Homeబిజినెస్Adani Group: అమెరికాలో అదానీ పై అరెస్టు వారెంట్.. తెలంగాణలో ప్రకంపనలు.. రేవంత్ ను కార్నర్...

Adani Group: అమెరికాలో అదానీ పై అరెస్టు వారెంట్.. తెలంగాణలో ప్రకంపనలు.. రేవంత్ ను కార్నర్ చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీ

Adani Group: మనదేశంలో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి పలు రాష్ట్రాల ప్రభుత్వాలకు అదాని ₹2,029 కోట్ల లంచాలు ఇచ్చారని తెలుస్తోంది. దీనిపై అమెరికాలోని న్యూయార్క్ లో గౌతమ్ అదానీ పై కేసులో నమోదయ్యాయి.. అయితే ఈ వ్యవహారం అమెరికాలో మొదలై.. ఏకంగా భారత్ లో సంచలనం సృష్టించింది.. దీనిపై రాజకీయ పార్టీలు “నువ్వా నేనా” అన్నట్టుగా విమర్శలు చేసుకుంటున్నాయి.. గౌతమ్ ఆదాని అరెస్టుకు జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏర్పాటు చేయాలని.. అతడి వ్యవహారాలపై విచారణ కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇదే పల్లవిని తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీ కూడా అందుకుంది. అయితే రాహుల్ చేసిన వ్యాఖ్యలను కేంద్రంలోని బిజెపి నాయకులు బలంగా తిప్పి కొట్టారు. ” తెలంగాణలో మీ పార్టీ అధికారంలో ఉంది. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌతమ్ అదాని తో భేటీ అయ్యారు. ఇక్కడ నిర్మిస్తున్న స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్లు విరాళం కూడా ఇచ్చారు. పలు ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దావోస్ పర్యటనలో 12 వేల కోట్లకు మించి వ్యాపార ఒప్పందాలు చేసుకున్నారు. మరి దానిపై ఏం మాట్లాడతారంటూ” బిజెపి జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారంలో రేవంత్ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది..

భారత రాష్ట్ర సమితి కూడా

భారత రాష్ట్ర సమితి కూడా రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఆరోపణలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఆదానితో రేవంత్ రెడ్డి అల్లుకుపోతున్నారని.. అతని కొడుకు కరణ్ తో అనేకమార్లు సమావేశమయ్యారని.. స్కిల్ యూనివర్సిటీకి ఆదాని 100 కోట్లు విరాళం ఇచ్చారని ఆరోపణలు చేస్తోంది.. విద్యుత్ ఒప్పందాల కోసం అదాని గ్రూప్ భారీగా ముట్ట చెప్పినప్పుడు.. ఇక్కడ ఎంత ముట్టాయోనని విమర్శలు చేస్తోంది..”రేవంత్ అదానిది అపవిత్ర బంధం.. రాహుల్ వద్దని చెప్పినప్పటికీ రేవంత్ గౌతమ్ అదానితో చెట్టా పట్టాలు వేసుకొని తిరిగారు. అదానీ ని రాహుల్ వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ మాత్రం అనుబంధం పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అదానీ కి దేశ సంపదను దోచుపెడుతున్నారని రాహుల్ విమర్శిస్తున్నారు. రేవంత్ మాత్రం ఇందుకు భిన్నమైన దారిలో నడుస్తున్నారు. గౌతమ్ అదాని, ఆయన కుమారుడు కరణ్ అదానితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేకసార్లు సమావేశం అయ్యారు. పైకి ప్రభుత్వ ఒప్పందాలని చెబుతున్నారు. లోపల మాత్రం ఏదో జరిగింది.. ఈ ఏడాది జనవరి 23న దావోస్ లో గౌతమ్ అదానితో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అక్టోబర్ 18న కూడా గౌతమ్ అదానీని రేవంత్ కలిశారు. అదాని కుమారుడు కరణ్ తో జనవరి మూడున రేవంత్ భేటీ అయ్యారని” భారత రాష్ట్ర సమితి నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే అర ఢిల్లీలో బిజెపి, ఇటు గల్లీలో భారత రాష్ట్రపతి నాయకులు కార్నర్ చేయడంతో రేవంత్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

భట్టి విక్రమార్క ఏమంటున్నారంటే..

రేవంత్ ను కార్నర్ చేసుకొని భారత రాష్ట్ర సమితి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. ” రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా రావచ్చు. కంపెనీలు ఏర్పాటు చేసి, యువతకు ఉద్యోగాలు ఇస్తామంటే మేము స్వాగతిస్తాం. అభివృద్ధి కోణంలో మాత్రమే మేం పని చేసాం. అంతేతప్ప లంచాలు, ఇతర అవినీతి వ్యవహారాలు మాకు తెలియదు. అదానిపై కేసు నమోదయింది న్యూయార్క్ లో. ఇక్కడ కాదు. దర్యాప్తు సంస్థలు తన పని తాము చేస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వపరంగా ఎటువంటి తప్పులు జరగలేదు. అవకతవకలు చోటు చేసుకోలేదు. రేవంత్ పై విపక్షాలు చేస్తున్న విమర్శలు పూర్తిగా అర్ధరహితమని” భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular