Electric Cars: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా తన తొలి ఎలక్ట్రిక్ కారు గ్రాండ్ ఈవిటారాతో ఈ నెలలోనే ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే టాటా, మహీంద్రా, ఎంజీ మోటార్, హ్యుందాయ్ వంటి దిగ్గజాలు ఈ విభాగంలో తమ సత్తా చాటుతున్నాయి. అయితే, ఏ కంపెనీ వద్ద అత్యధిక రకాల ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయో..అవి మిగతా కంపెనీలకు ఎలాంటి పోటీని ఇస్తున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
Also Read: కొత్త కారు కొనాలా మామా.. రెనాల్డ్ భారీ ఆఫర్.. ఇప్పుడే కొనేయ్
మారుతి ఎలక్ట్రిక్ అరంగేట్రం
మారుతి సుజుకి ఇండియా ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో తన తొలి ఎలక్ట్రిక్ కారు గ్రాండ్ ఈవిటారాను ప్రదర్శించింది. దీని ధర ఈ నెలలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. దీని కోసం మారుతి ప్రత్యేకంగా ‘హార్ట్రాక్ట్’ అనే కొత్త ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసింది. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని అంచనా.
టాటాదే హవా
ప్రస్తుతానికి ఎలక్ట్రిక్ కార్ల విషయంలో టాటా మోటార్స్ ఆధిపత్యం కొనసాగుతోంది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఏకంగా 5 ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. వీటితో పాటు టాటా అవిన్యా రాక కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాటా ప్రస్తుతం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో టియాగో ఈవీని విక్రయిస్తోంది. ఇది 293 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది. ఇక మైక్రో ఎస్‌యూవీ విభాగంలో కంపెనీ వద్ద పంచ్ ఈవీ ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 365 కిలోమీటర్ల రేంజ్‌తో పాటు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా కలిగి ఉంది.
టాటా పోర్ట్‌ఫోలియోలో టిగోర్ ఈవీ అనే సెడాన్ ఎలక్ట్రిక్ కారు కూడా ఉంది. ఇది 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో 315 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ శ్రేణిలో టాటాకు నెక్సాన్ ఈవీ ఉంది. 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన ఈ కారు 489 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది. టాటా కర్వ్ ఈవీ అనే కూపే స్టైల్ ఎస్‌యూవీ కూడా రానుంది. ఇది 502 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
మహీంద్రా మార్కెట్‌లో దూకుడు
ఎలక్ట్రిక్ కార్ల శ్రేణి విషయంలో మహీంద్రా కూడా తక్కువదేం కాదు. మహీంద్రాకు ప్రస్తుతం XUV 400 ఎలక్ట్రిక్ కారు మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఇది 456 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను ఇస్తుంది. అంతేకాకుండా, కంపెనీ ఇటీవల తన బోర్న్ ఎలక్ట్రిక్ కార్లైన BE 6, XEV 9e లను విడుదల చేసింది. వీటిపై మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. BE 6 ఏకంగా 683 కిలోమీటర్ల రేంజ్‌ను, XEV 9e 655 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తాయి. ఈ మూడు కార్లు కూడా ఎస్‌యూవీ విభాగంలోకే వస్తాయి.
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ఎంట్రీ
హ్యుందాయ్ కూడా ఇటీవల తన ఎలక్ట్రిక్ క్రెటా కారును మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 473 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీంతో పాటు హ్యుందాయ్ అయోనిక్ 5 కూడా కంపెనీ మరొక ఎలక్ట్రిక్ కారు. ఇది 630 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది. ఈ రెండు ఈవీలు కూడా ఎస్‌యూవీలే.
ఎంజీ విండ్‌సర్ హవా
ప్రస్తుతం ఈవీ మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కారు ఎంజీ మోటార్ ‘విండ్‌సర్ ఈవీ’. ఈ ఎస్‌యూవీ కారుతో కంపెనీ ‘బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్’ను కూడా అందిస్తోంది. ఇది 332 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. దేశంలోనే అత్యంత చిన్న ఈవీ ‘కామెట్’ను కూడా ఎంజీ మోటార్ తయారు చేస్తోంది. ఇది 230 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఎస్‌యూవీ విభాగంలో ఎంజీ ZS ఈవీని కూడా విక్రయిస్తోంది. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 461 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది.
మొత్తానికి చూస్తే ప్రస్తుతం టాటా మోటార్స్ అత్యధిక రకాల ఎలక్ట్రిక్ కార్లను కలిగి ఉంది. అయితే, మారుతి సుజుకి రాకతో ఈ రేసు మరింత ఆసక్తికరంగా మారనుంది. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.