది. ప్రస్తుతం పారిశ్రామికంగా ఎదగడంతో వ్యవసాయరంగ ఆదాయం కాస్త తగ్గింది. అయినా ఇప్పటికీ మంచి ఆదాయమే వస్తోంది. ఇప్పటికీ 50 శాతానికిపైగా జనాభా వ్యవసాయం ఆధారంగానే జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అందరూ ఇష్టపడి తినే బంగాళా దుంపల ఉత్పత్తి విప్లవాత్మకంగా మారి మన ఆర్థిక రంగానికి మంచి బూస్ట్ ఇస్తున్నాయి. ముఖ్యంగా గుజరాత్‌లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉత్పత్తికి కేంద్రంగా అభివృద్ధి చెందింది. జితేష్ పటేల్ వంటి రైతులు, సంప్రదాయ పంటలైన పత్తి నుంచి బంగాళ దుంపల సాగుకు మారడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించారు. 2007లో ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీ సంస్థల రాకతో గుజరాత్ రైతుల జీవనంలో గణనీయమైన మార్పు సంభవించింది. ఈ పరివర్తన భారత్‌ను ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగాళ దుంపల ఉత్పత్తి దేశంగా నిలిపింది.
Also Read: ఏడాదికి ₹21,900 కోట్ల సమోసాలు.. బంగ్లా డిఫెన్స్ బడ్జెట్ లో సగం! ఇంతటి తిండిబోతులు ఎవరంటే?
విదేశాలకు ఎగుమతి..
భారత్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎగుమతిలో గణనీయమైన వృద్ధిని సాధించింది, 2024 ఫిబ్రవరిలో 1,81,773 టన్నులతో 45% పెరుగుదల నమోదు చేసింది. ఫిలిప్పీన్స్, థాయిలాండ్, ఇండోనేషియా వంటి ఆసియా దేశాలు భారత ఫ్రోజెన్ ఫ్రైస్‌కు ప్రధాన మార్కెట్‌గా మారాయి. సరసమైన ధరలు, నాణ్యమైన ఉత్పత్తి, మరియు ఉత్పాదకత పెంపు వంటి అంశాలు భారత్‌ను ప్రపంచ మార్కెట్‌లో బలమైన ఎగుమతిదారుగా నిలిపాయి. మెక్‌కెయిన్ ఫుడ్స్, హైఫన్ ఫుడ్స్ వంటి కంపెనీలు గుజరాత్‌లో ఏర్పాటైన పెద్ద ఎత్తున ఫ్రెంచ్ ఫ్రైస్ ఉత్పత్తి కేంద్రాలు ఈ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
సాంకేతిక ఆవిష్కరణలు
గుజరాత్‌లో బంగాళ దుంపల సాగులో సాంకేతికత, ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. డ్రిప్ ఇరిగేషన్, ఆవు పేడ ఎరువు, భూమి సారవంతం కోసం వేసవిలో పొలాన్ని ఖాళీగా ఉంచడం వంటి విధానాలను అనుసరిస్తున్నారు. జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ వంటి సంస్థలు టిష్యూ కల్చర్ ద్వారా వైరస్ రహిత బంగాళ దుంపల విత్తనాలను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ సాంకేతిక పురోగతి ఉత్పత్తి నాణ్యతను, దిగుబడిని పెంచడంలో సహాయపడింది.
నిల్వ చేయడమే సమస్య..
ఫ్రోజెన్ ఫుడ్ ఇండస్ట్రీ అభివృద్ధి సాధించినప్పటికీ, శీతలీకరణ గిడ్డంగుల కొరత, రిఫ్రిజిరేటర్ ట్రక్కుల లభ్యత లేకపోవడం, విద్యుత్ కోతలు వంటి సవాళ్లు ఉన్నాయి. భారత్‌లో కేవలం 10–15% శీతలీకరణ గిడ్డంగులు ఫ్రోజెన్ ఫుడ్ నిల్వకు అనువైనవని, గ్రామీణ ప్రాంతాల్లో ఈ సౌకర్యాలు లేవని నిపుణులు గుర్తించారు. రవాణా సౌకర్యాలు, విద్యుత్ సరఫరా స్థిరత్వం లేకపోవడంతో ఆహార ఉత్పత్తులు పాడవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. చైనా, బ్రెజిల్ వంటి దేశాలతో పోటీ పడాలంటే ఈ మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది.
Also Read: యూరియా వేస్తేనే డీజిల్ కార్లు పని చేస్తాయా ? అసలు దాని పని ఏంటి ?
రైతులకు ఆర్థిక భద్రత..
గుజరాత్‌లో కాంట్రాక్ట్ ఫామింగ్ వంటి వ్యవస్థలు రైతులకు ఆర్థిక భద్రతను అందిస్తున్నాయి. రైతులు ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీ సంస్థలతో ఒప్పందాల ద్వారా స్థిరమైన ఆదాయాన్ని పొందుతున్నారు. పట్టణీకరణ, పెరుగుతున్న ఆదాయాలు, జీవన శైలి మార్పులు ఫ్రోజెన్ ఫుడ్ డిమాండ్‌ను పెంచాయి, దీని ఫలితంగా రైతులు, ఆహార పరిశ్రమ రెండూ లాభపడుతున్నాయి.