Homeబిజినెస్Twitter Bird Logo Auction: ట్విటర్‌ పిట్ట ఫర్‌ సేల్‌.. అమ్మకానికి పెట్టిన ఎలాన్‌మస్క్‌

Twitter Bird Logo Auction: ట్విటర్‌ పిట్ట ఫర్‌ సేల్‌.. అమ్మకానికి పెట్టిన ఎలాన్‌మస్క్‌

Twitter Bird Logo Auction: ప్రముఖ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫాం ఎక్స్‌(ట్విటర్‌)ను ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుపుతున్నాడు దాని అధినేత ఎలాన్‌మస్క్‌. బాగా ప్రాచుర్యం పొందిన ట్విటర్‌ లోగోతోపాటు పేరునూ ఇటీవల మార్చేసిన సంగతి తెలిసిందే. లోగోలో ఉన్న పిట్ట స్థానంలోకి ఇంగ్లిస్‌ అక్షరం ‘ఎక్స్‌’ వచ్చేసింది. తాజాగా ట్విటర్‌లోని పాత విలువైన జ్ఞాపకాలను వేలం వేయాలని మస్క్‌ నిర్ణయించారు. వీటిలో ట్విటర్‌ ప్రధాన కార్యాలయంపై పిట్ట బొమ్మతో ఉన్న సైన్‌ బోర్డ్‌ కూడా ఉండనుంది. ట్విటర్‌ను ఎక్స్‌ పేరిట రీబ్రాండ్‌ చేసిన కొన్ని రోజుల్లోనే మస్క్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

584 లాట్ల వేలం..
ట్విటర్‌ పాత జ్ఞాపకాలకు సంబంధించిన మొత్తం 584 లాట్లను వేలానికి తీసుకురాలని మస్క్‌ నిర్ణయించారు. ఇందులో ట్విటర్‌ బర్డ్, కాఫీ టేబుల్, భారీ పంజరం, స్టూళ్లు, టేబుళ్లు, కుర్చీలు, సోఫాలు, రిఫ్రిజిరేటర్ల వంటి ఉపకరణాలు, సంగీత పరికరాలు, నియాన్‌ ట్విటర్‌ లోగో, హ్యాష్‌ట్యాగ్‌ గుర్తు వంటివి ఉన్నాయి. కాగా ఈ వేలానికి ‘ట్విటర్‌ రీబ్రాండింగ్‌ : ఆన్‌లైన్‌ ఆక్షన్‌ ఫీచరింగ్‌ మెమోరాబిలియా, ఆర్ట్, ఆఫీస్‌ అసెట్స్‌ అండ్‌ మోర్‌’ అని పేరుపెట్టారు.
పెయింటింగ్స్, కళాకృతులు కూడా..
ఉపకరణాలు, వస్తువులతోపాటు ప్రముఖుల నుంచి వైరల్‌ అయిన వారి ఆయిల్‌ పెయింటింగ్‌లు కూడా అమ్మకానికి ఉన్నాయి. ఈ కళాకృతులలో చిరస్మరణీయమైన 2014 ఆస్కార్స్‌ ఎల్లెన్‌ డిజెనెరెస్‌ సెల్, సెలబ్రిటీ ట్రిబ్యూట్‌ ట్వీట్‌ల ఆకర్షణీయమైన ఫొటో మొజాయిక్‌ ఉన్నాయి. 2012 నవంబర్‌లో తిరిగి ఎన్నికైన తర్వాత అప్పటి అమెరికన్‌ ప్రెసిడెంట్‌ బరాక్‌ ఒబామా చేసిన ట్వీట్‌కు సంబంధించిన చిత్రం కూడా ఇందులో ఉంది. ఈ ప్రత్యేక ట్వీట్‌ అప్పట్లో అత్యధిక లైక్‌లు పొందిన ట్వీట్‌గా గుర్తింపు పొందింది.

ప్రారంభ ధర 25 డాలర్లు..
వేలం నిర్వహించే హెరిటేజ్‌ గ్లోబల్‌ పార్ట్‌నర్స్‌ ప్రకారం, ప్రతీ లాట్‌కు ప్రారంభ బిడ్‌ ధర 25 డాలర్లుగా నిర్ణయించారు. కొనుగోలుదారుల ప్రీమియం 19 శాతం, అమ్మకపు పన్ను 8.63 శాతం ఉంటుంది. ఈ వేలానికి సంబంధించిన బిడ్డింగ్‌ సెప్టెంబర్‌ 12న ప్రారంభమై 14వ తేదీ వరకు కొనసాగుతుంది. అయితే ట్విటర్‌ బర్డ్‌ లోగో శాన్‌ఫ్రాన్సిస్కోలోని స్ట్రీట్‌–10లో ఉన్న ట్విటర్‌ ప్రధాన కార్యాలయ భవనానికి ఇంకా అలాగే ఉంది. దీనిని గతంలో తొలగించాలని ప్రయత్నించినా.. శాన్‌ఫ్రాన్సిస్కో అధికారులు అడ్డుకున్నారు. దీంతో ట్విటర్‌ హెడ్‌క్వార్టర్స్‌పై ఉన్న పిట్ట బొమ్మను వేలంలో కొనుగోలు చేసిన వ్యక్తే అధికారుల అనుమతి పొంది తరలించుకోవాలని వేలం వివరాల్లో పేర్కొన్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version