Haldiram Snacks: అమ్మకానికి హల్దీరాం: భారతీయతను కోల్పోనున్న మరో దిగ్గజ కంపెనీ

నాగ్ పూర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హల్దీరాం స్నాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరంలో 3,622 నికర ఆదాయాన్ని నమోదు చేసింది. ఢిల్లీలోని హాల్దిరామ్ స్నాక్స్ అదే ఆర్థిక సంవత్సరంలో 5,248 కోట్ల విక్రయాలను కొనసాగించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 14, 2024 3:25 pm

Haldiram Snacks

Follow us on

Haldiram Snacks: హల్దీరాం.. ఈ కంపెనీ పేరు చెప్తే చాలు స్నాక్స్, సోం పాపిడి, ఇతర తినుబండారాలు గుర్తుకొస్తాయి. 1937 రాజస్థాన్ లోని బికనీర్ ప్రాంతంలో ఈ సంస్థ ఏర్పాటైంది. ఈ సంస్థను అగర్వాల్ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. అప్పటినుంచి దినదిన ప్రవర్ధమానంగా ఈ సంస్థ ఎదుగుతోంది. ఢిల్లీ, నాగ్ పూర్ ప్రాంతాలలో హల్దీ రామ్ సంస్థకు తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఈ సంస్థ మనదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ వివిధ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఇటీవల నాగ్ పూర్ ప్రాంతంలోని హల్దీరాం ఫుడ్స్ ఇంటర్నేషనల్, ఢిల్లీలోని హల్దీరాం స్నాక్స్ ను విలీనం చేసి హల్దీరాం స్నాక్స్ ఫుడ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. హల్దీరాం స్నాక్స్ ఫుడ్ సంస్థలో ఢిల్లీ వర్గానికి చెందిన మధుసూదన్ అగర్వాల్, మనోహర్ అగర్వాల్ కుటుంబాలకు 55 శాతం, నాగ్ పూర్ వర్గానికి చెందిన కమల్ కుమార్ శివకిషన్ అగర్వాల్ కుటుంబానికి 45 శాతం వాటా ఉంది. పూర్తి భారతీయతను కలిగి ఉన్న హల్దీరాం కంపెనీ ఇప్పుడు చేతులు మారనుంది. వాస్తవానికి ఈ కంపెనీలో వాటా కోసం ఎప్పటినుంచో విదేశీ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అప్పట్లో బైన్ క్యాపిటల్, వార్ బర్గ్ పింకస్, జనరల్ అట్లాంటిక్ వంటి సంస్థలు 2016-17 నుంచి సంప్రదింపులు జరుపుతున్నాయి.. 2018-19 లోనూ కెల్లాగ్స్ అనే కంపెనీ కూడా చర్చలు జరిపింది.. పెప్సికో సంస్థకు చెందిన ఇంద్రా నూయి కూడా వాటాల కోసం సంప్రదింపులు కొనసాగించింది. అయితే అవేవీ ఒక కొలిక్కి రాలేదు. తాజాగా టాప్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్ స్టోన్ నేతృత్వంలోని గ్లోబల్ కన్సార్టియం, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, సింగపూర్ జీఏసీ సంస్థలు హల్దిరామ్ స్నాక్ ఫుడ్ లో 76 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు బిడ్ సమర్పించాయి. మరి కొద్ది నెలల్లో ఈ వాటాల కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారం నేషనల్ కంపెనీస్ ట్రిబ్యునల్ లా పరిధిలోకి వెళ్లిందని తెలుస్తోంది.

నాగ్ పూర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హల్దీరాం స్నాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరంలో 3,622 నికర ఆదాయాన్ని నమోదు చేసింది. ఢిల్లీలోని హాల్దిరామ్ స్నాక్స్ అదే ఆర్థిక సంవత్సరంలో 5,248 కోట్ల విక్రయాలను కొనసాగించింది. ఈ సంస్థ 100 కంటే ఎక్కువ దేశాలలో ఉత్పత్తులను విక్రయిస్తోంది. హల్దీరాం ఇటీవల కోకోబే అనే చాక్లెట్ తయారీ సంస్థను కొనుగోలు చేసింది. బ్రిటానియా, క్యాడ్బరీ వంటి సంస్థతో పోటీ పడాలని భావిస్తోంది. కోకోబే మాత్రమే కాకుండా బాబాజీ నమ్ కీన్, ఆకాశ్ నమ్ కీన్, అటాప్ ఫుడ్స్ వంటి సంస్థలను కూడా కొనుగోలు చేసింది.

హల్దీరాం 1800 కోట్ల విలువైన లావాదేవీలు కొనసాగించే రెస్టారెంట్ వ్యాపారం కూడా నిర్వహిస్తోంది. బహిరంగ మార్కెట్లో ఇంతటి పోటీ ఉన్నప్పటికీ స్నాక్స్ వ్యాపారంలో నెంబర్ వన్ స్థానంలో హల్దీరాం కొనసాగుతోంది.. 500 రకాల ఉత్పత్తులను విక్రయిస్తోంది.. నామ్ కీన్, భుజా, స్వీట్స్, రెడీ టు ఈట్ మీల్స్, బిస్కెట్లు, నాన్ కార్బోనేటెడ్ డ్రింక్స్ తయారు చేసి విక్రయిస్తోంది.. హల్దీ రామ్ గ్రూపులోని అన్ని సంస్థలు కలిపి గత ఆర్థిక సంవత్సరంలో 14,500 కోట్ల విక్రయాలు జరిపాయి. ఒక అంచనా ప్రకారం భారతదేశంలో 2025 నాటికి స్నాక్స్ వ్యాపారం 1.19 లక్షల కోట్లకు చేరుకుంటుంది. అందులో మెజారిటీ వాటా హల్దీరాం దే. అయితే ఈ కంపెనీలో వాటాల కొనుగోలుకు సంబంధించి సీఈవో కేకే చుటాని.. “అవును. చర్చలు జరుగుతున్నాయి. తుది ఆమోదం త్వరలో కార్యరూపం దాల్చుతుందని”వ్యాఖ్యానించారు.. అయితే ఈ డీల్ ఎంతనేది ఇంతవరకూ స్పష్టం చేయలేదు. అయితే వ్యాపార వర్గాల అంచనా ప్రకారం ఇది అతి పెద్ద భారీ డీల్ అని ప్రచారం జరుగుతోంది..

ఇది ఒకరి నిర్వహణలో లేకపోవడం.. ముగ్గురు వ్యక్తుల సంస్థ కావడం.. నిర్వహణ భారంగా ఉండడం.. కార్మికుల, ఇతర కార్యకలాపాల విషయంలో ప్రతీరోజు పర్యవేక్షణ తప్పనిసరిగా ఈ వ్యాపారం తలకు మించిన భారం అవుతోంది. లాభాలు వస్తున్నా పర్యవేక్షణ పెరిగిపోయిందట… అందుకే ఇంతటి టఫ్ వ్యాపారం నిర్వహించడం కంటే అమ్మడం మేలని.. ఇక హల్దీరామ్ లోని భాగస్వాముల మధ్యన ఆధిపత్య పోరు కూడా కంపెనీ అమ్మకానికి పురిగొల్పిందని మార్కెట్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.