ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. మన దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నా సాధారణ పరిస్థితులు ఏర్పడాలంటే చాలా సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల ఆర్థిక భారం అంతకంతకూ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఉద్యోగులకు డీఏ పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఉద్యోగులకు మరోసారి డీఏ పెంచే దిశగా మోదీ సర్కార్ అడుగులు వేస్తోందని సమాచారం. గత సంవత్సరం కరోనా పరిస్థితుల వల్ల కేంద్రం ఉద్యోగుల డీఏ అలవెన్స్ పెంపును నిలిపివేయడం జరిగింది. గత నెలలో కేంద్రం ఉద్యోగుల డీఏ, డీఆర్ లను 17 శాతం నుంచి ఏకంగా 28 శాతానికి పెంచింది. అయితే ఈ ఏడాది జనవరి – జూన్ 2021కు సంబంధించిన డీఏ పెంపు గురించి ప్రకటన వెలువడలేదు.
కేంద్ర ప్రభుత్వం మళ్లీ డీఏను పెంచాలని భావిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 31 శాతానికి పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు వేర్వేరు రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల డీఏలను పెంచగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్ఆర్‌ఏ ప్రయోజనాలను కూడా పెంచడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పనుందని జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
కరోనా కష్ట కాలంలో సైతం ఉద్యోగుల సంక్షేమం దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తుండటం గమనార్హం. గతేడాది లాక్ డౌన్ సమయంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల వేతనాల్లో కోత విధించి తర్వాత రోజుల్లో నగదు జమ చేసిన సంగతి తెలిసిందే.