
కరోనా కష్ట కాలంలో వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. రోజురోజుకు విత్తనాల ఖర్చులు, పురుగు మందుల ఖర్చులు, ఎరువుల ఖర్చులు పెరుగుతుండటంతో రైతులకు పెట్టుబడి కూడా రావడం లేదు. ఇలాంటి సమయంలో ఎరువుల ధరలు భారీగా పెరుగుతున్నట్టు జోరుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఎరువుల ధరలు మరింత పెరిగితే రైతులు వ్యవసాయానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.
రైతులు పడుతున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం యూరియా మినహా ఇతర ఎరువుల ధరలను పెంచొద్దని కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఎరువుల రేట్లు పెంచనున్నట్టు వైరల్ అయిన వార్తల వల్ల రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొనడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించి స్పష్టతనిచ్చింది. అంతర్జాతీయ పోకడలకు అనుగుణంగా ఎరువుల ధరల్లో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉండటంతో కేంద్రం రైతులకు రాయితీ కల్పిస్తూ కంపెనీలకు ఆ డబ్బులు చెల్లిస్తోంది.
రైతులు పాత ధరలకే డీఏపీ, ఎంఓపీ, ఎన్‌పీకేలను పొందే అవకాశం ఉండగా యూరియా ధరలు మాత్రం పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సోషల్ మీడియా ద్వారా రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని తెలిపారు. గతంలోనే కంపెనీలు ఎరువుల ధరలను పెంచాలని భావించాయి.
స్థానిక వ్యాపారులకు సైతం ఎరువుల ధరలు భారీగా పెరుగుతున్నట్టు సమాచారం అందింది. ధరలు పెరిగితే ఇబ్బందులు పడక తప్పదని అన్నదాతలు భావించిన తరుణంలో తాజా ఆదేశాలతో రైతులకు ఊరట లభించట్లైంది.