ఈ మధ్య కాలంలో సైబర్ మోసగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. తక్కువ ధరకే ఫోన్ అంటూ కాల్స్, మెసేజ్ లు వస్తే జాగ్రత్తగా ఉండాలి. తరచూ ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తే మంచిది. ప్రతిరోజూ ఇలాంటి మోసాల బారిన పడి పదుల సంఖ్యలో ప్రజలు డబ్బును పోగొట్టుకుంటున్నారు. మోసగాళ్లు కంపెనీల పేర్లతో కాల్ చేసి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు.
కాల్ చేసిన తర్వాత ఆఫర్ ఉందని తక్కువ ధరకే ఫోన్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని చెబుతారు. ఫోన్ స్టాక్ ఎక్కువమొత్తంలో ఉండటంతో ఆఫర్ ప్రకటించామని చెప్పి క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా ఫోన్ తీసుకోవాలని చెబుతారు. ఇండియా పోస్ట్ ద్వారా ఆ పార్శిల్ ను పంపిస్తారు. పార్శిల్ తీసుకున్నారంటే కచ్చితంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. పార్శిల్ ఓపెన్ చేసిన తర్వాత ఫోన్ కు బదులుగా మరో వస్తువు ఉంటే మోసపోయామని అర్థమవుతుంది.
ఇలాంటి ఆఫర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓకే చెప్పకూడదు. రోజురోజుకు ఇలాంటి మోసాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండటం ద్వారా మోసాల బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది.