Homeబిజినెస్Arushi Agarwal: కోటి జీతం కాదని.. కోట్ల రూపాయల వ్యాపారం!

Arushi Agarwal: కోటి జీతం కాదని.. కోట్ల రూపాయల వ్యాపారం!

Arushi Agarwal: పుట్టిన ఊరు తొలిసారి దాటిందామె.. అమ్మానాన్నల్ని వదిలిపెట్టి దూరంగా ఉండటమూ అదే మొదటిసారి. ‘నీకెప్పుడు మాట్లాడాలి అనిపించినా ఫోన్‌ చెయ్యి’ అని మొబైల్‌ చేతిలో పెట్టారు. నంబరు డయల్‌ చేస్తే ‘తగినంత బ్యాలెన్స్‌ లేదు.. రీఛార్జ్‌ చేయండి’ అన్న సమాధానం.. ఫోన్‌ వెనక్కి తిప్పి, బ్యాటరీ తీసి.. తన వద్దనున్న రూ.పది పెట్టి తిరిగి ప్రయత్నించిందట.. అలాంటమ్మాయి చదువయ్యాక మూడేళ్లలో కోట్ల వ్యాపారాన్ని సృష్టించింది. ఎంతోమందికి ఉద్యోగాలు కల్పిన్న ఆమే ఆరుషి అగర్వాల్‌..

స్ఫూర్తిదాయక ప్రయాణం..
‘బాగా చదివితేనే భవిష్యత్తు బాగుంటుంద’న్న అమ్మానాన్న మాటల్ని వింటూ పెరిగింది ఉత్తర్‌ప్రదేశ్‌లోని మురాదాబాద్‌కు చెందిన ఆరుషి. వారిది మధ్యతరగతి కుటుంబం. అమ్మానాన్న ఇద్దరూ విద్యావంతులే. దీంతో మొదట్నుంచీ ఆమె దృష్టి బాగా చదవడంపైనే. ఈమెకో ప్రత్యేక అలవాటుండేది. చదివిన ప్రతి విషయాన్నీ నిజ జీవితంలో ఉపయోగించేది. దాంతో సబ్జెక్ట్‌ని ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చన్నది ఆమె అభిప్రాయం. ఇంటర్‌ పూర్తయ్యింది. తర్వాత ఇంజినీర్‌ అవ్వాలనుకొంది. కానీ ఏ బ్రాంచ్‌? ‘కంప్యూటర్‌ సైన్స్‌ తీసుకో. మంచి ఉద్యోగాలు వస్తాయట’ అన్న నాన్న సలహాతో దానిమీద దృష్టిపెట్టింది.

‘సి’ తెలియక..
అప్పట్లో ఇంజినీరింగ్‌ అంటే ఐఐటీనే.. దానికోసం శిక్షణ ప్రారంభించింది. కానీ సీటు రాలేదు. దాంతో వేరే కాలేజీలో చేరడం కోసం తొలిసారి ఊరు దాటింది ఆరుషి. ‘టెక్నాలజీ పరిచయం లేదు. రీఛార్జ్‌ ఎలా చేయాలన్నదీ తెలీదు. అలాంటి నేను కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ కోసమని ఒంటరిగా నోయిడాకొచ్చా. ఎంత కష్టపడ్డానో మాటల్లో చెప్పలేను. ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ ‘సి’ అని లెక్చరర్‌ చెబితే ‘ఎస్‌ఈఈ’ అని రాసుకున్నా. అందరూ నవ్వుతోంటే మానేసి వెనక్కి వెళదామనుకున్నా. నాన్న గుర్తొచ్చేవారు. ఒత్తిడి, భవిష్యత్తేంటన్న భయం. ఇలా కాదని నన్ను నేను స్థిమితపరచుకున్నా. ఉదయం 5కి నారోజు మొదలయ్యేది. తరగతులకు ముందు, తర్వాత నా సమయమంతా లైబ్రరీలోనే గడిచేది. పట్టుబట్టి కోడింగ్‌ నేర్చుకున్నా. ఎన్నో వైఫల్యాలు.. వెక్కిరింతలు. అందరూ కాలేజ్‌ తర్వాత ఆనందంగా గడుపుతోంటే నా ప్రపంచమంతా పుస్తకాలే’ అనే ఆరుషి.. క్రమంగా కోడింగ్‌పై పట్టు సాధించి కాలేజ్‌ ప్రోగ్రామింగ్‌ హబ్‌కి కోఆర్డినేటర్‌ అయ్యింది. కళాశాల యాజమాన్యం ఈమెను స్వయంగా ఐఐటీ దిల్లీలో ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌కి ఎంపిక చేసే స్థాయికి ఎదిగింది.

పిచ్చి పట్టిందన్నారు
చివరి సంవత్సరం.. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు మొదలయ్యాయి. ఆమె, తన స్నేహితులు మంచి సంస్థలో ఉద్యోగం ఖాయమనుకున్నారు. వాళ్లంతా మంచి కోడర్స్‌. ఎన్నో పోటీల్లో గెలిచినా విఫలమయ్యారు. ‘అప్పుడే నియామక ప్రక్రియలో ఏదో తేడా ఉందనిపించింది. టెక్నికల్‌ అంశాలకు బదులు ఇతర వాటిపై దృష్టిపెట్టేవారు. అలాగే ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ఉండే అవకాశాలు సాధారణ కాలేజీ విద్యార్థులకు లేకపోవడం గ్రహించా. ప్రతిభ, నైపుణ్యాలున్నా ఈ పరిస్థితేంటి అనిపించింది. దీనికేదైనా పరిష్కారం కనుక్కోవాలనుకున్నా. అదే సమయంలో నాకెన్నో ఆఫర్లు. రూ.కోటి ప్యాకేజీ వాటిలో ఒకటి. నా ఆలోచనకు రూపమివ్వడానికి ఉద్యోగాన్ని కాదనుకున్నా. అది విని అందరూ పిచ్చిపట్టిందన్నారు. ఒప్పించాలనుకున్నా నేను వినిపించుకోలేదు. అలా 2018లో స్నేహితుడితో కలిసి రూ.లక్ష పెట్టుబడితో ‘టాలెంట్‌ డీక్రిప్ట్‌’ ప్రారంభించా. కోడర్లకు స్కిల్స్‌ను పరీక్షించుకునే ప్లాట్‌ఫాం ఇది. చీటింగ్‌ అవకాశం లేకుండా రూపొందించా. పూర్తిచేస్తే నేరుగా ఇంటర్వ్యూకు హాజరవొచ్చు. ఎన్నో ఆశలతో సంస్థలకు వెళితే డెమో అవకాశమూ ఇవ్వలేదు. ఏడాదిపాటు ఇదే పరిస్థితి. స్నేహితులంతా స్థిరపడ్డారు. బంధువుల చిన్నచూపు.. అమ్మానాన్నల నిరాశ. చివరకు ఓరోజు డెమో అవకాశం వచ్చింది. తర్వాతి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. ఎన్నో స్వదేశీ, విదేశీ సంస్థలు మాతో చేతులు కలిపాయి. మూడేళ్లలో టర్నోవర్‌ రూ.50 కోట్లు దాటింది. మా సాఫ్ట్‌వేర్‌ ద్వారా 10 లక్షల మంది ఉద్యోగాలు పొందార’ అని ఆనందంగా చెబుతోంది 27 ఏళ్ల ఆరుషి. ‘కథ సుఖాంతమని చెప్పలేను. ఇప్పటికీ ఎన్నో సవాళ్లు. కాకపోతే ఓటమినీ పాఠంగా తీసుకొనే తత్వం నాది. దాన్ని అర్థం చేసుకుంటే ఎవరికైనా విజయం సాధ్యమే’నని సలహానీ ఇస్తోంది.

టాలెంట్‌ ఉంటే అవకాశాలు..
టాలెంట్‌ ఎవరి సొంతం కాదు. అందనిలో ఏదో ఒక టాలెంట్‌ ఉంటుంది. దానిని సరైన సమయంలో.. సరైన వేదికపై ప్రదర్శిస్తే అవకాశాలు అవే వేతుక్కుంటూ వస్తాయి. ఇందుకు నిదర్శనం ఆరుషి. సబ్జెక్టుపై పట్టు సాధించిన ఆరుషికి తనపైతనకు నమ్మకం కలిగింది. ఆత్మవిశ్వాసం పెరిగింది. దీంతో తాను పనిచేయడం కన్నా.. పది మందికి పని కల్పించడం మేలనుకుంది. ఈ క్రమంలోనే ఆమె స్థాపించిన ‘టాలెంట్‌ డీక్రిప్ట్‌’ ఎంతో మందికి నైపుణ్యం పెంచుకునే అవకాశం కల్పిస్తోంది. ఉపాధికి దారిచూపుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular