BMW :జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) భారతదేశంలో తమ రెండు చౌకైన మోటార్‌సైకిళ్లను నిలిపివేసింది. కంపెనీ తన BMW G310R రోడ్‌స్టర్, G310GS అడ్వెంచర్ టూరర్‌లను తమ పోర్ట్‌ఫోలియో నుండి తొలగించింది. ఈ రెండు మోటార్‌సైకిళ్లు గత 8 సంవత్సరాలుగా భారతీయ మార్కెట్‌లో విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు మోడళ్ల ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధరల గురించి వివరంగా తెలుసుకుందాం.
ఈ మోటార్‌సైకిళ్ల ఉత్పత్తిని జనవరి 2025లోనే నిలిపివేశారు. ఇక ఏప్రిల్ 1, 2025 తర్వాత వీటి అమ్మకాలు పూర్తిగా బంద్ అయ్యాయి. మీడియా కథనాల ప్రకారం.. ఈ 8 సంవత్సరాలలో భారతీయ మార్కెట్‌లో 310సీసీ సెగ్మెంట్లో తక్కువ అమ్మకాలు ఉండటమే దీనికి ప్రధాన కారణం. అంతేకాకుండా, ఈ బైక్‌ల ధరలు పెరగడం కూడా అమ్మకాలు తగ్గడానికి మరో ముఖ్య కారణంగా చెబుతున్నారు.
బీఎండబ్ల్యూ G310R మోటార్‌సైకిల్‌లో 312సీసీ లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 34bhp శక్తిని, 28Nm టార్క్‌ను ఉత్పత్తి చేసేది. భారతీయ మార్కెట్‌లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.90 లక్షలుగా ఉండేది. మరోవైపు, G310GS ఒక అడ్వెంచర్ టూరర్ బైక్. దీని ఎక్స్-షోరూమ్ ధర భారతీయ మార్కెట్‌లో రూ. 3.30 లక్షలుగా ఉంది. ఈ రెండు మోడళ్లు కూడా టీవీఎస్ మోటార్‌తో కలిసి బీఎండబ్ల్యూ ఉమ్మడి భాగస్వామ్యంలో డెవలప్ అయ్యాయి.
భారతీయ మార్కెట్లో ఈ రెండు మోడళ్లకు సరైన ఆదరణ లభించకపోవడం, పోటీదారుల నుండి వస్తున్న మరింత శక్తివంతమైన, ఫీచర్-రిచ్ బైక్‌ల నుండి గట్టి పోటీ ఉండటం కూడా ఈ నిర్ణయానికి దారితీసింది. అయితే, బీఎండబ్ల్యూ తమ ఇతర మోడళ్లను భారతీయ మార్కెట్‌లో విక్రయించడం కొనసాగిస్తుంది.